Minister Harish Rao: ప్రగతికి గవర్నర్‌ మోకాలడ్డు

ABN , First Publish Date - 2023-04-11T02:38:26+05:30 IST

అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులను ఆమోదించకుండా రాష్ట్ర ప్రగతిని గవర్నర్‌ తమిళిసై అడ్డుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కోర్టులను ఆశ్రయించిన తర్వాత గానీ తాము పంపిన బిల్లులను ఆమోదించలేదని మండిపడ్డారు.

Minister Harish Rao: ప్రగతికి గవర్నర్‌  మోకాలడ్డు

కోర్టులకు వెళ్తేనే బిల్లులు పాస్‌ చేస్తారా?

7 నెలలుగా సీఆర్‌బీ బిల్లును ఆపారేం?

ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారా?

విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయమా?

తమిళిసై తీరుపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం

సిద్దిపేట, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులను ఆమోదించకుండా రాష్ట్ర ప్రగతిని గవర్నర్‌ తమిళిసై అడ్డుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కోర్టులను ఆశ్రయించిన తర్వాత గానీ తాము పంపిన బిల్లులను ఆమోదించలేదని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా మంగోల్‌లో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌కు అనుసంధానంగా నిర్మించిన వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను మంత్రి ఎర్రబెల్లితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఏడు నెలలుగా బిల్లులను ఆపడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో కేసు వేస్తే సోమవారం మూడు బిల్లులు పాస్‌ చేశారని చెప్పారు. ఫారెస్టు వర్సిటీ ఏర్పాటు బిల్లుతోపాటు కామన్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు(సీఆర్‌బీ) బిల్లును ఏడు నెలలుగా ఆపి, ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపడంలో ఆంతర్యమేంటని నిలదీశారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్‌ చర్యలను తెలంగాణ సమాజం క్షమించదని, ఇప్పటికైనా అభివృద్ధికి గొడ్డలిపెట్టులా మారవద్దని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను కలుషితం చేస్తోందని, సరైన సమయంలో రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

మిషన్‌ భగీరథ వృథా కాదు.. ఆదా

ఇంటింటికీ మంచినీరు అందించే మిషన్‌ భగీరథతో డబ్బులు వృథా కాలేదని, ఆదా అయ్యాయని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ పథకం ఆచరణలోకి వచ్చాక ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, ఏజెన్సీ ఏరియాల్లో విష జ్వరాలు మాయమయ్యాయని వెల్లడించారు. మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రధాని హోదాలో మోదీ ప్రారంభించారే తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రూ.13వేల కోట్లు ఆర్థిక సాయం చేయాలని నీతి ఆయోగ్‌ సూచించినా.. పట్టించుకోలేదని మండిపడ్డారు. మల్లన్నసాగర్‌ వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంటు ద్వారా సిద్దిపేట, జనగామ, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి, మెదక్‌, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాలకు ప్రయోజనం చేకూరనుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Updated Date - 2023-04-11T02:38:26+05:30 IST