TDP : సూక్ష్మానికి మోక్షం కావాలి!
ABN, Publish Date - Jun 07 , 2024 | 12:29 AM
‘అనంతపురం జిల్లా నా గుండెల్లో ఉంటుంది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిన అన్ని పథకాలను పునరుద్ధరిస్తాం. అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటాం..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు మాటిచ్చారు. 2014 ఎన్నికల్లో 12 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినందుకు అనేక పథకాలతో ఆదుకున్నారు. అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ ‘కియ’ను కరువు నేలపైకి తీసుకొచ్చారు. రైతులకు సబ్సిడీ పథకాలు, నిరుద్యోగులకు భృతి, పేదలకు అన్న క్యాంటీన, ఆపన్నులకు పింఛన్లు, యువతకు ఉద్యోగాలు..
ఐదేళ్లుగా అటకెక్కిన సూక్ష్మసేద్య పథకం
రెండేళ్లు పూర్తిగా బంద్..
మూడేళ్లు అరకొరగా సరఫరాటీడీపీ
హయాంలో 90 శాతం సబ్సిడీ
కూటమి గెలుపుతో రైతుల్లో చిగురించిన ఆశలు
‘అనంతపురం జిల్లా నా గుండెల్లో ఉంటుంది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిన అన్ని పథకాలను పునరుద్ధరిస్తాం. అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటాం..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు మాటిచ్చారు. 2014 ఎన్నికల్లో 12 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినందుకు అనేక పథకాలతో ఆదుకున్నారు. అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ ‘కియ’ను కరువు నేలపైకి తీసుకొచ్చారు. రైతులకు సబ్సిడీ పథకాలు, నిరుద్యోగులకు భృతి, పేదలకు అన్న క్యాంటీన, ఆపన్నులకు పింఛన్లు, యువతకు ఉద్యోగాలు.. ఇలా ఎన్నెన్నో చేశారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లా జనం అంతకు మించి.. మొత్తం 14 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. వైసీపీకి వాయిస్ లేకుండా చేశారు. ఇక తమ కష్టాలను తీర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హర్హం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కూడా గతానికి మించి మేలు చేస్తారని ఆశిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న నేపథ్యంలో.. వైసీపీ పాలనలో వివిధ రంగాలు, వివిధ వర్గాలు ఎదుర్కొన్న సంక్షోభం.. చంద్రబాబుపై పెట్టుకున్న ఆశల గురించి ప్రత్యేక కథనాలు.. నేటి నుంచి..!
అనంతపురం అర్బన/యాడికి, జూన 6: సాగునీటి వనరులు నిర్వీర్యమై.. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను సూక్ష్మసేద్య పరికరాలు ఎంతగానో ఆదుకున్నాయి. డ్రిప్, స్ర్పింక్లర్ పరికరాలను ఎస్సీ ఎస్టీ రైతులకు ఉచితంగా, మిగిలిన రైతులకు 90 శాతం సబ్సిడీతో టీడీపీ ప్రభుత్వం అందించేది. దీంతో అరకొరగా బోరు నీరున్నా.. వేలాది ఎకరాల్లో ఉద్యాన పంటలను రైతులు సాగు చేసుకోగలిగారు. ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని మొదటి రెండేళ్లు పూర్తిగా అటకెక్కించింది. రైతుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సబ్సిడీని 70 శాతానికి కుదించి.. మూడేళ్లపాటు అరకొరగా సరఫరా చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2024 మార్చి 31 వరకు) ముగిసే వరకు సూక్ష్మసేద్య పరికరాలు సరఫరా చేయాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ అమలులోకి రాకనే.. జనవరి నుంచే నిలిపేశారు. దీంతో ఉద్యాన రైతులు మార్కెట్‌లో అధిక ధరలకు పరికరాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది. కొనలేనివారు సాగుకు దూరమయ్యారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇక తమ కష్టాలు తీరుతాయని రైతులు భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిన పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ హామీ ఇచ్చారు. దీంతో సేద్యానికి మంచి రోజులు వచ్చినట్లేనని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో తేడా..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లా ఉద్యాన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. 2019-20 సంవత్సరంలో కేవలం 19,276 మంది రైతులకు 24,770.72 హెక్టార్లకు సరిపడా పరికరాలు ఇచ్చారు. ఆ తర్వాత 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో పూర్తిగా నిలిపేశారు. రైతులు, రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో 2023-24 సంవత్సరంలో పరికరాల సరఫరాను పునరుద్ధరించారు. కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. టీడీపీ హయాంలో 2014-15 నుంచి 2018-19 దాకా ఉమ్మడి జిల్లాలోని 1,07,751 మంది రైతులకు 1,22,864. 24 హెక్టార్లకు సరిపడా సూక్ష్మసేద్య పరికరాలు సరఫరా చేశారు. వైసీపీ పాలనలో కేవలం 54,951 మంది రైతులకు 67,659. 48 హెక్టార్లకు సరిపడా పరికరాలను మాత్రమే ఇచ్చారు.
