ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

An ideal for farmers Shankar Reddy : రైతులకు ఆదర్శం శంకర్‌రెడ్డి వ్యవసాయం

ABN, Publish Date - Nov 08 , 2024 | 11:29 PM

వ్యవసాయం జూదమంటున్న తరుణంలో పలువురు రైతులకు రైతు శివశంకర్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయ్యవారిపల్లె రైతు శివశంకర్‌రెడ్డి 15 ఎకరాల పొలంలో తరతరాలుగా వస్తున్న వ్యవసాయాన్ని అందిపుచ్చుకుని వేలాది మంది రైతులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

రూ. 40 లక్షలతో రైతు శంకర్‌రెడ్డి ఏర్పాటు చేసిన పాలీ హౌస్‌

ఉష్ణప్రాంతంలోనూ ఆపిల్‌ పండించిన కృషి

నూతన పంటల సాగు..అధిక దిగుబడులు

పక్క రాష్ట్రాలకూ పాకిన వైనం

వాల్మీకిపురం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): వ్యవసాయం జూదమంటున్న తరుణంలో పలువురు రైతులకు రైతు శివశంకర్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయ్యవారిపల్లె రైతు శివశంకర్‌రెడ్డి 15 ఎకరాల పొలంలో తరతరాలుగా వస్తున్న వ్యవసాయాన్ని అందిపుచ్చుకుని వేలాది మంది రైతులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. 20 ఏళ్ల కిందట తనకున్న రెండన్నర ఎకరాల పొలంలో వేరుశనగ, చెరకు, కూరగాయలు, తదితర పంటలను తనదైన శైలిలో సాగు చేసి అధిక దిగుబడులు రాబడ్డటం, తర్వాత అంచెలంచెలుగా తన మేదోశక్తితో వ్యవ సాయాన్ని అభివృద్ధి బాట పట్టించాడు. శీతల ప్రదేశాల్లో పండే ఆపిల్‌ పంటను సైతం సకాలంలో పండించి శభాష్‌ అనిపించు కుంటున్నారు. రాజస్థాన్‌ ప్రాంతం నుంచి తెచ్చిన అన్నా, హరిమాన్‌ రకాల ఆపిల్‌ మొక్కలను నాటి కంటికి రెప్పలా కాపాడాడు. అంతే ఏడాదికి ఆపిల్‌ కాయలు విరగ్గాశాయి. ఉష్ణ ప్రాంతాలకు అనువైన వంగడాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడంలో ఆసక్తి కనబరిచి ఎన్నో విషయాలను బయటకు తేవడం గమనార్హం. బీడు భూము లను వ్యవసాయ భూములుగా మారుస్తూ రైతులకు సైతం ఎన్నో మెలుకువలు నేర్పిన ఘనత శివశంకర్‌ రెడ్డికి దక్కుతుంది. కేవలం సేంద్రియ పద్దతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారాయన. వివరాల్లోకెళితే...


వాల్మీకిపురం మండలం అయ్యవారిపల్లె రైతు శివశంకర్‌రెడ్డికి 15 ఎకరాల పొలం ఉంది. 2007లో మూడెకరాల్లో కదిరి రకం వేరుశనగ పంట సాగు చేసి అధిక దిగుబడులు రాబ ట్టాడు. చుట్టుపక్కల గ్రామీణ రైతులు సైతం అప్పట్లోనే ఆశ్చర్యపోతూ శివశంకర్‌ రెడ్డిని అభినందించడం గమనార్హం. ఇక అప్పటి నుంచి వ్యవసాయమే జీవనాధారంగా రైతు శివశంకర్‌రెడ్డి కుటుంబం శ్రమించ సాగింది. నష్టాలు చవిచూసినా అధైర్య పడక చెరకు, వేరుశనగ, చాందినీపూలు, చామంతి, లిల్లీ (తెలుపు, పసుపు), తదితర పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు రావడంతో వెను దిగిరి చూసుకోకుండా పరిశోధనాత్మకంగా అనేక రకాల పంటలను సాగు చేయడానికి సిద్దం చేసుకోవడం గమనార్హం. తన వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల కిందట సాగు చేసిన ఆలీవ్‌ మొక్కలు ఏపుగా పెరిగి మరో ఏడాదిలో పంట రానుంది. గతేడాది హరిమాన్‌ 99 రకం యాపిల్‌ మొక్కలను అధిక పెట్టుబడులతో ప్రయోగాత్మకంగా చేసిన మొక్కలు ఏపుగా పెరిగి యాపిల్‌ కాయలు విరగ్గాశాయి. దీంతో తిరిగి అదే రకం యాపిల్‌ మొక్కలను సాగు చేశాడు. దేశంలో అరుదైన మకడమియా డ్రై ఫ్రూట్‌ పంటను పరిశోధనాత్మకంగా మొదలు పెట్టి సాగు చేయడానికి ముందడుగులు వేస్తు న్నారు. ఆ రకం డ్రైఫ్రూట్‌ కిలో రూ.2వేలకు పైగా పలుకుతుండడం గమనార్హం.


