ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR Phone: గవర్నర్ నుంచి లేఖ రాగానే కేసీఆర్ ఫోన్ చేసి ఏం అడిగారంటే..!

ABN, First Publish Date - 2023-09-26T04:04:56+05:30

గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఇద్దరు అభ్యర్థుల ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాAజన్‌ తిరస్కరించిన విషయాన్ని ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఎందుకు దాచిపెట్టింది

  • కేసీఆర్‌ ఫోన్‌ చేసినా వెనక్కి తగ్గని గవర్నర్‌

  • దేని లెక్క దానిదే!.. తమిళిసై విలక్షణ శైలి

  • ప్రభుత్వ పెద్దలతో స్నేహంగా మసలుకుంటూనే..

  • రాజకీయ నిర్ణయాలపై నిర్ద్వంద్వంగా తిరస్కరణ

  • మంత్రిగా పట్నం ప్రమాణంలో సీఎంతో ముచ్చట

  • సచివాలయాన్ని దగ్గరుండి చూపించిన కేసీఆర్‌

  • ఇప్పుడు ‘ఎమ్మెల్సీ’ల తిరస్కరణతో మళ్లీ మొదటికి

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఇద్దరు అభ్యర్థుల ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించిన విషయాన్ని ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఎందుకు దాచిపెట్టింది? ఈ నెల 19నే గవర్నర్‌ లేఖ రాసినా ఎందుకు బయటపెట్టలేదు? ఆరు రోజుల తర్వాత, అది కూడా వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఎందుకు లీక్‌ చేసినట్లు? ఇప్పుడు రాష్ట్రంలో సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. సమయమొచ్చినప్పుడు దీనిని రాజకీయంగా వాడుకోవాలని అధికార బీఆర్‌ఎస్‌ భావించిందా? లేక గవర్నర్‌తో ఇంకా సంప్రదింపులు జరిపి, ఆమెను ఒప్పించే ప్రయత్నం చేసిందా? వెంటనే బయటపడితే ప్రభుత్వ పరువు పోతుందని జంకిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా... గవర్నర్‌ విషయంలో సీఎంవో కూడా కొన్ని విషయాలను ఉద్దేశపూర్వకంగానే దాచి పెడుతోందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర మంత్రిమండలి జూలై 31న జరిగిన సమావేశంలో ఆమోదించి.. ఆగస్టులో గవర్నర్‌కు పంపించిన విషయం తెలిసిందే.

అయితే అప్పటి నుంచి గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పరిశీలనలో పెట్టారు. గవర్నర్‌గా నాలుగేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 8న రాజ్‌భవన్‌లో తమిళిసై ‘ఎ కాఫీ టేబుల్‌ బుక్‌ - ప్యాషన్‌ ఫర్‌ పీపుల్స్‌ ప్రోగ్రెస్‌- ప్లాన్డ్‌ పర్స్యూట్స్‌’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను మీడియా ప్రతినిధులు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల ఎమ్మెల్సీ ప్రతిపాదనలపై ప్రశ్నించారు. అప్పుడే గవర్నర్‌ చాలా విస్పష్టంగా సమాధానం ఇచ్చారు. ‘గవర్నర్‌ కోటా కింద రాజకీయపరమైన నియామకాలు ఉండవు. ప్రతిపాదించిన అభ్యర్థుల అర్హతలు తప్పకుండా నిబంధనల ప్రకారం ఉండాలి. సాంస్కృతిక, సామాజిక సేవ, క్రీడలు వంటి రంగాల్లో సేవలందించినవారై ఉండాలి. ఒకవేళ ఆయా రంగాల్లో అభ్యర్థులు సేవలందించినవారైతే... నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా ప్రతిపాదనలపై సంతకం చేస్తాను. ఈ విషయాలను పరిశీలించడానికి నాకు ఇంకా కాస్త సమయం కావాలి. ఒకవేళ అభ్యర్థులు ఏ రంగంలోనూ ఫిట్‌ కాకపోతే అదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఈ విషయంలో రాజ్యాంగం కూడా గవర్నర్‌ను అడ్డకోజాలదు. అలాగని దీనిని నేను అడ్వాంటేజ్‌గా తీసుకోవడం లేదు’’ అని తమిళిసై స్పష్టంగా చెప్పారు. అంటే. అప్పటికే ప్రభుత్వానికి హెచ్చరిక సంకేతాలు పంపినట్లు అవగతమవుతోంది. కనీసం ప్రభుత్వం సర్దుకుని, గవర్నర్‌ సూచించిన రంగాల్లో అభ్యర్థులు ఫిట్‌ అవుతున్నారో లేదో సరి చూసుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యవక్తమవుతున్నాయి. గతంలో పాడి కౌశిక్‌రెడ్డి విషయంలోనే ప్రభుత్వానికి ఈ విషయం అనుభవమైనా మళ్లీ ఇద్దరు నాయకులు పేర్లను ప్రభుత్వం పంపించిందన్న అభిప్రాయాలున్నాయి. రాజకీయ రంగాన్ని కూడా సామాజిక సేవా రంగంగా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనలు చేస్తోంది. కానీ, గవర్నర్‌ రాజకీయ రంగాన్ని సామాజిక సేవా రంగం కింద పరిగణించడం లేదని స్పష్టమవుతోంది.

