Governor: పేపర్ లీక్‌పై తమిళిసై సీరియస్.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని TSPSC కార్యదర్శికి ఆదేశాలు
ABN , First Publish Date - 2023-03-14T20:48:44+05:30 IST
టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) నిర్వహించిన, నిర్వహించాల్సిన రిక్రూట్‌మెంట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా పరిగణించారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) నిర్వహించిన, నిర్వహించాల్సిన రిక్రూట్‌మెంట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా పరిగణించారు. పేపర్ లీక్ వ్యవహారంపై TSPSC కార్యదర్శికి లేఖ రాశారు. సమగ్ర విచారణకు ఆదేశించి, లీకేజీపై వివరణాత్మక నివేదికను ఇవ్వాలని గవర్నర్ లేఖలో పేర్కొన్నారు. అసలైన అభ్యర్థుల భవిష్యత్త్, ప్రయోజనాలను కాపాడటానికి ఇటువంటి దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులందరిపై పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని TSPSC కార్యదర్శికి గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు.
టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) పేపర్ లీక్ కేసు దర్యాప్తుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. TSPSC పేపర్ లీక్ కేసును సిట్‌కు బదిలీ చేసినట్లు పేర్కొంది. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో TSPSC పేపర్ లీక్ కేసుపై విచారణ జరగనుంది. TSPSC పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ వ్యవహారంపై రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. TSPSCకి వచ్చే పలువురితో ప్రవీణ్‌కు పరిచయాలు ఏర్పడ్డాయని, ప్రవీణ్ సెల్‌ఫోన్లో పలువురు మహిళల కాంటాక్ట్స్ ఉన్నాయని రిపోర్టులో తెలిసింది. ప్రధాన సర్వర్ నుంచి ప్రవీణ్ పేపర్ కొట్టేశారని, లూప్‌లో ఉన్న కంప్యూటర్ల ద్వారా ప్రవీణ్ పేపర్ తీసుకున్నారని అధికారులు స్పస్టం చేశారు. పేపర్ ప్రింట్ తీసి రేణుకకు ప్రవీణ్ షేర్ చేశారని, తమ కమ్యూనిటీలోని పలువురికి పేపర్ ఉందని రేణుక భర్త, సోదరుడు కలిసి కమ్యూనిటీలో ప్రచారం చేశారని చెప్పారు. ఒక్కో పేపర్‌కి రేణుక రూ.20 లక్షలు డిమాండ్ చేశారని, పేపర్ కొనుగోలుకు ఇద్దరు అభ్యర్థులు ముందుకొచ్చారని, ఇద్దరిని తమ ఇంట్లోనే ఉంచి రేణుక ప్రిపేర్ చేయించారని రిపోర్టులో వెల్లడైంది. పరీక్ష రోజున వనపర్తి నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి సరూర్‌నగర్‌లోని సెంటర్‌లో రేణుక వదిలిపెట్టారని, పేపర్ అమ్మడానికి రేణుక పలు ప్రయత్నాలు చేసిందని ABN చేతికి అందిన TSPSC పేపర్ లీకేజ్ రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది.