Education : భోంచేయడానికి వెళ్లారా..!
ABN, Publish Date - Oct 26 , 2024 | 12:21 AM
పాఠశాల విద్యార్థులకు నిర్వహించే పరీక్షల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. 2023-24 విద్యా సంవత్సరం ఎఫ్‌ఏ-3, 2024-25 విద్యా సంవత్సరం ఎఫ్‌ఏ, ఎస్‌ఏ ప్రశ్న పత్రాలు, పనుల టెండర్లలో గోల్‌మాల్ చేశారు. వర్కుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులో అడ్డగోలుగా వ్యవహరించారు. వీటిపై రెండు విచారణలు జరిగాయి. ఎఫ్‌ఏ-3కి సంబంధించి రూ.31.80 లక్షల వర్క్ ఆర్డర్ ఉత్తర్వులపై డీఈఓ వరలక్ష్మి సంతకాలు లేవు. ఆమె ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించగా.. డిసెంబరులోనే ఆమె...
హోటల్‌లో విద్యాశాఖ అధికారుల భేటీ
బదిలీ అయిన డీఈఓతో.. విచారణ అధికారి
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కూడా..!
డీసీఈబీ వర్క్ ఆర్డర్లలో భారీగా అక్రమాలు
రూ.31.80 లక్షల పనులకు నకిలీ ఉత్తర్వులు
రూ.2.50 కోట్ల పనుల టెండర్లలో గోల్‌మాల్
ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు.. విచారణ
ఇంత జరిగినా.. అందరూ కలిసి దర్జాగా...!
పెండింగ్ బిల్లులపై డీల్ కోసమేనా..?
అనంతపురం విద్య, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యార్థులకు నిర్వహించే పరీక్షల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. 2023-24 విద్యా సంవత్సరం ఎఫ్‌ఏ-3, 2024-25 విద్యా సంవత్సరం ఎఫ్‌ఏ, ఎస్‌ఏ ప్రశ్న పత్రాలు, పనుల టెండర్లలో గోల్‌మాల్ చేశారు. వర్కుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులో అడ్డగోలుగా వ్యవహరించారు. వీటిపై రెండు విచారణలు జరిగాయి. ఎఫ్‌ఏ-3కి సంబంధించి రూ.31.80 లక్షల వర్క్ ఆర్డర్ ఉత్తర్వులపై డీఈఓ వరలక్ష్మి సంతకాలు లేవు. ఆమె ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించగా.. డిసెంబరులోనే ఆమె పేరిట నకిలీ ఉత్తర్వులు పుట్టించారు. వీటిని ఆంధ్రజ్యోతి గతంలోనే వెలుగులోకి తెచ్చింది. ఆంధ్రజ్యోతి కథనాల ఆధారంగానే విచారణలు జరిగాయి. ఇదంతా
పాత కథ. ఇప్పుడు ఇంకో కథ మొదలైనట్లు కనిపిస్తోంది. పార్ట్-2 అనుకోవచ్చు..! గురువారం వరకూ జిల్లాలో పనిచేసి.. శుక్రవారం రిలీవ్ అయిన డీఈఓ వరలక్ష్మి, డీసీఈబీ, పరీక్షల విభాగంలో విమర్శలు ఎదుర్కొంటున్న అధికారులు, విచారణాధికారి.. హడావుడిగా నగరంలోని ఓ హోటల్‌లో శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. డీసీఈబీలో అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వచ్చాయి. కలెక్టర్ వినోద్‌కుమార్, ఆర్‌జేడీ శామ్యూల్ వేర్వేరుగా విచారణకు ఆదేశించారు. కానీ ఏం తేల్చారో బహిర్గతం కాలేదు. ఇలాంటి సమయంలో ఉన్నతాధికారి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, విచారణాధికారి హోటల్‌లో భేటీ కావడం విమర్శలకు తావిస్తోంది. చివరి రోజున పెండింగ్ బిల్లుల క్లియరెన్స కోసం ఈ భేటీ జరిగిందని విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు బాహటంగా చర్చించుకుంటున్నారు.
