Harishrao: పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసూ కరగ లేదు.. రేవంత్‌పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-07-11T14:16:06+05:30
ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ‘‘ధరణి వద్దు..రైతు బంధు వద్దు.. ఉచిత కరెంటు వద్దు..!’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ (CM KCR) పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారని మండిపడ్డారు. నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చ బడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నారని విమర్శించారు. పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసు కరగ లేదన్నారు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన శాస్తి చేయాలని పిలుపునిచ్చారు. రైతన్నకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
Updated Date - 2023-07-11T14:16:06+05:30 IST