Classification: వర్గీకరణతో సమాన అవకాశాలు
ABN, Publish Date - Aug 02 , 2024 | 12:58 AM
ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును స్వాగతిస్తూ.. జిల్లా వ్యాప్తంగా మాదిగ సామాజికవర్గం ప్రజలు గురువారం సంబరాలు చేసుకున్నారు. ఆర్‌ఈఎఫ్, మాదిగ దండోరా, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి, ఇంటలెక్చువల్ ఫోరమ్ ఫర్ మాదిగా్‌స(ఇనఫామ్), గ్లోబల్ ఇనఫామ్ తదితర సంఘాలు, బీజేపీ ఎస్సీ మోర్చా సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించాయి. అనంతపురం నగరంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ సంఘాలు, పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ...
సుప్రీం తీర్పుపై సంఘాల హర్షం
జిల్లా వ్యాప్తంగా మాదిగల సంబరాలు.. మోదీ, చంద్రబాబు
చిత్రపటాలకు క్షీరాభిషేకం
అనంతపురం సెంట్రల్/తాడిపత్రి, ఆగస్టు 1: ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును స్వాగతిస్తూ.. జిల్లా వ్యాప్తంగా మాదిగ సామాజికవర్గం ప్రజలు గురువారం సంబరాలు చేసుకున్నారు. ఆర్‌ఈఎఫ్, మాదిగ దండోరా, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి, ఇంటలెక్చువల్ ఫోరమ్ ఫర్ మాదిగా్‌స(ఇనఫామ్), గ్లోబల్ ఇనఫామ్ తదితర సంఘాలు, బీజేపీ ఎస్సీ మోర్చా సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించాయి. అనంతపురం నగరంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ సంఘాలు, పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆర్‌ఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రామచంద్ర, మాదిగ దండోరా రాయలసీమ
అధ్యక్షుడు అక్కులప్ప, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాకే శివశంకర్, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు సాకే రామతీర్థ, గ్లోబల్ ఇన్ఫామ్ జిల్లా అధ్యక్షుడు మారెప్ప, లాయర్ హరిప్రసాద్, బాల గంగాధర్ తదితరులు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం సాగిన తీరును గుర్తు చేశారు. ఎస్సీ సామాజికవర్గంలో 62 ఉప కులాలు ఉన్నాయని వారు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కొన్ని ఉపకులాలకు మాత్రమే అందుతున్నాయని, మిగిలినవారు దారిద్రరేఖను అధిగమించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఉప కులాలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలని కొన్ని దశాబ్దాల నుంచి ఉద్యమాలు చేస్తున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో వర్గీకరణ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని అన్నారు. సుప్రీం కోర్టు ధర్మాసనం వర్గీకరణపై సానకూల తీర్పు ఇవ్వడం ద్వారా ఎస్సీలందరికీ సమాన అవకాశాలు దక్కేలా బాటలు వేసిందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నాగన్న, నారాయణస్వామి, జయరామ్, ఇనఫామ్, గ్లోబల్ ఇనఫామ్ నాయకులు తిరుపాలు, శశికళ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు ప్రభుకుమార్, మందల శాంతకుమార్, జయలక్ష్మి, శివ, రాజేష్, నవీన, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
పోరుగడ్డ.. యర్రగుంటపల్లి
ఎస్సీ వర్గీకరణ కోసం తొంబయ్యవ దశకంలోనే తాడిపత్రి వేదికగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. మొదట ఆత్మార్పణం చేసింది మాత్రం తాడిపత్రి మండలం యర్రగుంటపల్లికి చెందిన తెల్లబండ్ల రవి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆమరణ దీక్షకు మద్దతుగా 1998 జూన 9న తాడిపత్రి తహసీల్దారు కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెద్దిరాజు, బండారు శంకర్, కంబగిరిస్వామి పురుగుల మందు తాగారు. తెల్లబండ్ల రవి ఒంటిపై కిరోసిన పోసుకుని నిప్పంటించుకున్నారు. మిగిలిన ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. రవి మాత్రం ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించారు. యర్రగుంటపల్లిలో రవి స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. నాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు గంగరాజు, పుల్లయ్య, పెద్దిరాజు, రామాంజనేయులు, ఆంజనేయులు, కౌన్సిలర్ మల్లికార్జున, ఆదినారాయణ, ఈశ్వరయ్య, నాగభూషణం, పురుషోత్తం, లక్ష్మిదేవి, తులసి, కంబగిరి, రాంమోహన, వెంకటరాముడు, సత్య తదితరులు తెల్లబండ్ల రవికి నివాళులు అర్పించారు. తాడిపత్రి పట్టణంలో అంబేడ్కర్ విగ్రహానికి, మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
పోరాటాల ఫలితం..
ఎన్నో ఏళ్ల పోరాటాలతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ ఉద్యమంలో మొత్తం 16 మంది ప్రాణార్పణ చేశారు. తాడిపత్రిలో ఆత్మహత్య చేసుకున్న తెల్లబండ్ల రవి ఆత్మకు నేడు శాంతి చేకూరింది. వర్గీకరణకు కృషిచేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
- గంగరాజు, ఎమ్మార్పీఎస్, తాడిపత్రి
మా పోరాటం ఫలించింది
ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేశాం. మా పోరాటాలు ఫలించి నేడు సుప్రీం కోర్టు సానుకూల తీర్పు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వర్గీకరణ కోసం చేసిన పోరాటాలు ప్రస్తుతం గుర్తుకు తెచ్చుకుంటుంటే ఆనందభాష్పాలు వస్తున్నాయి. దీనికోసం కేసులు సైతం లెక్కచేయలేదు. - పెద్దిరాజు, ఎమ్మార్పీఎస్, తాడిపత్రి
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 02 , 2024 | 12:58 AM