సబ్సిడీ కుదించి.. ద్రోహం
టీడీపీ హయాంలో ఉమ్మడి జిల్లాలో సూక్ష్మసేద్య పరికరాలకు ఒక్కో రైతుకు పది ఎకరాల దాకా 90 శాతం సబ్సిడీని వర్తింపజేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం ఉచితంగా డ్రిప్ పరికరాలు సరఫరా చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే సూక్ష్మసేద్య పరికరాల మంజూరుకు గైడ్ లైన్సను మార్చారు. ఐదెకరాల దాకా 90 శాతం, ఆపైన 70 శాతం సబ్సిడీని వర్తింపజేశారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీని ఎత్తేశారు. ఇతర సామాజికవర్గ రైతుల తరహాలోనే సబ్సిడీ పోను మిగతా డబ్బులు చెల్లించాలని వారికి షరతు పెట్టారు. సూక్ష్మ సేద్యానికి బాగా అలవాటు పడిన రైతులు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. సబ్సిడీని కుదించినా.. రైతులకు పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు.
చిగురించిన ఆశలు
అధికారం చేపట్టగానే గతంలో మాదిరే సూక్ష్మసేద్య పరికరాలకు 90 శాతం సబ్సిడీని వర్తింపజేస్తామని, రైతులను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు మరోమారు ముఖ్యమంత్రి అవుతున్నారు. దీంతో తమకు మంచి రోజులు వచ్చినట్లే అని కరువు జిల్లా రైతాంగం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. పాత పద్ధతిలో 90 శాతం సబ్సిడీ ఇస్తారని, ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీని వర్తింపజేస్తారని భావిస్తున్నారు.
డబ్బు కట్టినా..
నాలుగు ఎకరాలకు డ్రిప్ పరికరాల కోసం ఏడాది క్రితమే డబ్బులు చెల్లించాను. డ్రిప్ పరికరాలు సరఫరా చేయలేదు. సబ్సిడీపోనూ రూ.35 వేలు కట్టినా అదిగో ఇదిటో అంటూ కాలయాపన చేశారు. డ్రిప్ పరికరాలు ఇవ్వకపోవడంతో పంటలు సాగు చేయకపోయా. టీడీపీ కూటమి ప్రభుత్వం సకాలంలో డ్రిప్ పరికరాలు సరఫరా చేసి మమ్మల్ని ఆదుకోవాలి.
- రాజశేఖర్‌నాయుడు, యాడికి మండలం
వైసీపీ హయాంలో నష్టపోయాం
నాలుగు ఎకరాల్లో డ్రిప్ కోసం ఏడాదిన్నర క్రితమే రూ.42 వేలు చెల్లించాను. అధికారులు, కంపెనీ సిబ్బందిని పలుమార్లు అడిగినా ప్రయోజనం లేకుపోయింది. సూక్ష్మసేద్య పరికరాలు ఇస్తే ఖరీప్, రబీ సీజన్లల్లో పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఖరీఫ్ పంటలతోనే సరిపెట్టుకున్నాం. టీడీపీ కూటమి ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ పరికరాలు సరఫరా చేసి ఆదుకోవాలి.
-మనోహర్ చౌదరి,యాడికి
నట్టేట ముంచారు..
వైసీపీ పాలనలో కరువు రైతులను నట్టేట ముంచారు. వ్యవసాయంలో సూక్ష్మసేద్య పరికరాల ప్రాధాన్యం బాగా పెరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం సబ్సిడీ పథకాన్ని అటకెక్కించి రైతులకు తీరని అన్యాయం చేసింది. గత ఐదేళ్ల పాలనలో రెండేళ్లపాటు పూర్తిగా నిలిపేశారు. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత అరకొరగా సరఫరా చేసి చేతులు దులుపుకున్నారు. జగన అనాలోచిత నిర్ణయాలతో కరువు రైతులు సూక్ష్మసేద్య పరికరాలకు దూరమయ్యారు. అందుకే ఓటుతో తగిన గుణపాఠం చెప్పారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామి మేరకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ర్పింకర్ల పరికరాలు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారు.
- బొల్లు శ్రీనివాసరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి
సబ్సిడీలను పునరుద్ధరించాలి..
వైసీపీ ఐదేళ్ల పాలనలో డ్రిప్, స్ర్పింకర్లకు సబ్సిడీ తగ్గించి రైతులకు తీరని అన్యాయం చేశారు. వరుసగా రెండేళ్లు పరికరాలు ఇవ్వకుండా ద్రోహం చేశారు. అందుకే రైతులు ఓటుతో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. టీడీపీ హయాంలో సూక్ష్మసేద్య పరికరాలకు వర్తింపజేసిన సబ్సిడీని పునరుద్ధరించాలి. చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామి మేరకు 90 శాతం సబ్సిడీతో తిరిగి పరికరాలు సరఫరా చేయాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీని వర్తింపజేయాలి.
- చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Jun 07 , 2024 | 12:29 AM