లెక్కలేనన్ని అక్రమాలు
జిల్లా విద్యాశాఖ, డీసీఈబీలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా డీసీఈబీలో గత రెండేళ్లలో ప్రశ్నపత్రాల ముద్రణ, సరఫరా, కేటాయింపులు, బిల్లులు.. ఇలా అన్నింటా అక్రమాలు చోటుచేసుకున్నాయి. డీసీఈబీ వేదికగా భారీగానే అవినీతి జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో డీఈఓగా వరలక్ష్మి జిల్లాకు నియమితులయ్యారు. ఫిబ్రవరి 10న ఆమె విధుల్లో చేశారు. కానీ 2023 డిసెంబరు 15వ తేదీనే ఆమె పేరిట రూ.31.80 లక్షల విలువైన వర్క్ ఆర్డర్‌ను జారీ చేశారు. చీరాల, తెనాలి ప్రాంతాల ప్రింటర్స్‌కు ఈ పనులను అప్పనంగా అప్పగించారు. దీని వెనుక డీసీఈబీ, విద్యాశాఖ అధికారుల పాత్ర ఉన్న విషయం బట్టబయలైంది. 2024-25 ఎఫ్‌ఏ-1,2,3,4, ఎస్‌ఏ-1,2 పరీక్షల నిర్వహణకు కావాల్సిన ప్రశ్న పత్రాల ముద్రణ, సరఫరాకు పాదర్శకంగా పిలవాల్సిన టెండర్ల వ్యవహారంలోనూ భారీగానే గోల్ మాల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. టెండర్లు పిలవకుండానే పిలిచినట్లు మాయ చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రజ్యోతి కథనాలపై విచారణ
విద్యాశాఖ, డీసీఈబీలో అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వచ్చాయి. సెప్టెంబరులో ‘నిధుల స్కాం’, ‘స్కాం వెనుక ఇద్దరు..?’, ‘నిధుల స్కాంపై కలెక్టర్ విచారణ’, ‘లక్షల్లో కమీషన్లు’ శీర్షికలతో కథనాలు వచ్చాయి. ఈ నెలలో ‘రూ. 2.5 కోట్లు చిన్న కథకాదు..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. వీటిపై కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, కడప ఆర్‌జేడీ శామ్యూల్ వేర్వేరుగా విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఓ డిప్యూటీ డీఈఓ విచారణ చేశారు. ఆర్‌జేడీ ఆదేశాలతో చిత్తూరు, కడప జిల్లాల అధికారులు వచ్చి రహస్యంగా విచారణ జరిపారు. వీటి నివేదికలు కూడా ఉన్నతాధికారులకు చేరాయి.
బిల్లుల క్లియరెన్స కోసమేనా...?
అంతా బాగానే జరుగుతోందని భావిస్తున్న తరుణంలో డీఈఓ వరలక్ష్మి చిత్తూరుకు బదిలీ అయ్య్యారు. అన్నమయ్య జిల్లా నుంచి మరో అధికారిని డీఈఓగా నియమించారు. డీఈఓ వరలక్ష్మి ఉన్నఫలంగా బదిలీ కావడంతో లక్షలాది రూపాయల బిల్లులు చెల్లింపునకు బ్రేక్ పడినట్లుంది. అందుకే డీఈఓ వరలక్ష్మి, డీసీఈబీ సెక్రటరీ, పరీక్షల విభాగం ఉన్నతాధికారి, ఈ స్కాంను విచారించిన ఓ మహిళా అధికారి (డిప్యూటీ డీఈఓ) అందరూ కలసి నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో భేటీ అయ్యారు. సుమారు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.10 గటల వరకూ వీరి భేటీ కొనసాగింది. పెండింగ్ బిల్లుల క్లియరెన్స కోసమే ఈ కలయిక జరిగిందని ప్రచారం జరుగుతోంది. డీఈఓ వీటిపై సంతకాలు చేశారా..? వాయిదా వేశారా..? మరేదైనా విశేషం ఉందా..? అన్నది తెలియాల్సి ఉంది. ఈ నలుగురు అధికారుల భేటీ మాత్రం విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వేళ సంతకాలు చేసి ఉంటే.. బదిలీ తేదీల తర్వాత పెట్టిన సంతకాలు, బిల్లుల చెల్లింపు తేదీలపై విచారణ జరిపిస్తే అక్రమాలు ఒక్కటొక్కటిగా బయటపడతాయని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి.
విజిలెన్స రంగంలోకి దిగితే..
విద్యాశాఖ, డీసీఈబీలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. కోట్ల రూపాయల వర్కుల్లో ఫేక్ ఉత్తర్వులు, అడ్డగోలు చెల్లింపు జరిగాయి. ఫిబ్రవరిలో అధికారి వస్తే.. ఆమె పేరిట గత ఏడాది డిసెంబరు నెల తేదీలతో నకిలీ ఉత్తర్వులు విడుదల చేయడం పెద్ద నేరం. ఈ ఒక్క ఉత్తర్వు కాపీపై లోతైన విచారణ జరిగితే.. డొంక మొత్తం కదులుతుంది. కోట్ల విలువైన పనుల టెండర్‌లోనూ భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స అధికారులు విచారణకు దిగితే అక్రమాలు చేసినవారు, తెర వెనుక పావులు కదిపినవారు ఎవరో తేలిపోతుంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 26 , 2024 | 12:21 AM