Andhra Pradesh:వలంటీర్లు లబోదిబో!
ABN, Publish Date - Jun 01 , 2024 | 04:47 AM
మొన్నటి దాకా వలంటీర్లంతా తమ వారేనన్నారు. పార్టీ కోసం అడ్డగోలుగా వాడుకున్నారు. ఎన్నికల ముందు చాలామందితో రాజీనామా చేయించి మరీ ప్రచారం చేయించుకున్నారు. అవసరం తీరిపోవడంతో ఇప్పుడు వైసీపీ నేతలు మొహం చాటేస్తున్నారు. పాపం... వలంటీర్లు పావులుగా మారిపోయారు
ముఖం చాటేస్తున్న వైసీపీ నాయకులు
రాజీనామా చేయించి మరీ ఎన్నికల ప్రచారం
ఇప్పుడు మీవల్లే నష్టపోయామంటూ చిందులు
ఓటుకు నోటు సొమ్ము నొక్కేశారని అభాండాలు
చదరంగంలో పావులయ్యామని వలంటీర్ల నిర్వేదం
వైసీపీ మాటలు నమ్మి మునిగిపోయామని ఆవేదన
ఫలితాలు తారుమారవుతాయన్న అనుమానాలు
టీడీపీ నేతలతో టచ్‌లోకి పలువురు వలంటీర్లు
మొన్నటి దాకా వలంటీర్లంతా తమ వారేనన్నారు. పార్టీ కోసం అడ్డగోలుగా వాడుకున్నారు. ఎన్నికల ముందు చాలామందితో రాజీనామా చేయించి మరీ ప్రచారం చేయించుకున్నారు. అవసరం తీరిపోవడంతో ఇప్పుడు వైసీపీ నేతలు మొహం చాటేస్తున్నారు. పాపం... వలంటీర్లు పావులుగా మారిపోయారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వలంటీర్లే మా సైన్యం అన్నారు. వలంటీర్ల వ్యవస్థ భేష్ అంటూ ప్రశంసలు కురిపించారు. సేవారత్న పురస్కారాలు, వలంటీర్లకు వందనం అంటూ ప్రోత్సాహకాలు అందించారు. కాబోయే నాయకులు మీరేనంటూ వారిని ఊహాలోకాల్లో విహరింపజేశారు. చివరకు ఎన్నికల వ్యూహంలో బలిపశువులుగా మార్చారు. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించడంతో సీన్ మారిపోయింది.
ఈసీ జోక్యంతో రూటు మార్చిన వైసీపీ నేతలు.. వారి మెడపై రాజీనామా కత్తి పెట్టారు. పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని ఆదేశించారు. రాజీనామా చేసినవారికి నెలకు రూ.5వేల చొప్పున రెండు నెలలకు కలిపి రూ.10వేలు ఇస్తామని ఆశ చూపారు. కావాలంటే ఇంకొంత మొత్తం అదనంగా కూడా ఇస్తామని ప్రలోభపెట్టారు. వలంటీర్ల ద్వారానే ఓటుకు నోటు పంపిణీ చేయిస్తామని, ఆ సొమ్మంతా వారి చేతికే ఇస్తామని ఊరించారు.
తమ మాట విని రాజీనామా చేసినవారిని అధికారంలోకి రాగానే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని, మిగిలిన వారిని పరిగణనలోకి తీసుకోబోమని హెచ్చరించారు. దీంతో ఇష్టం లేకపోయినా వేల మంది వలంటీర్లు రాజీనామా చేశారు.
