Mynampally Hanumanth Rao: ఏం చేయబోయేది త్వరలోనే ప్రకటిస్తా.. మైనంపల్లి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-08-22T11:01:59+05:30
‘నా మాటకి కట్టుబడి ఉన్నాను.. మాట తప్పను.. మెదక్‌లో నా కొడుకు కచ్చితంగా పోటీ చేస్తాడు. నేను ఏమి చెయ్యబోయ్యేది మెదక్, మల్కాజిగిరి ప్రజలతో చర్చించి త్వరలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తా. పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు’’ అని మైనంపల్లి అన్నారు.
తిరుమల: బీఆర్‌ఎస్ (BRS) నుంచి టికెట్ వచ్చినప్పటికీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Malkajigiri MLA Mynampally Hanumanth Rao) మనసు మార్చుకున్నట్లు కనిపించడం లేదు. మైనంపల్లి ఆయనతో పాటు కొడుకుకు కూడా బీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో (ABN-Andhrajyothy) మాట్లాడారు. ‘‘ ‘‘నా మాటకి కట్టుబడి ఉన్నాను.. మాట తప్పను.. మెదక్‌లో నా కొడుకు కచ్చితంగా పోటీ చేస్తాడు. నేను ఏమి చెయ్యబోయ్యేది మెదక్, మల్కాజిగిరి ప్రజలతో చర్చించి త్వరలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తా. పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. స్వామి సన్నిధిలో నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పాను. కుంభకోణంకీ వెళ్ళి వచ్చి..రెండు రోజుల్లో నా నిర్ణయాన్ని ప్రకటిస్తా. నా కొడుకు నాకు ముఖ్యం.. కొంత కాలంగా ప్రజా సేవ చేస్తున్నాడు. నా అవసరం ఎక్కడ ఉందో.. నేను అక్కడ వుంటాను. కార్యకర్తల నిర్ణయమే నా నిర్ణయం. నేను ఇప్పటి వరకు ఏ పార్టీతో మాట్లాడలేదు. మెదక్ సీట్ నా కొడుకు ఇస్తే. బీఆర్ఎస్ తరుపున ఇద్దరం కలిసి పోటీ చేస్తాం. ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తా’’ అంటూ మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. తిరుమల నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపిన ఆయన మల్కాజిగిరి టికెట్ వచ్చినప్పటికీ ఇంకా తిరుమలలోనే ఉండిపోయారు. తన కొడుకు పోటీపై నిర్ణయం రోహిత్‌కే (Rohit) వదిలేశానని నిన్న ప్రకటించిన మైనంపల్లి మళ్లీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా మైనంపల్లి హన్మంతరావు సోమవారం హైడ్రామాకు తెరలేపారు. సీఎం కేసీఆర్ (CM KCR) బీఆర్‌ఎస్ జాబితాను ప్రకటించక ముందే తిరుపతిలో మంత్రి హరీష్‌రావుపై (Minister Harishrao) తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. తన కుటుంబంలో ఇద్దరికీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాను అంటూ స్పష్టం చేశారు. దీంతో మైనంపల్లి పార్టీ మారబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. అయితే హరీష్‌రావును విమర్శించిన తర్వాత సీన్ రివర్స్ అవుతుందని అంతా భావించినప్పటికీ కేసీఆర్ మాత్రం మల్కాజ్‌గిరి నియోజవర్గం నుంచి మైనంపల్లికే అవకాశం ఇచ్చారు. దీంతో కూల్ అయిన మైనంపల్లి చివరికి తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంపై మల్కాజిగిరి నియోజకవర్గంలో సంబరాలు చేయాలని అభిమానులు, కార్యకర్తలు, అనుచరులకు విజ్ఞప్తి చేశారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే మైనంపల్లి ఆశించిన విధంగా ఆయన కుమారుడికి మాత్రం బీఆర్‌ఎస్ నుంచి టికెట్ దక్కలేదు. మెదక్ జిల్లా నుంచి పద్మాదేవేందర్‌రెడ్డికే కేసీఆర్ టికెట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే బీఆర్‌ఎస్ జాబితా ప్రకటించకముందే ఎంతో హడావుడి చేసి.. పార్టీ మారతారేమో అన్నట్లుగా సీన్ క్రియేట్ చేసి.. ఆ తరువాత టికెట్ కేటాయించగానే చల్లబడ్డ మైనంపల్లి.. ఈరోజు మరోసారి కుమారుడి విషయంలో చేసిన వ్యాఖ్యలు ఎక్కడికి దారి తీస్తాయో అని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
Updated Date - 2023-08-22T11:46:48+05:30 IST