AP Budget : ఆర్థిక పునరుజ్జీవమే లక్ష్యంగా.. 2,94,427.25 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
ABN, Publish Date - Nov 12 , 2024 | 04:38 AM
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో పతనం అంచుల్లోకి నెట్టిన రాష్ట్రానికి ఆర్థిక పునరుజ్జీవం పోయడమే బడ్జెట్
2024-25 ఆర్థిక పద్దు ప్రవేశ పెట్టిన మంత్రి కేశవ్
అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో పతనం అంచుల్లోకి నెట్టిన రాష్ట్రానికి ఆర్థిక పునరుజ్జీవం పోయడమే బడ్జెట్ లక్ష్యమని ప్రకటించింది. సరళమైన ప్రభుత్వం ప్రతిభావంతమైన పాలన అనే సూత్రంతో పాలనను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,94,427.25కోట్ల పద్దు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శాఖల వారీగా కేటాయింపులు, రెవెన్యూ-మూలధన వ్యయం, జీఎ్‌సడీపీ-ద్రవ్యలోటు గురించి తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2.34లక్షల కోట్లు కాగా, మూలధన వ్యయం 32,712 కోట్ల రూపాయలు. అయితే ద్రవ్యలోటు 68,743కోట్లు ఉండొచ్చని ఆర్థిక మంత్రి సభలో వెల్లడించారు. జీఎ్‌సడీపీలో రెవెన్యూ లోటు 4.19శాతం, ద్రవ్యలోటు 2.12శాతంగా ఉండొచ్చని వివరించారు.
అది ఒక చీకటి అధ్యాయం
’ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మార్చుకోండి’ అంటూ ముఖ్యమంత్రి తరచూ చెప్పే మాటలు స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తాం. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా 57శాతం ఓట్లేసి 93శాతం సీట్లు(164) ఎన్డీఏ కూటమికి ఇవ్వడం చంద్రబాబు నాయకత్వానికి, దూరదృష్టికి... జనసేనాని వపన్ కల్యాణ్, ప్రధాని మోదీ నాయకత్వానికి తార్కాణం. విభజన తర్వాత దిక్కుతోచని స్ధితిలో ఉన్న రాష్ట్రాన్ని 2014-19 మధ్య వ్యవసాయం, పరిశ్రమలు, నీటిపారుదల, రోడ్డు, ఉపాధి తదితర రంగాల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లారు. అందుకు సాక్ష్యమే కియా, నదుల అనుసంధానం... అన్ని రంగాల్లోనూ సంస్కరణలతోపాటు బహుముఖ వ్యూహంతో రాష్ట్రం సుస్థిర ఆర్థికాభివృద్ధి పథంలో పయనించింది. అయితే 2019తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్రానికి ఒక చీకటి అధ్యాయం. ప్రజావేదిక కూల్చడం నుంచి పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేయడం వరకూ ఎన్నో అరాచకాల వల్ల తిరోగమనంలోకి వెళ్లాం’’
‘సంపదకు మూలం ఆర్థిక కార్యకలాపాలే...’
‘’సంపదకు మూలం ఆర్థిక కార్యకలాపాలే...అనే అవగాహనతో కూటమి ప్రభుత్వం ముందుకుపోతోంది. రాష్ట్ర విభజన జరిగిన మొదటి ఐదేళ్లలో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ ఉంది. కానీ, గడిచిన ఐదేళ్లలో గడ్డుస్థితికి చేరుకుంది. వనరుల దుర్వినియోగం, నిధుల పక్కదారి, పేలవమైన పాలనతో రాష్ట్రంలోని ఆస్తుల్ని తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. వైసీపీ అధికారం నుంచి వైదొలగే నాటికి (జూన్ 2024) ఉద్యోగులకు 21,980కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 4,657కోట్ల బకాయిలు ఉన్నాయి. పాలన ఆర్థిక సూత్రాలతో కాకుండా వ్యక్తి ప్రయోజనాలతో ప్రైవేటు సంస్థలా నడిచింది. సహజ వనరులు కొల్లగొట్టడం, ఆధిక పన్నులు వేసిన దుష్పరిపానలతో ప్రజలు దారుణమైన కష్టాలు పడ్డారు. ప్రజల గొంతు నులిమి, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దెబ్బతీసిన కక్షసాధింపు పాలనకు జనం చరమగీతం పాడారు. ’సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అని నమ్మే పార్టీని ఆశీర్వదించారు’’
సూపర్ సిక్స్ అమలు...