అందునే దాచిపెట్టారా?

దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణల పేర్లను ఎమ్మెల్సీలుగా తిరస్కరిస్తున్నట్లు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈ నెల 19ననే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపించారు. అంటే... సీఎంవోకు కూడా సమాచారం అందినట్లే లెక్క. టీఎ్‌సఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునిచ్చే టీఎ్‌సఆర్టీసీ బిల్లుకు ఈ నెల 14న గవర్నర్‌ ఆమోదం తెలిపారు. టీఎ్‌సఆర్టీసీ బిల్లు, ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు జూలై 31న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలోనే ఖరారయ్యాయి. అప్పుడే ఆర్టీసీ బిల్లును కూడా గవర్నర్‌కు పంపారు. ఐదు రోజుల తేడాతో రెండు అంశాలపై గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. టీఎ్‌సఆర్టీసీ బిల్లును ఆమోదించి, ఎమ్మెల్సీల ప్రతిపాదనలను తిరస్కరించారు. ప్రతిపాదనలను 19న తిరస్కరించగా... ఈ విషయం సోమవారం(25న) బయటకు పొక్కింది. ప్రభుత్వ వర్గాలే ఈ విషయాన్ని వాట్సాప్‌ గ్రూపుల ద్వారా బయట పెట్టాయి. దీంతో ఈ ఆరు రోజుల పాటు సీఎంవో ఎందుకు దాచిపెట్టిందన్నదానిపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్‌ను ఒప్పించడానికి ప్రభుత్వం తరపున ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరిగాయని సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆరే గవర్నర్‌కు ఫోన్‌ చేసి, ఇద్దరి పేర్లను ఆమోదించాలని కోరినట్లు తెలిసింది. ఇప్పటికే పాడి కౌశిక్‌రెడ్డి పేరును తిరస్కరించారని, కనీసం వీరిద్దరి పేర్లనైనా అంగీకరించాలని అడిగినట్లు సమాచారం. కానీ, గవర్నర్‌ ససేమిరా అన్నట్లు తెలిసింది. ఇప్పటికే బయట చాలా మంది వివిధ రంగాల నిష్ణాతులున్నారని, రాజ్యాంగం పేర్కొన్న అంశాల్లో ఎక్కడా ఫిట్‌ కాని ఇలాంటి వ్యక్తులను ఆమోదిస్తే... తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నట్లు సమాచారం. అయితే... గవర్నర్‌ తిరస్కరించిన అంశాన్ని ఆరు రోజుల పాటు దాచి పెట్టడం వెనుక ప్రభుత్వానికి కొంత భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికప్పుడు విషయాన్ని బయటపెడితే... సర్కారు పరువు పోతుందని వెనుకడుగు వేసినట్లు అర్థమవుతోంది. అందుకే కాస్త గ్యాప్‌ ఇచ్చి విషయాన్ని వాట్సాప్‌ గ్రూపుల ద్వారా బయటపెట్టినట్లు చర్చ జరుగుతోంది.

