చెవిలో ‘బంగారు చెంబు’!
ABN , First Publish Date - 2023-04-02T02:41:16+05:30 IST
నోట్ల కట్టలకు పూజ చేస్తే రెట్టింపు అవుతాయి. చెంబు బంగారు చెంబుగా మారుతుంది అంటూ ఓ ముఠా లక్షల రూపాయలు దోచుకుంది.

మాయమాటలతో అనేక మందిని మోసగించిన ముఠా
వీడియోలు చూపించి మరీ నమ్మించిన సభ్యులు
పలుమార్లు పూజల పేరిట 71.50 లక్షలు వసూలు
మహబూబ్ నగర్, ఏప్రిల్ 1: నోట్ల కట్టలకు పూజ చేస్తే రెట్టింపు అవుతాయి. చెంబు బంగారు చెంబుగా మారుతుంది అంటూ ఓ ముఠా లక్షల రూపాయలు దోచుకుంది. ఆ సొమ్ముతో భూమి, కారు కొని జల్సా చేసింది. పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ ఎస్పీ కే నరసింహ శనివారం వివరాలు తెలిపారు. ఏపీలోని నంద్యాల జిల్లా పాములపాడు మండలం బానుముక్కల గ్రామానికి చెందిన చెంచు రంగస్వామి, అతని భార్య భార్గవి, విష్ణు, మూల శేఖర్, గడ్డం విజయ్‌కుమార్, గడ్డం ప్రదీప్, గడ్డం దివాకర్ ముఠాగా ఏర్పడ్డారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందర్ని ఎంచుకొని పది నెలలుగా స్నేహం పెంచుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చని మాయమాటలు చెప్పారు. 2000, 500 నోట్ల కట్టలను కుప్పగా పోసి పూజలు చేస్తే అవి రెట్టింపు అయినట్టు తాము తీసిన ఓ వీడియో చూపించి నమ్మించారు. అయితే అందులో వాడినవి పిల్లలు ఆడుకునే బొమ్మనోట్లు.
ఒక చెంబుకు కెమికల్ పూసి, రేడియేషన్ చేయగా అది బంగారు చెంబుగా మారినట్టు మరో వీడియో చూపించారు. బాధితుల నుంచి పలుమార్లు పూజల పేరిట రూ.71.50 లక్షలు వసూలు చేసి, తరువాత కనిపించకుండా పోయారు. దోచుకున్న సొమ్ముతో రంగస్వామి, భార్గవి దంపతులు తమ గ్రామంలో 4 ఎకరాల 49 సెంట్ల భూమి, మహీంద్రా థార్ వాహనం కొన్నారు. మిగిలిన డబ్బుతో ఇతర నిందితులతో కలిసి జల్సా చేశారు. బాధితులకు చెందిన రెండు వాహనాలను బలవంతంగా తీసుకున్నారు. బాధితుల్లో ఒకరైన మిడ్జిల్‌కు చెందిన వివేకానందగౌడ్ ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం డబ్బు కోసం మళ్ళీ మిడ్జిల్‌కు వస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.18 లక్షల నకిలీ 2000, 500 నోట్లు, భూమి డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో భార్గవి, విష్ణు పరారీలో ఉన్నారు.