AP States Debt : 1,235 కోట్లకుపైగా బకాయిలు
ABN, Publish Date - May 17 , 2024 | 05:40 AM
రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయిస్తున్న రైతులను జగన్ సర్కారు ఎప్పటికప్పుడు నిండా ముంచేస్తోంది. ప్రస్తుత రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యాయి
నెల దాటినా రైతుల ఖాతాల్లో జమ కాని సొమ్ము
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయిస్తున్న రైతులను జగన్ సర్కారు ఎప్పటికప్పుడు నిండా ముంచేస్తోంది. ప్రస్తుత రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యాయి.
ఈ సీజన్‌లో రెండో పంటగా వరిసాగు చేసిన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనమసీమ, కాకినాడ, బాపట్ల జిల్లాల్లో గురువారం నాటికి 1,10,152 మంది రైతులు 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి విక్రయించారు.
వారిలో 50 వేల మంది రైతులకే సొమ్ము చెల్లించారు. ఇంకా 60 వేల మందికిపైగా రైతులకు 1,235 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం 21 రోజుల్లో సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా.. నెల రోజులు దాటిపోయినా సొమ్ము జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు మొన్నటి వరకు పూర్తిస్థాయిలో సొమ్ములు చెల్లించలేదు. అప్పులోళ్ల ఒత్తిళ్లను తట్టుకోలేక రైతులంతా విజయవాడలో సివిల్ సప్లైస్ కార్యాలయానికి వచ్చి ధర్నాలు చేయడంతో డబ్బులు చెల్లించిన పరిస్థితి.
దీంతో ఈ సీజన్‌లో రైతులు ప్రభుత్వానికి ధాన్యాన్ని విక్రయించకుండా ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్మేసుకుంటున్నారు.
Updated Date - May 17 , 2024 | 05:40 AM