ఉందిలే మంచికాలం..!
ABN, Publish Date - Nov 08 , 2024 | 12:47 AM
వ్యవసాయ, అనుబంధ శాఖల్లో రైతు సేవా కేంద్రాల సిబ్బంది క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైసీపీ హయాంలో రైతు భరోసా కేంద్రం సిబ్బంది నియామకం అస్తవ్యస్తంగా సాగింది. ఆర్బీకే సిబ్బంది విధులు నిర్వర్తించేది ఒక శాఖలో.. నియంత్రణ మరో శాఖలో ఉండంతో గందరగోళం కొనసాగుతోంది. ఆర్బీకే సిబ్బంది వేతనం, సెలవుల మంజూరు బాధ్యతలను పంచాయతీ సెక్రటరీలకు అప్పగించారు. పనులు మాత్రం వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్ శాఖల్లో ...
త్వరలో రైతు సేవాకేంద్రం సిబ్బంది క్రమబద్ధీకరణ
వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ పరిధిలోకి..
విస్తీర్ణాన్ని తగ్గించి.. పనిభారం లేకుండా విధులు
ఉమ్మడి చిత్తూరు నుంచి తిరిగిరానున్న ఎంపీఈఓలు
క్లస్టర్ పద్ధతిని కొనసాగించాలని ఏఈఓల వినతి
అనంతపురం అర్బన, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ, అనుబంధ శాఖల్లో రైతు సేవా కేంద్రాల సిబ్బంది క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైసీపీ హయాంలో రైతు భరోసా కేంద్రం సిబ్బంది నియామకం అస్తవ్యస్తంగా సాగింది. ఆర్బీకే సిబ్బంది విధులు నిర్వర్తించేది ఒక శాఖలో.. నియంత్రణ మరో శాఖలో ఉండంతో గందరగోళం కొనసాగుతోంది. ఆర్బీకే సిబ్బంది వేతనం, సెలవుల మంజూరు బాధ్యతలను పంచాయతీ సెక్రటరీలకు అప్పగించారు. పనులు మాత్రం వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్ శాఖల్లో
చేయిస్తున్నారు. పనులు నిర్వర్తించే శాఖల అధికారులకు నియంత్రణ అధికారం లేకపోవడంతో విఽధుల నిర్వహణలో అయోమయం ఏర్పడుతోంది. వేతనాలు, సెలవులు మంజూరు చేస్తున్న కారణంగా ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీలు ఇతర పనులు అప్పగించినా ఆర్బీకే సిబ్బంది చేయాల్సి వస్తోంది.
శాఖల పరిధిలోకి..
వ్యవసాయ శాఖ పరిధిలోకి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లను, ఉద్యాన శాఖ పరిధిలోకి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లను, సిరికల్చర్ పరిధిలోకి విలేజ్ సిరికల్చర్ అసిస్టెంట్లను తీసుకువస్తున్నారు. మూడు శాఖల పరిధిలో సాగు విస్తీర్ణం, ఉన్న సిబ్బంది సరిపోతారా, అదనపు సిబ్బంది అవసరమా అన్న వివరాలతో సమగ్ర నివేదికలను ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
అనాలోచిత నిర్ణయాలు
వైసీపీ హయాంలో అవసరం లేకపోయినా ఉమ్మడి జిల్లా నుంచి 253 మంది ఎంపీఈఓలను ఓడీపై ఉమ్మడి చిత్తూరు జిల్లాకు పంపారు. వీరిలో 105 మంది అక్కడ పనిచేస్తున్నారు. క్రమబద్ధీకరణ కోసం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యవసాయ అధికారులు పంపిన నివేదికలో వైసీపీ పాలకుల అనాలోచిత నిర్ణయాలు బట్టబయలయ్యాయి. అవసరం లేకపోయినా ఆ జిల్లాకు ఎంపీఈఓలను ఓడీపై పంపించారని తేలింది. చిత్తూరు జిల్లాలో 317 మంది వీఏఏ, 167 మంది వీహెచఏ, 157 మంది వీఎ్‌సఏ, 11 మంది హార్టికల్చర్ ఎంపీఈఓలు, ఏఈఓలు 26 మంది, వ్యవసాయ శాఖ ఎంపీఈఓలు 80 మంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి 688 ఎకరాల నుంచి 1262 ఎకరాల విస్తీర్ణం వస్తుంది. ఈ లెక్కన 80 మంది ఎంపీఈఓలు తమకు అవసరం లేదని ఆ జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారని సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందే రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ అప్పటి చిత్తూరు జిల్లా వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధి అడ్డుకున్నారని సమాచారం.
గతంలో పనిభారం
అనంతపురం జిల్లాలో 451 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 132 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, 179 మంది విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు, 11 మంది సెరికల్చర్ అసిస్టెంట్లు, 122 మంది ఎంపీఈఓలు పనిచేస్తున్నారు. వీరితోపాటు 32 మంది ఏఈఓలు, ముగ్గురు హెచఈఓలు ఉన్నారు. 2022-23 లెక్కల ప్రకారం జిల్లాలో వ్యవసాయ శాఖ పరంగా 14.23 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. 2.60 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం 2 వేల నుంచి 17వేల ఎకరాల విస్తీర్ణానికి ఒక ఉద్యోగి ఉన్నారు. దీంతో ఈ-పంట నమోదు, ఇతర పనులు భారంగా మారాయి. రైతులకు మెరుగైన సేవలు అందడం లేదు. క్రమబద్ధీకరణతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఒక్కో ఉద్యోగికి 1100 నుంచి 3 వేలలోపు ఎకరాల విస్తీర్ణం అప్పగించే అవకాశం ఉంది. ఇందు కోసం అనంతపురం జిల్లాకు అదనంగా 255 మంది సిబ్బంది అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నివేదికలు పంపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓడీపై పనిచేస్తున్న 105 మంది ఎంపీఈఓలను త్వరలో జిల్లాకు రప్పించి.. ఖాళీలను భర్తీ చేయనున్నారు.
క్లస్టర్ పరిధిలోనే ఉంచండి..
జిల్లాలో 32 మంది వ్యవసాయ విస్తరణా అధికారులు (ఏఈఓలు) ఉన్నారు. ఇతర సిబ్బంది తరహాలోనే ఏఈఓలకు కొంత విస్తీర్ణాన్ని అప్పగించాలని క్రమబద్ధీకరణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పన్నెండేళ్లుగా తాము క్లస్టర్ పద్ధతిలోనే పనిచేస్తున్నామని, క్రమబద్ధీకరణ సమయంలో తమను క్లస్టర్ స్థానాల్లోనే నియమించాలని ఏఈఓలు ప్రభుత్వానికి విన్నవించారు. ఒక్కో మండలంలో రెండు నుంచి మూడు దాకా క్లస్టర్లను ఏర్పాటు చేసి, ఆయా స్థానాల్లో తమను నియమించారని, ఆ పద్ధతిని కొనసాగించాలని కోరుతున్నారు. తమకు మండల అసిస్టెంట్ వ్యవసాయ అధికారి ఉద్యోగోన్నతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో వేచిచూడాల్సిందే.
మరింత మెరుగైన సేవలు..
రైతు సేవా కేంద్రం సిబ్బంది క్రమబద్ధీకరణతో రైతులకు మరింతగా మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. ఎక్కువ విస్తీర్ణం కారణంగా సిబ్బందిపై పనిభారం ఎక్కువైంది. జిల్లాలో వ్యవసాయ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకొని అదనంగా 255 మంది అవసరమని ప్రతిపాదనలు పంపాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓడీపై పనిచేస్తున్న ఎంపీఈఓలను తిరిగి జిల్లాకు రప్పించాలని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు ఇదివరకే లేఖ రాశాం. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు వెళతాం.
- జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ
వ్యవసాయ.. అనుబంధ శాఖలకు సిబ్బంది..
వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్ సిబ్బందిని పంచాయతీ సెక్రటరీ కంట్రోల్‌లో ఉంచడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని శాఖల పరిధిలోకి తెస్తోంది. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది. పంటల ఆధారంగా (60 శాతానికి పైగా ఉన్న పంటలు) రైతు సేవా కేంద్రం సిబ్బంది సర్దుబాటు చేస్తారు. వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్ సిబ్బంది తమ పరిధిలోని మూడు శాఖల పనులు చేయాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- నరసింహారావు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 08 , 2024 | 12:47 AM