Prof. Kodandaram: కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీనంపై కోదండరామ్ స్పందన..
ABN , First Publish Date - 2023-06-16T17:01:10+05:30 IST
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ (తెలంగాణ జన సమితి) విలీనం చేస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ...
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ (తెలంగాణ జన సమితి) విలీనం చేస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన టీజేఎస్ (TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ (Prof. Kodandaram) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ విలీనం అనే మాట ఎప్పుడు అనలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న నిరంకుశ పాలనను అంతమొందించి ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని.. అలాంటి ఐక్యతను సాధించే లక్ష్యంతో తప్పకుండా పనిచేస్తామని అన్నారు. ఏ పార్టీలో కలవకుండానే అందరినీ కలుపుకుని ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తామని చెప్పారు.
తనను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కలిసారనే వార్తల్లో వాస్తవం లేదని.. అసలు చర్చలే జరగలేదని కోదండరామ్ స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని, ఇక్కడ కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాదని, ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంలేదని, నిరంకుశత్వం కొనసాగుతోందని.. దాన్ని అంతమొందిచడానికి అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉందని, రాబోయే ఎన్నికలపై రాష్ట్ర కమిటీ మీటింగ్‌లో చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామిక పాలన రావాలని, దాని కోసం మహాకూటమిగా ఏర్పాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు.