Godavari Express: కి.మీ మేర దెబ్బతిన్న ట్రాక్... అలాంటి బోగీలు కావడంతోనే..
ABN, First Publish Date - 2023-02-15T10:00:52+05:30
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం తెల్లవారుజామున ...
హైదరాబాద్: విశాఖపట్నం (Visakhapatnam) నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు (Godavari Express Train) బుధవారం తెల్లవారుజామున బీబీ నగర్ (BB Nagar)వద్ద పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. అయితే గోదావరి ఎక్స్‌ప్రెస్ (Godavari Express)లోని ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతిన్నది. సుమారు కిలోమీటర్ల మేర ట్రాక్ (Railway Track) దెబ్బతిన్నది. వెంటనే రైల్వే సిబ్బంది (Railway staff) అక్కడకు చేరుకుని మరమ్మత్తులు చేపట్టారు. ట్రాక్ రిపేర్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కాగా... ట్రాక్ దెబ్బ తినడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ -1, ఎస్ -2, ఎస్ - 3, ఎస్ - 4తో పాటు రెండు జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి. అయితే అధునాతన రైల్వే బోగీలు (Railway coaches) కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఎల్‌హెచ్‌సీ (LHC) సాంకేతికత ఆధారంగా కొత్త బోగీలు తయారు చేశారు. పట్టాలు తప్పిన ఆరు బోగీలను తిరిగి పట్టాల మీదకు తెచ్చి తరలించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టాలు తప్పిన ఆరు భోగిల్లో నాలుగు రిజర్వేషన్ బోగీలు ఉన్నాయి. ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినప్పటికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) రాకపోకలు సాగిస్తుండే విషయం తెలిసిందే. విశాఖలో సాయంత్రం 5.20కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15కు నాంపల్లి స్టేషన్‌లో గమ్య స్థానానికి చేరుకుంటుంది. సికింద్రాబాద్‌కు తెల్లవారుజామున 5.15కి చేరుకునే ఈ రైలులో కొన్ని వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
కిరండోల్ పాసింజర్ రైలు కూడా...
ఇటీవల కిరండోల్ పాసింజర్ రైలు (Kirandol Passenger Train)కు పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. జనవరి 17న ఉదయం 9.40 గంటల సమయంలో అరకు సెక్షన్ (Araku Section) పరిధిలోని శివలింగాపురం రైల్వే స్టేషన్ (Shivalingapuram Railway Station) సమీపంలో గల ఏడో నంబర్ టన్నెల్ వద్ద ఈ రైలు పట్టాలు తప్పింది. వెనుక నుంచి ఆరో బోగీ చక్రాలు పట్టాలు తప్పగా.. చివరిలో ఉన్న రెండు విస్టాడోమ్ కోచ్‌లు (Vistadome coaches) టన్నెల్‌లోనే ఉండిపోయాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై బోగీల నుంచి కిందకు దిగిపోయారు.
రైల్వే ఉన్నతాధికారులు (Railway officials) హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పిన ఆరో బోగీ నుంచి వెనుక గల బోగీల్లోని ప్రయాణికులను ముందున్న 11 బోగీల్లోకి మార్చారు. ఈ 11 బోగీలతో రైలు ముందుకు కదిలింది. మధ్యాహ్నం రెండు గంటలకు రైలు అరకులోయ చేరుకుంది. దీంతో కిరండోల్ వరకూ వెళ్లాల్సిన పాసింజర్‌ను అరకు వరకే పరిమితం చేశారు.
Updated Date - 2023-02-15T12:51:52+05:30 IST