Etala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల సంచలన కామెంట్స్.. ఆ ఇద్దరూ కేసీఆర్ బాధితులే..
ABN, First Publish Date - 2023-09-10T12:18:13+05:30
వైరాలో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే బాణోతు
- అత్యంత విధేయత ప్రకటించడం వల్లే వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు అవమానాలు
- ఓడిపోయాక మదన్‌లాల్‌కు ప్రగతిభవన్ గేటుకూడా తెరవలేదు
- రాష్ట్ర బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్
వైరా(ఖమ్మం): వైరాలో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ సీఎం కేసీఆర్ బాధితులేనని రాష్ట్ర బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(Etala Rajender) పేర్కొన్నారు. ఇద్దరూ కేసీఆర్ వద్ద అవమానాలకు గురైనవారేనని వ్యాఖ్యానించారు. గిరిజన ఎమ్మెల్యేగా ఉన్న రాములునాయక్(Ramulunaik) ఇంకా పదవి నుంచి దిగిపోకముందే ఆయన అధికారాలకు మంత్రి పువ్వాడ ద్వారా కేసీఆర్ కత్తెర వేయించారని విమర్శించారు. ఇప్పుడు టిక్కెట్ లభించిన మదన్‌లాల్ కూడా గత నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ నుంచి అవమానాలను అనుభవించినవాడేనని తెలిపారు. వైరాలో శనివారం నియోజకవర్గస్థాయిలో పోలింగ్ బూత్ జెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఈటల ప్రసంగించారు. వైరాలో బీజేపీ సమావేశం విజయవంతం కావడం పట్ల నాయకులను ఈటల అభినందించారు. వైరా ఎమ్మెల్యేను ఆయన పదవీకాలం పూర్తికాకముందే ఆయన్ను కేసీఆర్ గడ్డిపరకలా తీసివేశారని వ్యాఖ్యానించారు. ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. రాములునాయక్ గిరిజన ఎమ్మెల్యే, పేదవాడు, నోట్లో నాలుక లేనివాడు కావడమే కాకుండా కేసీఆర్‌కు అత్యంత విధేయతను ప్రకటించినందునే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మదన్‌లాల్ తానూ హాస్టల్‌లో కలిసి చదువుకున్నామని, గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక రాములునాయక్‌ను బీఆర్‌ఎ్‌సలోకి తీసుకొని మదన్‌లాల్ ప్రగతిభవన్‌గేట్ వద్ద పడిగాపులు కాసినా కేసీఆర్ ఆయనకు అపాయిట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించారన్నారు. ఆ విషయాన్ని మదన్‌లాల్ తనకు అనేకసార్లు చెప్పుకొని బాధపడేవాడని ఈటల వివరించారు. రాములునాయక్, మదన్‌లాల్ ఇద్దరూ కూడా కేసీఆర్ బాధితులేనన్నారు.
కేసీఆర్ ఒక దొర అని, ఆయన దగ్గర అందరూ జీతగాళ్లేనని వ్యాఖ్యానించారు. ఆదివాసీ గిరిజన జిల్లాలైన ఆదిలాబాద్, వరంగల్‌లలో కేవలం మూడేసి నియోజకవర్గాలు మాత్రమే గిరిజనులకు ఉన్నాయని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు గిరిజన నియోజకవర్గాలున్నా గిరిజనులను కేసీఆర్ వంచిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ది చెప్పి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. వైరాలో కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అంతకముందు వైరాలో నిర్వహించిన ర్యాలీలో ఈటలతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈటలను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, సురే్‌షరెడ్డి, మాజీమంత్రి రవీందర్‌నాయక్, నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, శ్రీశైలం గౌడ్, అశ్వథామరెడ్డి, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, గల్లా సత్యనారాయణ, సంపత్‌నాయక్, భూక్యా శ్యాంసుందర్, రామలింగేశ్వరరావు, రవీందర్, నెల్లూరి కోటేశ్వరరావు, కృష్ణరాథోడ్, డాక్టర్ పాపారావు, జానకీరామారావు, ఏలే భద్రయ్య, వెంకటకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2023-09-10T12:18:15+05:30 IST