TSRTC : ఆర్టీసీ విలీనంపై 5 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ పలుకులివీ.. వీడియో వైరల్..
ABN, First Publish Date - 2023-08-01T14:12:32+05:30
ఇది హండ్రెడ్ పర్సెంట్ అసంభవం.. గవర్నమెంట్‌లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగే పని కాదు. ఏపీలో చేస్తున్నారు కదా? చూద్దాం కదా? ఏపీలో ఏం జరిగిందో..! అక్కడొక ఎక్సపర్మెంట్ చేశారు. అక్కడ ఏమీ మనుగడ జరగలేదు.. తెలియదా? కమిటీ వేశారంట.. మూడు నెలలకో.. ఆరు నెలలకో ఏదో చెప్తారంట కథ. ఏం చెబుతారనేది మీకు అర్థం కావట్లేదు. సీఎం జగన్ సంగతే చెబుతున్నా?
‘‘ఇది హండ్రెడ్ పర్సెంట్ అసంభవం.. గవర్నమెంట్‌లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగే పని కాదు. ఏపీలో చేస్తున్నారు కదా? చూద్దాం కదా? ఏపీలో ఏం జరిగిందో..! అక్కడొక ఎక్సపర్మెంట్ చేశారు. అక్కడ ఏమీ మనుగడ జరగలేదు.. తెలియదా? కమిటీ వేశారంట.. మూడు నెలలకో.. ఆరు నెలలకో ఏదో చెప్తారంట కథ. ఏం చెబుతారనేది మీకు అర్థం కావట్లేదు. సీఎం జగన్ సంగతే చెబుతున్నా? మైకులోనే చెబుతున్నా? దాచుకోవడం ఎందుకు? అక్కడ ఏం చేశారు.. ఆర్డర్ ఇచ్చి కమిటీ వేశారు?. ఏమవుతాదో... దేవునికే ఎరుకైతది? ఎస్.. ఐ యామ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్..! ఏ బీజేపీ రాష్ట్రంలోనైనా ఆర్టీసీని విలీనం చేశారా? మరి ఎందుకు చేయలేదు? మాట్లాడే బీజేపీ పవిత్రమైందేనా? రూలింగ్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదో చెప్పండి. మన పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వాలే కదా? ఉన్నాయి.. అక్కడెందుకు చేయట్లేదు?’’ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR). మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు లైవ్‌లో సమాధానమిచ్చారు. ఆ సమయంలో పక్కన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సీనియర్ నేతలు కూర్చుని ఉన్నారు. అందరూ ఉండగా ముఖ్యమంత్రి పబ్లిక్‌గా చెప్పిన ముచ్చట.
ఈ సందర్భం ఎప్పుడో.. ఏంటో మీకు గుర్తొచ్చే ఉంటుంది. అదేనండి. 2018లో రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు కొన్ని నెలల పాటు రోడ్డెక్కి సమ్మె చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. అప్పుడు సీఎం కేసీఆర్.. ప్రభుత్వ పెద్దలు ఏ మాత్రం మెట్టు దిగలేదు. కనీసం అటువైపు చూడలేదు. పట్టించుకున్న దాఖలాలు లేవు. సమ్మె టైంలో చాలా మంది కార్మికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.. అయినా కూడా ఏ మాత్రం గవర్నమెంట్ వెనకడుగు వేయకుండా కఠినంగా వ్యవహరించింది. చివరికి కార్మికులే సమ్మె విరమించి గత్యంతరం లేక విధుల్లో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు ప్లాష్ బ్యాక్ అంతా అర్థమైంది కదా? ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం..!
భూగోళం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదన్న ప్రభుత్వ పెద్దల స్వరం ఒక్కసారిగా మారిపోయింది. అప్పుడు అసంభవం అన్న వారే ఇప్పుడు సుసాధ్యం దిశగా అడుగులేస్తున్నారు. ఇంతలో ఎంత మార్పు? ఎంత మిరాకిల్? రెండోసారి ఈ ప్రభుత్వ కాలం ముగిసేలోపు ఎంత ఛేంజ్. ముఖ్యమంత్రి కేసీఆర్.. అప్పుడు అలా చెబితే.. 31-07-2023న తెలంగాణ కేబినెట్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ (KTR) మీడియా ముఖంగా ప్రకటించారు. ఐదేళ్లు తిరిగొచ్చేసరికి ఇంత ఛేంజ్ ఎలా వచ్చిందంటూ ప్రజలు, నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.
ఎన్నికల స్టంట్ కాదా?
మూడు.. నాలుగు నెలల్లో తెలంగాణలో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. మూడోసారి మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంది. ఇంకోవైపు కర్ణాటకలో గెలిచిన ఊపుమీద ఉన్న కాంగ్రెస్ కూడా తెలంగాణలో ఈసారైనా గెలవాలని శాయశక్తులా కృషి చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా అదే ప్రయత్నంలో ఉంది. ఇలా.. ఆ రెండు పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్.. అంతే స్థాయిలో వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నారు. అందుకే ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయడం.. బీసీ, మైనార్టీలకూ లక్ష రూపాయల సాయం.. దివ్యాంగులకు రూ.4,116 వేల వరకు పింఛన్ పెంచడం, వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, తాజాగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయడం.. ఇలా ప్రతి వర్గానికి గాలం వేస్తోంది. ఇవన్నీ కూడా ఎన్నికల్లో గెలిచేందుకు చేస్తున్న జిమ్మిక్కులేనని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇలా ప్రతి వర్గానికి తాయిలాలు ప్రకటించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయానికి ఇంకెన్ని హామీలు ఇస్తారోనని రచ్చబండల దగ్గర ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కూడా ఇందులో భాగమేనని ఎవరికి వారే విశ్లేషించుకుంటున్నారు.
Updated Date - 2023-08-01T14:26:58+05:30 IST