Animators : నమ్మితే.. ముంచేశాడు
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:04 AM
పొదుపు మహిళా సంఘాల సొమ్మును స్వాహా చేస్తూ యానిమేటర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరికైనా అనుమానం వచ్చి ఆరా తీస్తే బాగోతాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కళ్యాణదుర్గంలోని ఓ బ్యాంకులో నిధులు స్వాహా బాగోతం బయటికి వచ్చింది. మండలంలోని మల్లికార్జునపల్లిలో పొదుపు సంఘం మహిళలు తాము తీసుకున్న రుణాలను వాయిదాలపై ప్రతి నెలా చెల్లించేవారు. గతంలో యానిమేటర్‌గా పనిచేసిన ఓ...
22 పొదుపు సంఘాల సొమ్ము స్వాహా
నాలుగేళ్లుగా రూ.72 లక్షలు మాయం
యానిమేటర్‌దే కీలకపాత్ర !
చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మౌనం
కళ్యాణదుర్గం, సెప్టెంబరు 15: పొదుపు మహిళా సంఘాల సొమ్మును స్వాహా చేస్తూ యానిమేటర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరికైనా అనుమానం వచ్చి ఆరా తీస్తే బాగోతాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కళ్యాణదుర్గంలోని ఓ బ్యాంకులో నిధులు స్వాహా బాగోతం బయటికి వచ్చింది. మండలంలోని మల్లికార్జునపల్లిలో పొదుపు సంఘం మహిళలు తాము తీసుకున్న రుణాలను వాయిదాలపై ప్రతి నెలా చెల్లించేవారు. గతంలో యానిమేటర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం బ్యాంకులో బిజినెస్ సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
బ్యాంకులోనే పని చేస్తున్నాడనే నమ్మకంతో మహిళలు నెలనెలా కట్టే వాయిదా సొమ్మును అతడికి ఇచ్చి బ్యాంకులో కట్టాలని కోరేవారు. అతను వారిచ్చిన సొమ్మును అప్పులోకి ఏమాత్రం జమ చేయకుండా వడ్డీ మాత్రమే కట్టి మిగిలిని సొమ్మును సొంతానికి వాడుకున్నాడు. ఇలా నాలుగేళ్లుగా గ్రామానికి చెందిన 22 సంఘాల మహిళల సొమ్ము రూ.72 లక్షలు స్వాహా చేశాడు.
తనిఖీలు ఎందుకు చేయలేదో..?
పొదుపు సంఘాల మహిళలు తాము తీసుకున్న రుణం ఒక్క నెల చెల్లించకపోయినా తేడాలొస్తాయి. ప్రతి నెలా బ్యాంకు లింకేజీ సొమ్ము ఎంత జమైందో మండల సమాఖ్య అకౌంటెంట్ పరిశీలించాలి. సీసీలు, ఏపీఎం పర్యవేక్షించాలి. అయితే నాలుగేళ్ల నుంచి అప్పులోకి పైసా జమ చేయకున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నది పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ బ్యాంకులోని 22 సంఘాల సభ్యులు చెల్లించిన రూ.72 లక్షలు స్వాహా చేసినట్లు తేలింది. పర్యవేక్షించాల్సిన అధికారులు కింది స్థాయి వారి మీద తోసేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అసలు అధికారులు విచారణే తూతుమంత్రంగా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ డబ్బులన్నీ స్వాహా చేశారని మహిళలే పట్టణంలోని ఆ బ్యాంకు ఎదుటే పెద్ద ఎత్తున ఆందోళన చేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. పొదుపు మహిళలు వీరే పాత్రధారులు, సూత్రధారులు అని చెబుతున్నా, అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఇకమీదట ఏం చేయాలో తెలియక మహిళలు మిన్నకుండిపోతున్నారు.
ఆరుగురిపై ఫిర్యాదు చేయించాం: మధుసూదన గుప్తా, వెలుగు ఏపీఎం
కళ్యాణదుర్గం మండలలోని మల్లికార్జునపల్లిలో పొదుపు సంఘాలలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషనలో ఆరు గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశాం. యానిమేటర్, అకౌంటెంట్, సీసీతో పాటు మరో ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశాం. బాధ్యులపై కేసులు నమోదు చేయడమే కాకుండా స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేస్తాం. మరో మూడు రోజుల్లో పూర్తి ఆధారాలతో జరిగిన అక్రమాలపై నివేదిస్తాం.
పొదుపు సంఘాల మహిళల సొమ్ము స్వాహా చేసిన విషయమై ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు తెలిపారు. దీనిపై సమగ్రంగా విచారించి, నిజమని తేలితే కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 16 , 2024 | 12:04 AM