Atm Theft: బ్రేక్ చెయ్యకుండానే ఖాళీ చేసేశారు
ABN , First Publish Date - 2023-03-01T18:22:04+05:30 IST
సాంకేతిక పరిజ్ఞానంతో చోరీకి పాల్పడుతున్న ముఠాను అదే సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకుని కటకటాలకు పంపించారు పోలీసులు.

మహబూబ్‌నగర్ (ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానంతో చోరీకి పాల్పడుతున్న ముఠాను అదే సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకుని కటకటాలకు పంపించారు పోలీసులు. తెలివిగా కోడ్‌ను డీకోడ్ చేసి ఏటీఎం(ATM)ను బ్రేక్ చేయకుండానే దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాళ్లను టోల్‌గేట్ ఫాస్టాగ్ కోడ్ (Fastag) ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. పంజాబ్‌కు చెందిన గుర్ గగన్‌సింగ్ డిలో, భూపేందర్‌సింగ్, రష్‌పాల్, సందీప్‌సింగ్‌లు ఈ నెల10న రాజాపూర్ ఏటీఎంలో ఏజెన్సీ సిబ్బంది క్యాష్‌బాక్స్‌లోడబ్బులు పెట్టిన 10-15 నిమిషాల్లోనే దొంగిలించారు. ఏజెన్సీ సిబ్బంది మేన్యువల్ కోడ్‌కొట్టి ఏటీఎం క్యాష్‌బాక్స్‌ను ఓపెన్ చేసి క్యాష్‌బాక్స్‌లో డబ్బులు పెడుతుంటారు. ఇలాంటి మేన్యువల్ కోడ్ కలిగిన ఏటీఎంలను నిందితులు ఎంచుకుంటారు.
రాజాపూర్‌లోనూ అలాంటి ఏటీఎం ఉండటంతో వారంరోజులపాటు నిందితులు రెక్కీ నిర్వహించారు. ఏటీఎంలో క్యాష్‌బాక్స్ పాస్‌వర్డ్ తెలుసుకునేందుకు ముందుగానే వైఫై కెమెరాను అమర్చారు. ఆ కెమెరా ద్వారా నిందితుల ఫోన్‌కు వైఫై మోడెమ్ ద్వారా సమాచారం వెళ్లింది. డబ్బులు పెట్టి ఏజెన్సీ నిర్వాహకులు వెళ్లిన కొద్దిసేపటికే నిందితులు ఏటీఎంలోకి వెళ్లి పాస్‌వర్డ్ ద్వారా క్యాష్‌బాక్స్ ఓపెన్ చేసి డబ్బులు తీసుకుని ఫార్చునర్ కారులో ఉడాయించారు. ఏటీఎం నుంచి డబ్బులు రాకపోవడంతో గమనించిన ఏజెన్సీ నిర్వాహకులు చెక్ చేయగా అందులో నగదు లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
మొదట్లో నిర్వాకులపైనే అనుమానం...
పోలీసులు మొదట ఏటీఎంను పరిశీలించగా ఏటీఎం బ్రేక్ కాకుండానే డబ్బులు మాయమయ్యాయని గుర్తించారు. ఇందులో ఏటీఎం నిర్వాహకుల హస్తమే ఉంటుందని అనుమానంతో ముందుగా వారిని విచారించారు. ఈ విచారణలో వారి ప్రమేయంలేదని తేలడంతో మరో కోణంలో దర్యాప్తు చేపట్టగా.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అన్ని టెక్నికల్ అంశాలను పరిశీలించారు. ఒక టోల్‌గేట్ దగ్గర దొరికిన ఫాస్టాగ్ కోడ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరికోసం గాలిస్తున్న క్రమంలో మంగళవారం బాలానగర్ ఏటీఎం దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇధ్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా రాజాపూర్ ఏటీఎం చోరీ బయటపడింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇదే తరహా దొంగతనాలకు పాల్పడుతూ ఖరీదైన కార్లు కొంటూ జల్సాలకు పాల్పడుతున్నారు.
ఏటీఎం టెక్నీషియన్‌గా పనిచేసిన అనుభవంతో...
నిందితుల్లో ఒకరైన భూపేందర్‌సింగ్ బీసీఏ చదివాడు. ఏటీఎంలలో నగదు అప్‌లోడ్ చేయడం, మెషీన్ల రిపేర్లలో నైపుణ్యం ఉంది. 15ఏళ్లపాటు ఏటీఎం టెక్నీషియన్‌గా పనిచేశాడు. ఆశించిన స్థాయిలో డబ్బులు రాకపోవడంతో ఈజీగా మనీ సంపాదించాలనే ప్లాన్ వేశాడు. ఏటీఎంలపై తనకున్న పట్టును అడ్డంపెట్టుకుని ఏటీఎం దొంగతనాలకు తెగబడ్డాడు. గతేడాది డిసెంబరు సంగారెడ్డిలో ఇదే ముఠా ఏటీఎంలో రూ.30 లక్షలు, నల్లగొండలో రూ.3లక్షలు కాజేసింది. వీటితోపాటు పంజాబ్, రాజస్థాన్, చండీఘర్, ఉత్తరాఖండ్‌లలో దొంగతనాలు చేసి 2012లో ముఠా సభ్యులు జైలుకెళ్లి వచ్చారు. మళ్ళీ దొంగతనాలు చేస్తూ కటకటాలపాలయ్యారు. నిందితుల్లో గుర్ గగన్‌సింగ్ డిలో, భూపేందర్సింగ్‌లు అరెస్ట్ కాగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితులు దొంగిలించిన సొత్తుతో కొనుగోలు చేసిన ఫార్చునర్ కారు, రూ.5వేలు పోలీసులు రికవరీ చేశారు.