సాధించిన అవార్డులతో రైతు శంకర్‌రెడ్డి

చామంతి మొక్కల్లో ఐదురకాలు పెంపకానికి రంగం సిద్దం చేస్తున్నాడు. అయ్యవారిపల్లె మొదలు కుని రాష్ట్రాలు దాటి వేలాదిమంది రైతు కుటుంబాలకు ఆదర్శంగా నిలిచాడు. నర్సరీల్లో సైతం శివశంకర్‌రెడ్డి వంగడాలు, పూల రకం మొక్కలు తదితరాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా పశువుల ఎరువు, సూక్ష్మపోషక ఎరువుల వాడకంతో పంటల నుంచి అధిక దిగుబడులు రాబట్టవచ్చని చెబుతున్నారు. ఈయన వ్యవసాయ క్షేత్రంలో సుమారు రూ.40లక్షల పెట్టుబడితో ఓ పాలీహౌస్‌, రూ.7లక్షలతో ఒకటిన్నర ఎకరాలో ఫైర్‌నెట్‌ నర్సరీ నిర్వహిస్తున్నారు. ప్రతి రైతు తన మోధో శక్తితో వ్యవసాయం కుంటు పడకుండా ముందుకెళ్లాలని, తనను కలిసే ప్రతి రైతుకు ఎప్పటికప్పుడు వ్యవసాయ మెలకువలు నేర్పుతున్నానంటున్నారు.

శంకర్‌రెడ్డిని వరించిన అవార్డులు..

2007లో రైతు శివశంకర్‌రెడ్డి అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నుంచి రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు అందుకున్నాడు. 2009లో ఆలిండియా రేడియో ఉత్తమ వ్యాఖ్యాతగా అవార్డు, 2014, 2019లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పూల సాగు రైతుగాను, ఇలా ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఐదు నెలలుగా విదేశీ శాస్త్రవేత్తల బృందం శివ శంకర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ప్రశంసించడం గమనార్హం.


ఉష్ణప్రాంతంలో విరగ్గాసిన ఆపిల్‌

కశ్మీర్‌.. సిమ్లా... పంటను ఉష్ణ ప్రాంతాల్లో ఆపిల్‌ పంటను సేంద్రీయ పద్దతిలో సాగుచేశారు. కేవలం శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే ఆపిల్‌ కరవుప్రాంతంలో విరగ్గాశాయంటే అది రైతు శివశంకర్‌రెడ్డి కృషిగానే చెప్పవచ్చు. రాజస్థాన్‌ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన అన్నా, హరిమాన్‌ రకాల ఆపిల్‌ మొక్కలు కంటికి రెప్పలా కాపాడాడు. తాను పెంచిన మొక్కలకు ఎలాంటి చీడ, పీడలు కూడా కలగలేదని, కేవలం మొక్కలు పెరగడానికి మాత్రమే నీటిని పెట్టామన్నారు. శీతల ప్రాంతాల్లో లాగే మార్చి నెలలో పూతతో మొదలై ఆగస్టులో పంట పండ్లు కాయడం విశేషమని చెబుతున్నారు. 5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత్తలుండే ప్రాంతంలో పండించే ఆపిల్‌ పంట 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వేడి ఉన్నా పంట సాగుకు ఉష్ణ ప్రాంతాలకు అనువైన వంగడాలను శాస్త్రవేత్త లు అభివృద్ధి చేయడంలో ఆసక్తి కనబరిచి ఎన్నో విషయాలను బయటకు తేవడం గమనార్హం. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని ఆపిల్‌ పంట భవిష్యత్తు తరాలకు ఎంతో అనుకూలంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఆపిల్‌ కాయలు విరగ్గాయడంతో ఇటీవల 300 ఆపిల్‌ పండ్లు తన కుటుంబ సభ్యులు, కూలీలకు పంచిపెట్టాడు.


ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఆపిల్‌ ధర రూ.150 నుంచి 200 పలుకుతుండగా మన ప్రాంతాల్లో మాత్రం రైతులు ఆసక్తి చూపకపోవడం బాఽధాకరం. అయితే మన ప్రాంతంలో కూడా పంట సాగు చేయవచ్చని రైతు చెబుతున్నాడు.

ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి

ప్రభుత్వం సబ్సిడీలతో సరిపెట్టుకోకుండా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా రైతాంగానికి చేయూత నిచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ వ్యాప్తంగా మన రాష్ట్రానికి వ్యవసాయ రంగంలో ఎంతో ముందుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రభుత్వాలు మారినా రైతుల స్థితిగతులు మాత్రం మారడం లేదు. ముఖ్యంగా ఉచితాల పంపిణీ కంటే ముందుగా రైతుల అవసరాలను గుర్తించి మేలు చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రైతుకు అను సంధానం చేసే దిశగా చర్యలు తీసుకుంటే హర్షించదగ్గ విషయమే.

- శివశంకర్‌రెడ్డి, ఆదర్శ రైతు, అయ్యవారిపల్లె, వాల్మీకిపురం

Updated Date - Nov 08 , 2024 | 11:34 PM