Tank bund : దుర్వాసన.. దుర్వాసన
ABN, Publish Date - Dec 14 , 2024 | 12:43 AM
నగరానికి మణిహారంగా మారుతుందని భావించిన చెరువుకట్ట రోడ్డు దారుణంగా మారింది. ఆ దారిలో వెళ్లేవాహనదారులు దుస్వాసన భరించలేకున్నారు. గుంతలమయమైన దారిలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఆ ప్రాంతం డంపింగ్ యార్డుకు ఏమాత్రం తీసిపోవడం లేదు. బుక్కరాయసముద్రం-అనంతపురం చెరువుకట్ట రోడ్డు దుస్థితి ఇది. సుందరీకరణతో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో ఉంటుందని అందరూ భావించారు. కానీ వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది....
డంప్ యార్డుగా మారిన ట్యాంక్ బండ్
ధ్వంసమైన అనంత-బీకేఎస్ చెరువుకట్ట రోడ్డు
అడుగడుగునా గుంతలు.. ఆక్రమణలు
వైసీపీ హయాంలో నిర్లక్ష్యమే కారణం
సుందరీకరణకు కూటమి ప్రభుత్వం అడుగులు
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నగరానికి మణిహారంగా మారుతుందని భావించిన చెరువుకట్ట రోడ్డు దారుణంగా మారింది. ఆ దారిలో వెళ్లేవాహనదారులు దుస్వాసన భరించలేకున్నారు. గుంతలమయమైన దారిలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఆ ప్రాంతం డంపింగ్ యార్డుకు ఏమాత్రం తీసిపోవడం లేదు. బుక్కరాయసముద్రం-అనంతపురం చెరువుకట్ట రోడ్డు దుస్థితి ఇది. సుందరీకరణతో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో ఉంటుందని అందరూ భావించారు. కానీ వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. రోడ్డు మీద మోకాలు లోతు గుంతలు పడ్డాయి. జంతు కళేబరాలు, చెత్తను రోడ్డు పక్కన వేస్తున్నారు. దీంతో ఆ దారిలో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మారిపోతుందా..?
వైసీపీ హయాంలో చెరెవుకట్ట రోడ్డు సుందరీకరణ, అభివృద్ధికి రూ.10కోట్లతో మూడు దఫాలు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. టీడీపీ హయాంలో చెరువుకట్టపై నిర్మించిన ఎన్టీఆర్ పార్కు మాయమైంది. జిమ్ పరికరాలు కనిపించడంలేదు. పార్కులో పచ్చదనం ఉండాల్సిన చోట పిచ్చిమొక్కలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం ట్యాంక్‌బండ్ ఏర్పాటుకు
ప్రతిపాదనలు పంపాలని సూచించింది. మైనర్ ఇరిగేషన అధికారులు రూ.11కోట్లతో ట్యాంక్‌బండ్ సుందరీకరణకు ప్రతిపాదనలు పంపారు. ఇకనైనా పరిస్థితిలో మార్పు వస్తుందని నగరవాసులు ఆశిస్తున్నారు.
వైసీపీ నేతల కక్కుర్తి
వైసీపీ హయాంలో బుక్కరాయసముద్రం-అనంతపురం చెరువు కట్ట రోడ్డు సుందరీకరణకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. సుమారు రూ.10కోట్ల అంచనాలతో ‘బ్యూటిఫుల్ ట్యాంక్‌బండ్’ను ఆవిష్కరిస్తామని ఆ సంస్థ 2021లో ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ ఇద్దరు వైసీపీ ప్రజాప్రతినిధులు పర్సెంటేజీల కోసం బెదిరించడంతో ఆ సంస్థ వదిలేసింది. లేదంటే చెరువుకట్ట అందంగా మారేదని నగరవాసులు అంటున్నారు. దాతల సొమ్ముపై కూడా ఆ పార్టీ నాయకులు కన్నేయడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.
అసాంఘిక శక్తులకు అడ్డా
2011 ప్రాంతంలో నిర్మించిన చెరువుకట్ట రోడ్డును 2016లో అప్పటి ప్రభుత్వం బాగు చేసింది. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ ప్రాంతం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. మద్యం సేవించడం, అకృత్యాలకు పాల్పడటం పరిపాటిగా మారింది. పాతూరుకు చెందిన లారీలు, భారీ వాహనాల పార్కింగ్‌కు చెరువుకట్ట రోడ్డుకు వాడుకోవడం ప్రారంభించారు. రోడ్డు స్థలాన్ని వాహనదారులు ఆక్రమించినా అడిగేవారు కరువయ్యారు.
సమన్వయలోపం
చెరువుకట్ట రోడ్డు అభివృద్ధి, నిర్వహణ విషయంలో అధికారుల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనబడుతోంది. మైనర్ ఇరిగేషన, నగరపాలక సంస్థ, జిల్లా పంచాయతీ, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖలు సమన్వయంతో ఆ పనులను చేయాలి. ఆ దిశగా ఆ శాఖల అధికారులు ఆలోచించలేదు. రోడ్డు నిర్మించి పదేళ్లు దాటినా.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన దాఖలాలు లేవు.
అభివృద్ధి చేయాలి..
చెరువుకట్ట రోడ్డును అభివృద్ధి చేయాలి. గుంతల రోడ్డు మీద బైకులో వెళ్ళాలంటేనే భయంగా ఉంది. రాత్రిపూట లైట్లు వెలగడం లేదు. టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్కు కనబడటం లేదు. రోడ్డుతో పాటు ఆ పార్కును కూడా అభివృద్ధి చేయాలి. సుందరీకరణ జరిగితే నగరవాసులు ఆనందంగా గడుపుతారు.
- శేఖర్, రాణీనగర్, అనంతపురం
దుర్వాసన భరించలేకున్నాం..
కలెక్టరేట్ నుంచి పాతూరుకు చెరువుకట్ట రోడ్డుపై ట్రాఫిక్ లేకుండా పోవొచ్చు. కానీ కళేబరాలు, కుళ్లిన మాంసం, చెత్తా చెదారంతో ఆ ప్రాంతం దుర్గంధభరితంగా మారింది. దుర్వాసనను భరించలేకున్నాం. శుభ్రం చేయమని ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. నగరపాలిక అధికారులకు చెబితే సంబంధం లేదని అంటున్నారు. ఈ ప్రభుత్వమైనా రోడ్డును బాగుచేయాలి.
- మారుతి, పాతూరు, అనంతపురం
రూ.11 కోట్లతో ప్రతిపాదనలు..
చెరువుకట్ట రోడ్డు సుందరీకరణ, అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదనలు అడిగింది. రూ.11కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపాం. గత ప్రభుత్వంలో మూడుసార్లు ప్రతిపాదనలు పంపినా వెనక్కు వచ్చాయి. అనుమతి వచ్చిన వెంటనే పనులను ప్రారంభిస్తాం. ఇప్పటికే చెరువుకట్ట రోడ్డుపై చాలా ఫిర్యాదులు అందాయి. ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని త్వరగా అనుమతి తీసుకువస్తే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లా మార్చవచ్చు. చెరువుకట్ట రోడ్డు జిల్లాకు మణిహారంగా మారుతుంది. -విశ్వనాథ రెడ్డి, ఎస్‌ఈ, మైనర్ ఇరిగేషన
Updated Date - Dec 14 , 2024 | 12:43 AM