BRS: చీమలపాడు ఘోర ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి... మంత్రుల ఆరా
ABN, First Publish Date - 2023-04-12T14:40:11+05:30
జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేశారు.
ఖమ్మం: జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ (BRS) ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిసి ఆవేదన చెందారు. వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay), ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఎంపీ నామా నాగేశ్వర్‌రావులకు (MP Nama Nageshwar rao) ఫోన్లు చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM) ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాదంపై కేటీఆర్ ఆవేదన
వైరా నియోజకవర్గం కారేపల్లి అగ్నిప్రమాదంపైన మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా అధికారులు, నాయకులతో మంత్రి మాట్లాడారు.
ప్రమాదంపై మంత్రి హరీష్ రావు ఆరా
చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం ఘటనపై మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందటం బాధాకరం అన్నారు. ఘటన గురించి తెలియగానే మంత్రి ఆరా తీశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సుపరింటెండ్‌తో మాట్లాడి, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరం అయితే క్షత గాత్రులను నిమ్స్ ఆసుపత్రికి తరలించి, అత్యున్నత వైద్యం అందించాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.
Updated Date - 2023-04-12T14:40:11+05:30 IST