Home Minister Anita : పోలీసుల ప్రతిష్ట పెంచండి
ABN, Publish Date - Nov 06 , 2024 | 01:33 AM
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను కట్టడి చేయాలని పోలీసులకు హోం మంత్రి అనిత సూచించారు. గంజాయి మత్తులో, రాజకీయ ముసుగులో ఎంతో మంది నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. పోలీసుల ప్రతిష్టను పెంచేలా బాధ్యతగా నడుచుకోవాలని శిక్షణ పూర్తి చేసుకున్న 12 మంది డీఎస్పీలకు సూచించారు. నగరంలోని పోలీసు శిక్షణా కళాశాలలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌ను ...
సాంకేతికతతో నేరాలను కట్టడి చేయండి
కలలను సాకారం చేసుకున్నారు.. అభినందనలు
ఐదేళ్లలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
ఇక అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
హోం మంత్రి వంగలపూడి అనిత
ఘనంగా ప్రొబేషనరీ
డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్
అనంతపురం క్రైం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను కట్టడి చేయాలని పోలీసులకు హోం మంత్రి అనిత సూచించారు. గంజాయి మత్తులో, రాజకీయ ముసుగులో ఎంతో మంది నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. పోలీసుల ప్రతిష్టను పెంచేలా బాధ్యతగా నడుచుకోవాలని శిక్షణ పూర్తి చేసుకున్న 12 మంది డీఎస్పీలకు సూచించారు. నగరంలోని పోలీసు శిక్షణా కళాశాలలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రొబేషనరీ డీఎస్పీల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్‌కు హాజరైనందుకు ఎంతో ఆనందంగా ఉందని.. హోం మంత్రి అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు ఈ వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.
కలల సాకారం..
డీఎస్పీలుగా శిక్షణ పూర్తి చేసుకున్నవారు ఎంతో కష్టపడి, నిద్రలేని రాత్రులు గడిపి అనుకున్నది సాధించారని, కలలను సాకారం చేసుకున్నారని హోం మంత్రి అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు విధుల్లో చేరబోతున్నారని అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడే వృత్తిని ఎంచుకోవడం హర్షనీయమని అభినందించారు. పోలీసు ఉద్యోగం మిగతావాటిలా కాదని, 24 గంటలు పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. నిజాయతీ, నిష్పక్షపాతం, బాధితులపట్ల సానుభూతి, విధి నిర్వహణలో నిబద్ధత కలిగి ఉండాలని అన్నారు.
అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..
పోలీసు శాఖకు ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హోం మంత్రి అన్నారు. గత ఐదేళ్లల్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ప్రస్తుతం తమ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని అన్నారు. పోలీసు స్టేషన్ల నిర్మాణం, ఆధునికీకరణ పనులు చేయాల్సి ఉందని అన్నారు. పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడమంటే ఆయుధాలు ఇవ్వడమో... వాహనాలు ఇవ్వడమో కాదని, పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడమని అన్నారు. ప్రతి జిల్లాలోనూ సైబర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రొబేషనరీ డీఎస్పీలుగా విధుల్లోకి వెళుతున్న నేపథ్యంలో బాధ్యతగా వ్యవహరించి, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆమె సూచించారు.
అప్‌డేట్ కావాలి: డీజీపీ
మారుతున్న నేరాలకు అనుగుణంగా పోలీసులు అప్‌డేట్ కావాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. సైబర్ నేరాలు విస్తృతమయ్యాయని, వాటి కట్టడి కోసం ప్రతి జిల్లాలో సైబర్ స్టేషన ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. సైబర్ ఫోరెన్సిక్ కోసం కొత్త పరికరాలను కొనుగోలు చేస్తామని తెలిపారు. వైట్ కాలర్ క్రైం, ఇన్వె్‌స్టమెంట్ ఫ్రాడ్స్, నార్కోటిక్స్ కట్టడి కోసం ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. మానసిక వేదనకు గురిచేసే సోషల్ మీడియా క్రైం నియంత్రణకు తగిన చర్యలు చేపట్టబోతున్నామని అన్నారు. రాజ్యాంగ చట్టాలకు అనుగుణంగా పనిచేయాలని, ఈ విషయాన్ని మరువకూడదని అన్నారు. పోలీసులను ఆశ్రయించే వారిపట్ల మరింత సానుభూతితో ఉండాలని సూచించారు. పాసింగ్ అవుట్ పరేడ్‌లో చేసిన ప్రతిజ్ఞ మేరకు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని అన్నారు. పదవీ విరమణ పొందే వరకూ ప్రతిజ్ఞలోని అంశాలను మరువకూడదని అన్నారు. మానవ హక్కులను కాపాడుతూ, రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలకు అనుగుణంగా పనిచేయాలని డీజీపీ వారికి పిలుపునిచ్చారు.
ప్రతిభావంతులకు పతకాలు
శిక్షణ సమయంలో ఫైరింగ్, ఇండోర్, అవుట్ డోర్ విభాగాలలో ప్రతిభ చాటిన ప్రొబేషనరీ డీఎస్పీలకు హోం మంత్రి చేతులమీదుగా పతకాలు, ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్, ఐజీపీ వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర శాంతిభద్రతల విభాగం ఐజీపీ సీహెచ శ్రీకాంత, అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి, ఉమ్మడి జిల్లా ఎస్పీలు జగదీష్, రత్న, జెడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, జేసీ అశ్మితరెడ్డి, బండారు శ్రావణి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మేయర్ వసీం, ఏఎస్పీలు, డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, ప్రొబెషనరీ డీఎస్పీల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Nov 06 , 2024 | 01:33 AM