Delhi Liquor Scam : నేటి మధ్యాహ్నం మీడియా ముందుకు కవిత..
ABN, First Publish Date - 2023-03-09T09:12:24+05:30
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. కాగా.. నేటి మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడనున్నారు.
ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. కాగా.. నేటి మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam)లో ఈడీ (ED) పంపిన నోటీసులపై స్పందించే అవకాశం ఉంది. ఈ రోజు విచారణకు రావాలని ఈడీ పంపిన నోటీసులకు ఇప్పటికే కవిత సమాధానం ఇచ్చారు. 9, 10 తేదీల్లో ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా 11వ తేదీన విచారణకు హాజరవుతానని బుధవారం రాత్రి ఆమె ప్రకటన విడుదల చేశారు. రేపు ఢిల్లీ జంతర్ మంతర్ (Jantar Mantar) వేదికగా మహిళా రిజర్వేషన్ల బిల్లు పై ఒకరోజు దీక్ష చేయనున్నారు. శనివారం నాడు ఈడి ముందు విచారణకు హాజరుకానున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామాలు, ఈడీ నోటీసులపై అధికారికంగా మీడియా సమావేశంలో స్పందించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాలంటూ బుధవారం నోటీసులు ఇచ్చింది. చట్టసభల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో ఈ నెల 10న జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహిస్తున్నానని, ఆ ఏర్పాట్లలో బిజీగా ఉండడం వల్ల తాను రాలేనని కవిత సమాధానం ఇచ్చారు. అయితే ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఈడీ వెంటనే తాఖీదులు పంపింది. తనకు మరింత సమయం కావాలని కవిత కోరుతున్నారని, అయితే ఈడీ స్పందించడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. తొలుత మరింత గడువు కావాలని కోరినప్పటికీ బుధవారం అర్ధరాత్రి ఈ నెల 11నే విచారణకు హాజరయ్యేందుకు అంగీకరిస్తున్నట్లు కవిత తెలిపారు. ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు.
గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఒక మహిళను తన నివాసంలో విచారించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. వీటన్నింటినీ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని నిలదీశారు. కాగా, జంతర్‌మంతర్‌లో ధర్నా ఏర్పాట్ల కోసం కవిత బుధవారం రాత్రి మందీ మార్బలంతో ఢిల్లీ చేరుకున్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం నిర్వహిస్తున్నట్లు చెబుతున్న ఈ ధర్నాను కవితకు సంఘీభావ సభగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Updated Date - 2023-03-09T09:12:24+05:30 IST