‘‘ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఎన్డీఏ ప్రభుత్వం అమలుచేస్తోంది. రైతుల సమగ్ర అభివృద్ధి కోసం పెట్టుబడి సాయం అందించడమే ‘అన్నదాత సుఖీభవ’ లక్ష్యం. వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్లో 11,855కోట్లు కేటాయించాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా 64.38లక్షల మందికి నెలకు నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకూ ‘ఎన్టీఆర్ భరోసా’ అమలవుతోంది. రజకులు, దూదేకులు, వడ్డెర, వాల్మీకి, గౌడ, కళింగ, గవర, పద్మశాలి, బెస్త, ఉప్పర నాయీ బ్రాహ్మణులు వంటి సంప్రదాయ వృత్తుల్లో ఉన్న కార్మికుల జీవనోపాధిని పెంపొందిస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌సీల కాంపోనెంట్‌కు 18,497కోట్లు, ఎస్‌టీలకు 7,557కోట్లు, బీసీలకు 39,007కోట్లు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి 4,376కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం’’
దీపం-2తో ఉచిత సిలెండర్లు..
‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీపం 2 పథకం ద్వారా మహిళలకు ఏటా మూడు వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇచ్చేపథకాన్ని ప్రారంభించాం. ప్రజా రవాణా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం త్వరలో అమలు చేస్తాం. ‘తల్లికి వందనం’ కోసం నిధులు కేటాయిస్తాం. అమరావతి, తిరుపతి, విశాఖపట్నంలో మూడు విజ్ఞాన నగరాల ఏర్పాటే లక్ష్యం’’
కలల రాజధాని సాకారం దిశగా..
‘’ఐదేళ్లుగా కనుమరుగైన మన రాష్ట్ర కలల రాజధాని అమరావతి సాకారం దిశగా ఏన్డీఏ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది..రాజధాని నగర అభివృద్ధికి ప్రభుత్వం కేంద్రం నుంచి పదిహేను వేలకోట్ల రూపాయలు పొందింది. 189కిలోమీటర్ల ఓఆర్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పునరుద్ధరణకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది’’
త్వరిత గతిన పోలవరం పూర్తి..
పోలవరంతోపాటు పలు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రణాళికలో భాగంగా జలవనరుల శాఖకు 16,705కోట్లు బడ్జెట్‌లో కేటాయించాం. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 4.0తీసుకొస్తున్నాం.’’
మహనీయుల అడుగుజాడల్లో..
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో మహనీయుల సూక్తులను ఉదహరించారు. రాష్ట్రంలో 20లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నైపుణ్య గణన నిర్వహిస్తున్నామని చెబుతూ.. చైనా తత్వవేత్త సూక్తిని ప్రస్తావించారు. ‘‘ఒక వ్యక్తికి ఆహారంగా చేపను ఇవ్వడం కన్నా చేపను పట్టడం నేర్పించు’’ అన్న ఆ తత్వవేత్త దారిలోనే ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. రైతుల సమగ్ర అభివృద్ధి కోసం ‘అన్నదాత సుఖీభవ’ పథకం తెచ్చామని చెబుతూ.. ‘‘వ్యవసాయం చేసే చేతులకు మనం సాయం చేయాలి’’ అన్న ప్రముఖ సంఘ సంస్కర్త వీరేశలింగం వ్యాఖ్యలను గుర్తుచేశారు. ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో చెప్పే సందర్భంలో కౌటిల్యుడి మాటలను ప్రస్తావించారు. ‘’సంపదకు మూలం ఆర్థిక కార్యకలాపాలే. అవి లేకుంటే వనరుల సమీకరణ ఇబ్బందులు తెచ్చిపెడుతుంది..ప్రస్తుత శ్రేయస్సు, భవిష్యత్ వృద్ధి రెండూ నాశనమయ్యే ప్రమాదం ఉంది’’ అన్న కౌటిల్యుడి హెచ్చరికలను గత ప్రభుత్వం విస్మరించిందని, తమ ప్రభుత్వం వాటిని శిరసావహిస్తోందని మంత్రి తెలిపారు. కాగా, కేశవ్ బడ్జెట్ ప్రసంగం అనంతరం సభలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్‌ను శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి పి. నారాయణ ప్రవేశపెట్టారు.
Updated Date - Nov 12 , 2024 | 04:39 AM