Andhra Pradesh : ‘గాలి’ని మించిన ఘనులు
ABN, Publish Date - Aug 26 , 2024 | 03:20 AM
ఈ నెల 4న ‘లేటరైట్ రైట్..’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
లేటరైట్ తవ్వకాల్లో అదే వ్యూహం
లీజు కంపెనీని తరిమేసి... తవ్వకాలు
పక్కనే మరో లీజు తీసుకుని ‘మాయ’
తమ గనుల్లోనే తవ్వినట్లుగా లెక్కలు
అక్కడే లేటరైట్ డంప్.. తరలింపు
అటవీ ప్రాంతంలోనూ యథేచ్ఛగా తవ్వకాలు
నాడు గుట్టుగా.. నేడు బహిరంగంగా దోపిడీ
‘తూర్పు’లో కొనసాగుతున్న వైసీపీ పెద్దల దందా
నేటికీ సహకరిస్తున్న వైసీపీ అస్మదీయ అధికారులు
అంతా సక్రమమేనని ప్రభుత్వానికి తప్పుడు నివేదిక
అన్యాయం
సక్రమంగా లీజు పొందిన కంపెనీని జరిమానాల పేరుతో వైసీపీ హయాంలో మూయించడం.
అక్రమం
పక్కనే మరో గని లీజు తీసుకుని.. మూయించిన కంపెనీకి కేటాయించిన ఏరియాలో తవ్వి రూ.కోట్లు పోగేసుకోవడం.
అకృత్యం
కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులను కూడా మేనేజ్ చేసి.. ‘అంతా బాగుందని’ నివేదికలు ఇప్పించడం.
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి అక్రమాల వ్యవహారం అందరికీ తెలిసిందే. ఇనుప ఖనిజం లీజు ఆంధ్రప్రదేశ్‌లోని ఓబుళాపురంలో!! తవ్వుకుంది మాత్రం కర్ణాటకలో! సరిహద్దులు చెరిపేసి మరీ జరిపిన దందా ఆయనది! ఇప్పుడు... రాష్ట్రంలో లేటరైట్ తవ్వకాల్లో అదే జరుగుతోంది! తామే బెదిరించి మూసివేయించిన గనిలో నాణ్యమైన లేటరైట్ తవ్వకాలు జరుపుతూ... దానిని తమ పరిధిలోని గనుల్లో తవ్వినట్లు చూపిస్తున్నారు. ఇలా చేస్తున్నది.. వైసీపీలోని ‘పెద్ద’ మనుషులు! సర్కారు మారినా వారి దందా మాత్రం సాగుతుండటమే విచిత్రం!
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో..
ఈ నెల 4న ‘లేటరైట్ రైట్..’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు ప్రత్తిపాడు ఏరియాకు వెళ్లి రెండు లీజు ఏరియాలు, అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అప్పుడు అసలు వాస్తవం బయటపడింది. జగన్ ప్రభుత్వంలో మూసివేయించిన ఓ ప్రముఖ కంపెనీ మైనింగ్ ఏరియాలో వైసీపీ పెద్ద తవ్వకాలు చేయిస్తున్నారని, అలా తవ్వితీసిన లేటరైట్‌ను ఆ సమీపంలోనే ఉన్న తన బినామీ కంపెనీ డంప్‌లో నిల్వచేస్తూ, దాన్ని అధికారికంగా అమ్ముకుంటున్నారని అధికారులు గుర్తించారు. పైగా పక్కనే ఉన్న అడవిలో కూడా అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని కూడా గుర్తించారు. కానీ, నివేదిక మాత్రం దీనికి భిన్నంగా ఇవ్వడం గమనార్హం.
లేట‘రైట్.. రైట్’!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
బెదిరించడం, భయపెట్టడం... గనుల్లో వాటాలు కొట్టేయడం! కాదూ కూడదంటే... భారీగా జరినామాలు వేయించి, అధికారుల ద్వారా ఆ గనులను మూసివేయించడం. వైసీపీ హయాంలో జరిగిన గనుల దందా ఇది! అదే క్రమంలో అంతకుమించిన ‘పెద్ద’ అక్రమం ఒకటి వెలుగులోకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో లేటరైట్ గనిని లీజుకు తీసుకున్న యజమానిని బెదిరించి, జరిమానాలు వేయించి... ఆ గనిని మూసివేయించారు. ఆ తర్వాత అదే గనిలో ఈ పెద్ద మనుషులే అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. అదీ చాలదని అడవిని సైతం గుల్లచేస్తున్నారు. ఈ అక్రమానికి ‘గాలి’ తరహా వ్యూహం అమలు చేస్తున్నారు. అక్కడే మరో లేటరైట్ గనిని లీజుకు తీసుకుని... తవ్వకాలన్నీ అక్కడే జరిగినట్లుగా మాయ చేస్తున్నారు. సొంత గని పెట్టుకుని, పక్క గనులపై పడటం ఎందుకంటారా? వాళ్ల గనుల్లోని లేటరైట్ అంత నాణ్యమైనది కాదు! అందుకే... తామే మూసివేయించిన గనిపై పడి దోచుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ పర్మిట్లు నిలిచిపోయినా.. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం లేటరైట్ తవ్వకాలు ఓ రేంజ్‌లో సాగిపోతున్నాయి. దీనికి కారణం... కూటమి సర్కారులోని అధికారులను కూడా వైసీపీ పెద్దలు ‘మేనేజ్’ చేయడమే అని తెలుస్తోంది. జిల్లాలోని రెవెన్యూ, గనుల శాఖ అధికారులు కొందరు వారికిఇప్పటికీ సలాం కొడుతున్నట్లు సమాచారం. అధికారులు సైతం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ అందంతా ‘అధికారికం’ అంటూ చెప్పుకొస్తుండడం గమనార్హం.
