ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road accident: ఘోరం..

ABN, Publish Date - Sep 23 , 2024 | 12:51 AM

పుట్టిన రోజే తనకు చివరి రోజు అవుతుందని ఆ యువకుడు ఏమాత్రం ఊహించి ఉండడు. స్నేహితులతో కలిసి చేసుకున్న బర్త్‌డే వేడుకలే అంత్యక్రియలకు కారణమవుతాయని అనుకుని ఉండడు. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలే తమకు చివరి క్షణాలు అవుతాయని ముగ్గురు యువకులు ఊహించి ఉండరు. అందుకే బర్త్‌డే బాయ్‌తో కలిసి ఎంతో ఆనందంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. మరో స్నేహితుడు వద్దు వద్దంటున్నా సతాయించి టిఫిన తినడానికని అతడి కారు తీసుకెళ్లారు. అనంతరం ఎందుకు బుద్ధి పుట్టిందో తెలియదు గానీ ...

MLA Daggupati visiting the victims

పుట్టిన రోజున విషాదం

అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

కారును ఢీకొన్న లారీ

నలుగురు యువకుల దుర్మరణం

మృతులంతా స్నేహితులే

రేకులకుంట వద్ద దుర్ఘటన

పుట్టిన రోజే తనకు చివరి రోజు అవుతుందని ఆ యువకుడు ఏమాత్రం ఊహించి ఉండడు. స్నేహితులతో కలిసి చేసుకున్న బర్త్‌డే వేడుకలే అంత్యక్రియలకు కారణమవుతాయని అనుకుని ఉండడు. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలే తమకు చివరి క్షణాలు అవుతాయని ముగ్గురు యువకులు ఊహించి ఉండరు. అందుకే బర్త్‌డే బాయ్‌తో కలిసి ఎంతో ఆనందంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. మరో స్నేహితుడు వద్దు వద్దంటున్నా సతాయించి టిఫిన తినడానికని అతడి కారు తీసుకెళ్లారు. అనంతరం ఎందుకు బుద్ధి పుట్టిందో తెలియదు గానీ ఇంటికెళ్లాల్సిన వారు ఓ యువకుడి నానమ్మ ఇంటికి వెళ్తూ మృత్యుగాలానికి చిక్కారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఓ లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జైపోగా, యువకుల శరీరాలు ఛిద్రమయ్యాయి. చేతికి అందివచ్చిన కొడుకులు శవాలుగా పడిఉండటం చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వద్ద జరిగింది. వివరాలు ఇలా..


బుక్కరాయ సముద్రం, సెప్టెంబరు 22: మండలంలోని రేకులకుంట వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అనంతపురం నగర శివారు స్టాలిన నగర్‌కు చెందిన ఓబులశెట్టి పవన(26), యర్రగుడి పవన (24), కురుబ శ్రీనివాసులు(26), ముస్తాక్‌ (25) మృతి చెందారు. వీరంతా అవివాహితులే. ఈ ప్రమాదం నాలుగు కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది.

అనంతపురం స్టాలిన నగర్‌కు చెందిన మహబూబ్‌బాషా, మున్నీ దంపతుల కుమారుడు గ్రానైట్‌, టైల్స్‌ వర్కర్‌గా పనిచేసి జీవనం సాగించేవాడు. శనివారం ముస్తాక్‌ పుట్టిన రోజు కావడంతో అతడి స్నేహితులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓబులశెట్టి పవన, డ్రైవర్‌గా పనిచేస్తున్న కురుబ శ్రీనివాసులు, యర్రగుడి పవన కలిశారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని భావించారు. అనంతరం డ్రైవర్‌ శ్రీనివాసులు తన మరో స్నేహితుడైన పవనను కూడా బర్త్‌డే వేడుకలకు ఆహ్వానించాడు. పవనకు ఉన్న ఇన్నోవా వాహనంలో ఐదుగురు బయటికి వెళ్లి పుట్టిన రోజు వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు.

సతాయించి కారు తీసుకెళ్లి..

వేడుకల అనంతరం టిఫిన తినడానికి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌కు కారులోనే వెళ్లాలని స్నేహితులంతా నిర్ణయించుకున్నారు. అయితే కారు తెచ్చి ఇంకా పది రోజులు అయింది. తెలిస్తే ఇంట్లో తిడతారని చెప్పినట్లు కారు యజమాని పవన తెలిపాడు. స్నేహితుడైన శ్రీనివాసులు అరగంట పాటు సతాయించడంతో టిఫిన తినడానికే కదా వెళ్లేది త్వరగా వస్తారులే అని కారు ఇచ్చి, తాను ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు. దీంతో ముస్తాక్‌, డ్రైవర్‌ శ్రీనివాసులు, యర్రగుడి పవన, ఓబులశెట్టి పవన టిఫిన తినడానికి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లారు. అనంతరం నార్పలలో ఉన్న ఓబులశెట్టి పవన నానమ్మ ఇంటికి బయల్దేరారు.

