Seethakka: ములుగు ఏ పాపం చేసుకుంది.. ఒక్కరూ రావడం లేదు
ABN, First Publish Date - 2023-08-03T18:15:16+05:30
శుక్రవారం అసెంబ్లీలో వరదలపై చర్చ జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. మోరంచపల్లి, వరంగల్ వరకు వస్తున్న మంత్రులు ములుగు నియోజకవర్గానికి ఎందుకు రావడం లేదు?, గవర్నర్, ముఖ్యమంత్రి మా ప్రాంతాల్లో పర్యటించాలి.
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో వరదలపై చర్చను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (Seethakka) డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘శుక్రవారం అసెంబ్లీలో వరదలపై చర్చ జరపాలని ముఖ్యమంత్రిని (Cm kcr) కోరుతున్నాం. మోరంచపల్లి, వరంగల్ వరకు వస్తున్న మంత్రులు ములుగు నియోజకవర్గానికి ఎందుకు రావడం లేదు?, గవర్నర్, ముఖ్యమంత్రి మా ప్రాంతాల్లో పర్యటించాలి. భారీ వర్షాలతో నిలువ నీడ లేకుండా చెట్ల కింద ఉండే పరిస్థితి ఏర్పడింది. లక్షలాది ఎకరాల పంట నష్టం జరిగింది. 50 మందికి పైగా మరణించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి భరోసా ఇస్తారనుకున్నాం. ములుగులో వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. 15 మంది కొట్టుకుపోయి చనిపోయారు. వందలాది ఇల్లు కూలిపోయాయి. ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి భరోసా కల్పించలేదు. చనిపోయిన వారికి రూ.15 లక్షలు, ఇల్లు కూలిపోయిన వారికి రూ.5 లక్షలు, సామాన్లకు లక్ష ఇవ్వాలి. ఎకరాకు 30 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తాత్కాలిక వంతెనలు నిర్మించి రవాణా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం రూ.500 కోట్లు అని ప్రకటన విడుదల చేశారు. కానీ దేనికి అని మాత్రం ఏం చెప్పలేదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందుతుంటే 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన రుణమాఫీపై ఇప్పుడు సంబరాలు చేసుకోవాలని చెబుతున్నారు. బ్యాంకులు రైతులను వేదిస్తున్నాయి. ఋణమాఫీ విధివిధానాలు వెంటనే తెలపాలి. వరద బాధిత కుటుంబాల సమస్య మాకు ఆవేదన కల్పిస్తుంది. అసెంబ్లీలో స్పష్టమైన చర్చ జరగాలి.’’ అని సీతక్క కోరారు.
Updated Date - 2023-08-03T18:15:16+05:30 IST