90 హెక్టార్లలో లీజు
తూర్పుగోదావరి జిల్లా ప్రతిప్తాడులో ఓ ప్రముఖ కంపెనీకి లేటరైట్ మైనింగ్ ఉంది. 90 హెక్టార్ల మేరకు లీజుకు తీసుకున్నారు. ఆ లీజుపై జగన్ హయాంలో కీలక పాత్ర పోషించిన వైసీపీ ‘పెద్ద’ కన్నుపడింది. అంతే! విజిలెన్స్‌లో తనవారుగా ముద్రపడిన కొందరు అధికారులను ఉసిగొలిపి దాడులు చేయించారు. రూ.70కోట్ల పెనాల్టీ కట్టాలని ఆదేశాలు ఇప్పించారు. అది చెల్లించలేదనే కారణంతో మైనింగ్‌ని నిలిపివేయించారు.
దాని పక్కనే మరో కంపెనీకి లీజు ఉంది. అది ఆ ‘పెద్ద మనిషి’ బినామీదే. అయితే, ఈ సంస్థకిచ్చిన భూముల్లో అంత నాణ్యమైన లేటరైట్ నిల్వలు లేవు. అయినా సరే, పక్కనే ఉన్న అడవిలో లేటరైట్ తవ్వి ఈ కంపెనీకిచ్చిన భూముల్లో మైనింగ్ చేసినట్లుగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇలా.. లేటరైట్ దోపిడికి ఈయన గాలి జనార్దన్ రెడ్డి తరహా స్కెచ్‌వేసి అమలు చేస్తున్నారు. ఏడెనిమిది నెలలుగా ఈ అక్రమం సాగుతోంది. అక్కడ లభించే లాటరైట్‌ను ప్రాసెస్ చేస్తే భారీగా బాక్సైట్ వస్తుందని అధికారవర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ విషయం తెలిసే ఆ లీజు ఏరియాను దక్కించుకునేందుకు వైసీపీ ‘పెద్ద’ అధికారంలో ఉండగా తీవ్రంగా శ్రమించారు. చివరకు లీజుపొందిన కంపెనీకి రూ.70 కోట్ల పెనాల్టీలు వేయించి, మైనింగ్‌ను సైతం ఆపివేయించారు.
‘పెద్ద’ మాయ
సీఎం చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమాలపై విచారణ చేసిన విషయం తెలుసుకున్న వైసీపీ పెద్ద తన మనుషులను రంగంలోకి దించి మాయచేసినట్లు తెలిసింది. గనులశాఖలోని విజిలెన్స్ విభాగంలో ఉన్న తన అస్మదీయుడి ద్వారా మొత్తం విషయాన్ని తప్పుదోవపట్టించినట్లు సమాచారం. ‘‘ప్రత్తిపాడులో మైనింగ్ చేస్తున్న కంపెనీకి లీజు, పర్మిట్లు ఉన్నాయి. దాని డంప్‌యార్డ్‌లో ఉన్న లేటరైట్ అధికారికమైనదే. మూసివేయించిన కంపెనీ యార్డులోని లేటరైట్ వేరు. వారి వ్యాపారం వేరు. రెండింటిని పోల్చద్దు. రెండూ వేర్వేరుగా చూడాలి’’ అంటూ ప్రభుత్వానికి రిపోర్టు ఎలా ఇవ్వాలో కూడా ఆయన సూచించినట్టు సమాచారం. దీంతో ప్రత్తిపాడు ఏరియాలో ఎక్కడా అక్రమ లేటరైట్ లేదని, అంతా సవ్యంగానే సాగుతోందని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. దీంతో వైసీపీ పెద్ద తన అక్రమ లాటరైట్‌ను దర్జాగా కొనసాగిస్తున్నారు. గతంలో చీకట్లో సాగిన ఈ దందా ఇప్పుడు పగలు, రాత్రి తేడా లేకుండా సాగుతుండడం గమనార్హం.
లెక్క తేల్చేదెలా?
వారికి కేటాయించిన లీజు ఏరియాలోనే మైనింగ్ జరుగుతోందని గనులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. ఎవరి మైనింగ్ ఏరియా ఎంత? ఎవరు ఎంత మేర మైనింగ్ చేయాలి? అటవీ భూమి ఎంత?ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనేతి తేలిస్తే వైసీపీ ‘పెద్ద’ చేస్తున్న అక్రమ దందా బయటపడుతుంది. గనులు, అటవీ, రెవెన్యూశాఖలు సంయుక్తంగా నడుం బిగిస్తేనే ఇది వెలుగు చూస్తుంది. కానీ, అధికారులు ఆ పనిచేయడం లేదు. అధికారిక అనుమతులు, పర్మిట్లు ఉన్నాయంటూ అక్కడి లాటరైట్‌ను తరలించేందుకు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారు.
Updated Date - Aug 26 , 2024 | 07:56 AM