తీరా ఇప్పుడు ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో వలంటీర్లకు సదరు వైసీపీ నేతలు ముఖం చాటేస్తున్నారు. ఎన్నికల తర్వాత తమను పట్టించుకున్న దాఖలాలు లేవని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓటర్లకు పంపిణీ చేయమని ఇచ్చిన సొమ్మును కొందరు వలంటీర్లు తమ జేబుల్లో వేసుకున్నారని, దీంతో జనం టీడీపీకి ఓట్లేశారని నేతలు వారిపై మండిపడుతున్నారు. ఇంకా కొన్నిచోట్ల వలంటీర్లు తటస్థంగా వ్యవహరించడంతో తమకు పడాల్సిన ఓట్లు టీడీపీకి పడ్డాయని వైసీపీ అభ్యర్థులు చిందులు తొక్కుతున్నారు. దీంతో వైసీపీ నాయకుల కోసం ఎంత శ్రమించినా తమకు గుర్తింపు లేదని, ఎన్నికల్లో తమ సేవలను వాడుకుని.. తీరా తమపైనే నెపం వేస్తున్నారని పలువురు వలంటీర్లు వాపోతున్నారు. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించి, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజీనామాలతో రోడ్డున పడ్డాం
ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసేందుకు వలంటీర్లతో పట్టుబట్టి మరీ రాజీనామాలు చేయించారు. ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు వీరు సమర్పించిన రాజీనామాలను అప్పటికప్పుడు ఆమోదించడంతోపాటు వారి లాగిన్‌లో ఐడీలు కూడా తొలగించారు. రాజీనామా చేయనివారు మాత్రం ఏప్రిల్‌కు సంబంధించిన జీతాలను మే మొదటి వారంలో తీసుకున్నారు. వీరికి మే నెలకు సంబంధించిన జీతాలను కూడా జనరేట్ చేస్తున్నారు. దీంతో రాజీనామా చేసినవారంతా వైసీపీ నేతల మాటలు విని జీతం పొగొట్టుకున్నామని వాపోతున్నారు. తమ పరిస్థితి ఏమిటని అడిగితే... ఎన్నికల్లో గెలుస్తామో, లేదోనన్న టెన్షన్‌లో ఉన్న అభ్యర్థులు వారి ఊసే పట్టించుకోవడం లేదు. ఒకవేళ తాము గెలిచినా వైసీపీ ప్రభుత్వం వస్తుందో, రాదోనన్న ఆందోళనతో వలంటీర్లకు మొహం చాటేస్తున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థులకు మద్దతు పలికి తప్పు చేశామని పశ్చాత్తాపపడుతున్నారు. వలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అప్పట్లోనే టీడీపీ కోసం పనిచేసి ఉంటే బాగుండేదని పలువురు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీ ముద్రతో నష్టం
ప్రజలకు ఐదేళ్ల పాటు సేవలందించినా కూడా చివరకు వైసీపీ కార్యకర్తలుగా ముద్ర వేయించుకోవాల్సి వచ్చిందని వలంటీర్లు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వ సేవలు అందించి తీరా ఎన్నికల్లో వైసీపీ ఏజెంట్లుగా కూడా పనిచేశామంటున్నారు. జూన్ 4 తర్వాత ఫలితాలు తారుమారైతే గ్రామాల్లో తమ పరిస్థితి ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ముద్ర పడినందున టీడీపీ ప్రభుత్వంలో తమ ఉనికి ప్రశార్థకంగా మారుతుందని వాపోతున్నారు. ఎన్నికల సందర్భంగా బూత్‌ల వద్ద టీడీపీ కార్యకర్తలతో వాగ్వాదం, గొడవలు పెట్టుకోవడంతో వారికి టార్గెట్ అవుతామన్న ఆందోళనలు కూడా వారిలో పెరిగాయి. జనాల నాడిని పసిగట్టిన వలంటీర్లు కౌంటింగ్ తర్వాత జాతకాలు మారిపోతాయని అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురు వలంటీర్లు టీడీపీ నేతలకు టచ్‌లోకి వెళ్తున్నారు. ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతూ స్నేహహస్తం చాపుతున్నారు. ఇలాంటి వారంతా టీడీపీ ప్రభుత్వంలో తమకు ఉపాధి లభిస్తుందని భరోసాతో ఉన్నారు. వైసీపీ నేతలు ఆదేశించినా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25శాతం మంది వలంటీర్లు మాత్రమే రాజీనామా చేశారు. అనకాపల్లి జిల్లాలో 8,550 మంది వలంటీర్లకు గాను 2,143 మంది, కాకినాడ జిల్లాలో 6,100 మందికి గాను 700మంది, బాపట్ల జిల్లాలో 8,400 మందికి గాను 4,800 మంది రాజీనామా చేశారు. బాపట్ల జిల్లాలో కోడ్ ఉల్లంఘన కింద 42 మందిని సస్పెండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో 9వేల మందికి గాను 3వేల మంది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాజీనామా చేశారు. వీరిలో కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లోనే ఎక్కువమంది ఉన్నారు. పల్నాడు జిల్లాలో మొత్తం 9వేల మందికి గాను 2,351 మంది రాజీనామా చేశారు.
Updated Date - Jun 01 , 2024 | 04:54 AM