దేని లెక్క దానిదే!

రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) మధ్య విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల మధ్య వైరముందా? మైత్రీ బంధం కొనసాగుతోందా ? అంటే.. ఏదీ అర్థం కావడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పుడే సీఎం, గవర్నర్‌ కలిసి ముచ్చటించుకుంటున్నారని, మళ్లీ తిరస్కారాలు, అభ్యంతరాల అంశాలు తెరమీదకొస్తున్నాయని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే గవర్నర్‌ దేని లెక్క దానిదే అన్నట్లుగా, విలక్షణంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోందని అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇదే సరైన విధానమని కూడా కొంత మంది చెబుతున్నారు. రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలని, అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని అమలు చేయాలని అంటున్నారు. నిబంధనల విషయంలో నిక్కచ్చిగా ఉండాలని, సర్కారు పెద్దలతో స్నేహంగా ఉండాలని, సమయమొచ్చినప్పుడు తన పవరేంటో చూపాలని కూడా అంటున్నారు. గవర్నర్‌ వ్యవహార శైలి చూస్తుంటే ఇదే మాదిరిగా ఉందని చెబుతున్నారు. 2019 సెప్టెంబరు 8న రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌ ఇటీవలే నాలుగేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ నాలుగేళ్లలో ఏడాదిన్నర కాలం మాత్రమే ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య కాస్త మైత్రీ బంధం కొనసాగింది. అది కూడా గట్టి స్నేహ బంధం మాత్రం కాదు. అప్పటివరకు ఒకరి మనోభావాలు, అభిప్రాయాలు ఒకరికి తెలియకపోవడం, కొత్తగా వచ్చిన గవర్నర్‌ రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ తీరును అవగాహన చేసుకునే పనిలో ఉండడంతో ఏడాదిన్నర కాలం అట్టే గడిచిపోయింది. కానీ, రెండో సంవత్సరం(2021) ఆగస్టు నుంచి ఇరు ధ్రువాల మధ్య వైరం ముదిరింది.

కౌశిక్‌రెడ్డిని తిరస్కరించినప్పటి నుంచే..

గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ తిరస్కరించినప్పటి నుంచి అటు ప్రభుత్వం, ఇటు రాజ్‌భవన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, రాజ్‌భవన్‌లో జరిగే ఎలాంటి కార్యక్రమానికైనా ముఖ్యమంత్రి, మంత్రులు హాజరుకాకపోవడం జరిగాయి. కానీ... ఈసారి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గట్టి షాక్‌ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపలేదు. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా... ఇరు వర్గాల న్యాయవాదుల సంప్రదింపులతో అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం ఉండేలా చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై మధ్య విభేదాలు కాస్త చల్లబడినట్లు కనిపించాయి. కానీ, ఆగస్టు 15న రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమానికి సీఎం, మంత్రులు వెళ్లలేదు. దాంతో వైరం తగ్గలేదనుకున్నారు. అయితే... ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ మంత్రిగా ప్రకటించారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవం ఆగస్టు 25న రాజ్‌భవన్‌లో జరిగింది. అప్పుడు కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లడమే కాకుండా... గవర్నర్‌తో చాలా సేపు ముచ్చటించారు. అదే రోజు సచివాలయంలోని గుడి, మసీదు, చర్చిలను ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా సచివాలయం గురించి గవర్నర్‌కు వివరించారు. దాంతో మళ్లీ సయోధ్య కుదిరిందని భావించారు. కానీ... ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రతిపాదనలను గవర్నర్‌ తిరస్కరించడంతో మళ్లీ వైరం మొదటికొచ్చిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, గవర్నర్‌ నియమకాల విషయంలో నియమాలు పాటిస్తూనే.. రాజకీయ బంధాలను కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. ఏ సమయంలో ఏది అవసరమో అదే పాటిస్తున్నారని, ఇదో విలక్షణ శైలి అని అభివర్ణిస్తున్నారు.

Updated Date - 2023-09-26T11:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising