STUDENT MURDER: చేతన హత్యపై లోకేశ ఆరా
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:18 AM
మడకశిర మండల పరిధిలోని ఆమిదాలగొంది జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 8వతరగతి చదువుతున్న విద్యార్థి చేతన హత్య ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు. అసలు ఏం జరిగింది అంటూ అధికారుల నుంచి సమాచారం తెలుసుకొన్నారు.
హంతకుల కోసం ప్రత్యేక బృందాల వేట
బాలుడి హత్య కేసు దర్యాప్తు వేగవంతం
మడకశిర/మడకశిరటౌన, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): మడకశిర మండల పరిధిలోని ఆమిదాలగొంది జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 8వతరగతి చదువుతున్న విద్యార్థి చేతన హత్య ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు. అసలు ఏం జరిగింది అంటూ అధికారుల నుంచి సమాచారం తెలుసుకొన్నారు. పాఠశాల నుంచి ఉదయం 10.30 గంటలకు విద్యార్థి వెళితే పోలీసులకు సైతం సమాచారం ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కనీసం 100కు కూడా డయల్ చేయకుండా ఏం చేస్తున్నారంటూ జిల్లా స్థాయి అధికారులతో ఆరా తీసినట్లు తెలిసింది. సాయంత్రం 6 గంటల సమయంలో చిన్నారి కిడ్నాప్ అయిన విషయంపై కేసును పోలీసులకు అందించడం పట్ల మండిపడ్డారు. ఇన్ని గంటల వ్యవధిలో ఏమి చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాబేజ్‌పై జిల్లా అధికారులు సస్పెన్షన వేటు వేశారు. అదే విధంగా ఫిజికల్ డైరెక్టర్ ప్రసూనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి జి.కిష్టప్ప ఆమిదాలగొంది ప్రధానోపాధ్యాయుడు జాబేజ్‌ను సస్పెండ్ చేస్తూ అందులో పీఈటీగా పనిచేస్తున్న ప్రసూనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కడప ఆర్‌జేడీ ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు డీఈఓ వెల్లడించారు. సీఎంఓ కార్యాలయం సైతం ఆరా తీయడంతో స్వయంగా ఎస్పీ రంగంలోకి దిగి నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. వారిని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. హత్యకు గల కారణాలు, ఆ అవసరం ఎందుకు వచ్చింది అన్న కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు మడకశిర సర్కిల్ కార్యాలయంలోనే ఉంటూ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. సీఐలు రామారావు, రాజ్‌కుమార్‌లకు సూచనలు ఇస్తూ దర్యాప్తును ఓ కొలిక్కి తెచ్చారు. హత్యకు సంబంధించిన ఆయుధాలను సైతం ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఎంత మంది ఇందులో పాల్గొన్నారన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టినా పాఠశాల సిబ్బంది ఏమాత్రం సహకారం అందివ్వలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం జరిగితే సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్యలోనే మడకశిర పోలీ్‌సస్టేషనకు వచ్చి ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు అందించినట్లు పోలీసులు సైతం చెబుతున్నారు. పాఠశాల నుంచి విద్యార్థి బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఉపాధ్యాయుల అనుమతి తీసుకోవాలి. అలాంటివి ఏమీలేకుండా విద్యార్థి వెళ్లినా ఎందుకు స్పందించలేదన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - Dec 01 , 2024 | 12:18 AM