Ap CM Chandrababu :అహంకారానికి దూరంగా.. బాధ్యతతో పనిచేద్దాం
ABN, Publish Date - Jun 16 , 2024 | 03:36 AM
‘అహంకారానికి దూరంగా బాధ్యతతో పనిచేద్దాం. ఏ ఆశలు, ఆకాంక్షలతో మనల్ని గెలిపించారో వాటిని నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేద్దాం. పాలన ఎలా ఉండకూడదో జగన్ చూపించారు. ఎలా ఉండాలో మనం ఒక నమూనాగా... ఆదర్శంగా పనిచేసి చూపిద్దాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేద్దాం
టీడీపీలో కింది స్థాయి నేతలకు చంద్రబాబు పిలుపు
ఈ విజయం పార్టీ కార్యకర్తలకు అంకితమని వ్యాఖ్య
త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన
రేపు పోలవరానికి సీఎం.. క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం
అమరావతి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ‘అహంకారానికి దూరంగా బాధ్యతతో పనిచేద్దాం. ఏ ఆశలు, ఆకాంక్షలతో మనల్ని గెలిపించారో వాటిని నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేద్దాం. పాలన ఎలా ఉండకూడదో జగన్ చూపించారు. ఎలా ఉండాలో మనం ఒక నమూనాగా... ఆదర్శంగా పనిచేసి చూపిద్దాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం ఆయన టీడీపీలో కింది స్థాయి నేతలైన బూత్ కన్వీనర్లు, యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో సాధించిన విజయం అపూర్వమని, దీనిని పార్టీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. ‘గత 20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈసారి మనం గెలిచాం. కూటమి విజయం గాలివాటంగా వచ్చింది కాదు. దీని వెనుక కార్యకర్తలు పడిన కష్టాన్ని మర్చిపోను. పసుపు జెండా పట్టుకొంటే చెయ్యి విరగొట్టారు. జై టీడీపీ అంటే గొంతు కోసి చంపారు. అయినా వెనకడుగు వేయకుండా కార్యకర్తలు పనిచేశారు. అనేకమంది ఆస్తులు పోగొట్టుకొన్నారు. వందల మంది జైళ్లకు వెళ్లారు.
ఆ సమయాల్లో నిద్రలేని రాత్రులు గడిపాను. వారి త్యాగాలు నా జీవితంలో మర్చిపోలేను. కింది స్థాయిలో ఎవరు ఎక్కడ ఏం పనిచేశారో అధ్యయనం చేస్తున్నాం. నాయకులు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు కూడా బలంగా ఉంటాయి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్లు పెట్టామో వాటన్నింటినీ వంద రోజుల్లో ఏర్పాటు చేస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు మార్చేలా పథకాలు అమలు చేస్తామని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు త్వరలో ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇకనుంచి ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి రావాలని చంద్రబాబు నిర్ణయించారు. మంత్రులూ తమ జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు తరచూ వెళ్లాలని ఆదేశించారు.
సీఎంగా తొలిసారి టీడీపీ కార్యాలయానికి రాక
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారిగా టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు కార్యాలయ సిబ్బంది, నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరినీ చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. కార్యకర్తలు, నేతలు, కార్యాలయ సిబ్బందితో ముచ్చటించారు. కార్యకర్తలు ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు చంద్రబాబును కలిసి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కొంతమంది మహిళలు మెమొంటోలు అందజేసి ఆయనకు పాదాభివందనం చేశారు. కొంతమంది కార్యకర్తలు, వృద్ధులు తమ సమస్యలను చెప్పగా ఓపికగా విని వినతిపత్రాలు స్వీకరించారు.
బ్యారికేడ్లు వద్దు
పార్టీ కార్యాలయంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో చంద్రబాబు వద్దని వారించారు. ప్రజలు తనను నేరుగా కలిసేందుకు అవకాశమివ్వాలని, బ్యారికేడ్లు వద్దని భద్రత సిబ్బందికి సూచించారు. అనంతరం అందుబాటులో ఉన్న నేతలతో, ఆ తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయ సిబ్బందితో భేటీ అయ్యారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బాగా పనిచేశారని అభినందించారు. విజయంతో పని అయిపోయినట్లు కాదని, మరింత ప్రతిభావంతంగా పనిచేయాలని సూచించారు. పార్టీ పరంగా అందరికీ న్యాయం చేస్తానని, తాను అందుబాటులో ఉంటానని తెలిపారు.
పోలవరం పరిస్థితేంటో చూడాలి
పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతుల పరిశీలనకు సోమవారం అక్కడకు వెళ్లే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. వర్షాలు, వరదలు రావడానికి ముందే ఒకసారి పోలవరం పరిస్థితి ఏమిటో నేరుగా చూడాలని అనుకొంటున్నామని, అందుకే వచ్చే సోమవారం పోలవరానికి వెళ్లాలన్న ఆలోచన ఉందని సీఎం చెప్పారు. తన క్షేత్ర స్థాయి పర్యటనలు పోలవరంతో మొదలవుతాయన్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీలను ఇంకా అనుకోలేదని, త్వరలో ఖరారు చేస్తామని వివరించారు. ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడంపై ఆలోచన చేస్తున్నామన్నారు. ‘ముఖ్యమంత్రికి విజ్ఞాపనలు ఇవ్వడానికి ప్రజలు వస్తుంటారు. దీనికోసం ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నది ఆలోచన చేస్తున్నాం. వీలైనంత వరకూ రాష్ట్ర సచివాలయం వద్ద వినతుల స్వీకరణ ఉంటే బాగుంటుందని అనుకొంటున్నాం. అక్కడ కాకపోతే మరో చోట పెడతాం. ఎక్కడ పెట్టినా అక్కడకు వచ్చే సామాన్యులకు కనీస వసతులు ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. వినతులను సత్వరం పరిష్కరించడానికి ఎటువంటి ఏర్పాటు ఉండాలన్నదానిపై కూడా చర్చిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేయడం వల్ల సచివాలయానికి రాకపోకలకు ఇబ్బంది కలిగిందని, ఇప్పుడు వాటిని మరింత మెరుగుపరుస్తామని చంద్రబాబు చెప్పారు.
'స్పందన’ పేరు మార్పు
ప్రజల నుంచి సమస్యలు స్వీకరించి వాటిని సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపి పరిష్కరించే కార్యక్రమం పేరును ప్రభుత్వం మార్చింది. వైసీపీ ప్రభుత్వం ‘స్పందన’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభు త్వం దీనికి ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ సిస్టమ్)గా నామకరణం చేసింది. కాగా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 నుంచి ఉండవచ్చని పోలీస్ శాఖ అభిప్రాయపడుతోంది.
Updated Date - Jun 16 , 2024 | 03:36 AM