రేకులకుంట వద్ద కారును ఢీకొన్న లారీ

అలా వెళ్తుండగా నార్పల నుంచి వేరుశనగ కాయల లోడ్‌తో వస్తున్న లారీ రేకులకుంట గ్రామం వద్ద కారును వేగంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ఉన్న నలుగురు స్నేహితులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు నడుపుతున్న శ్రీనివాసులు శరీరం రెండు ముక్కలై కారులోనే ఇర్కుకొని పోయింది. మిగిలిన ముగ్గురి శరీరాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో రోడ్డంతా రక్తసిక్తం అయ్యి, భీతావాహ పరిస్థితిని కలిగించింది. లారీ డ్రైవర్‌ తాతయ్య గాయపడినట్లు పోలీసులు తెలిపారు. లారీ అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అర్ధరాత్రి పోలీసుల సహాయక చర్యలు

శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరగడంతో అటు వైపు వెళ్తున్న వాహనదారుడు డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ కరుణాకర్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి, కారు పూర్తిగా లారీలో ఇర్కుకొని పోయింది. ఏదైనా చేద్దామన్నా తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో డీఎస్పీ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. తర్వాత వచ్చిన సిబ్బంది సాయం తో ఎక్స్‌కవేటర్‌ ద్వారా కారును బయటకు లాగా రు. అందులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు. తెల్లవారుజాము నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం 5 గంటలకు మృతదేహాలను అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.

ఉద్యోగం వచ్చిన 15 రోజుల్లోనే...

ఓబులశెట్టి పవనకుమార్‌ ఎంబీఏ పూర్తి చేశాడు. రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ కోసం ప్రయత్నించాడు. గత 15 రోజుల కిందట బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. కష్టపడి చదివించినందుకు తన కుమారుడికి సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వచ్చిందని అతడి తండ్రి ప్రసాద్‌ ఎంతో సంబరపడ్డాడు. ఇన్నాళ్లు కూలి పని చేశామని, ఇక కుమారుడే తమ ఆలనా పాలనా చూస్తాడని ఎంతో ఆనందపడ్డాడు. అయితే వారి ఆనందం 15 రోజుల్లోనే ముగిసింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఇంటికి వెలుగవుతాడనుకుంటే శవంగా మారాడని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

అరగంటలో వస్తానని.. చెప్పి..

తన స్నేహితుడి పుట్టిన రోజు ఉందని, చూసుకుని అరగంటలో వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ మృతుడు యర్రగుడి పవన తల్లిదండ్రులు విలపించారు. స్టాలిన నగర్‌కు చెందిన యర్రగుడి నారాయణకు ఒక్కగానొక్క కుమారుడు పవన. తండ్రి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పవన గుంటూరు సెల్ఫ్‌ల (భవననిర్మాణ కార్మికుడు)పని చేసేవాడు. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలి పోయారు. త్వరలోనే ఓ ఇంటివాడిని చెద్దామని అనుకుంటే... ఇంతలోనే మమ్ము విడిచిపోయావా అంటూ పవన తల్లి రోదించడం చూసిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.

చేతికి అందొచ్చాడని అనుకుంటే..

చేతికి అందొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కురుబ శ్రీనివాసులు తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు. కుటుంబా నికి చేదోడుగా ఉన్న రెండో కుమారుడు కురుబ శ్రీనివాసులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్టాలిన నగర్‌కు చెందిన అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తండ్రి కురబ వెంకటేష్‌ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శ్రీనివాసులును పదోతరగతి వరకు చదివించాడు. ఆర్థిక భారంతో చదువు మాన్పించి డ్రైవింగ్‌ నేర్చించాడు. అనంతపురంలోని ఓ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబాన్ని అంతులేని విషాదంలో ముంచింది.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

రేకులకుంట గ్రామం వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ జగదీష్‌, అనంతపురం రూరల్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందని స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ చేసి, కారణమైన లారీ డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చాలా బాధాకరం : ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

రేకులకుంట గ్రామం వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో స్టాలిననగర్‌కు చెందిన టీడీపీ కార్యకర్తలు మృతి చెందడం బాధాకరమని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌ అన్నారు. మృతదేహాలను అనంతపురం సర్వజన ఆస్పత్రిలో పరిశీలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై బుక్కరాయసముద్రం సీఐ కరణాకర్‌తో ఆరా తీశారు. అనంతరం మృతుల కుటుంబాలకు అంత్యక్రియల కోసం ఒక్కొక్కరికి రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ప్రభుత్వం నుంచి వీలైనంత ఆర్థిక సాయం అందేలా చూస్తామని మృతు ల కుటుంబాలకు హామీ ఇచ్చారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 23 , 2024 | 12:51 AM