Ap Govt : స్టేట్ బోర్డులోనే పరీక్షలు
ABN, Publish Date - Sep 13 , 2024 | 03:29 AM
ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎ్‌సఈ విద్యార్థులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంలో తొలిసారి సీబీఎ్‌సఈ బోర్డులో పరీక్షలు రాయాల్సిన నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగించింది.
వెయ్యి సీబీఎస్‌ఈ పాఠశాలలపైప్రభుత్వ నిర్ణయం
78 వేల మంది విద్యార్థులకు ఉపశమనం
పరీక్షల విధానం ప్రక్షాళన
వచ్చే ఏడాది నుంచి దశల వారీగా మార్పులు
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎ్‌సఈ విద్యార్థులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంలో తొలిసారి సీబీఎ్‌సఈ బోర్డులో పరీక్షలు రాయాల్సిన నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగించింది. ఈ ఏడాదికి స్టేట్ బోర్డులోనే పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలతో ఈ మేరకు మార్పులు చేయనుంది. గత ప్రభుత్వంలో వెయ్యి పాఠశాలలను సీబీఎ్‌సఈలోకి మార్చారు. వాటిలో చదువుతున్న 78వేల మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతిలోకి ప్రవేశించారు. వారంతా ఈ ఏడాది సీబీఎ్‌సఈ బోర్డులో పరీక్షలు రాయాల్సి ఉండగా, వారి అభ్యసన సామర్థ్యాలపై పాఠశాల విద్యాశాఖ ఇటీవల అసె్‌సమెంట్ పరీక్ష నిర్వహించింది. అందులో 90శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వారు పబ్లిక్ పరీక్షలు కూడా సీబీఎ్‌సఈ తరహాలో రాస్తే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని గుర్తించిన ప్రభుత్వం, స్టేట్ బోర్డులోనే పరీక్షలు రాయించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అసె్‌సమెంట్ పరీక్షలో 326 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. 556 పాఠశాలల్లో 25శాతం లోపు ఉత్తీర్ణత నమోదైంది. 14 పాఠశాలల్లో మాత్రమే 75శాతానికి పైగా ఉత్తీర్ణులయ్యారు.
పరీక్షల విధానం ప్రక్షాళన
2025-26 విద్యా సంవత్సరం నుంచి మొత్తం పరీక్షల విధానాన్నే మార్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించేలా పరీక్షా విధానాన్ని మార్చనుంది. ప్రస్తుతం రాష్ట్ర బోర్డు పరీక్షలు ఎక్కువగా థియరీపైనే ఆధారపడి ఉన్నాయి. ఇకపై వాటిని విశ్లేషణాత్మక విధానంలోకి మార్చాలని నిర్ణయించింది. అలాగే ఆబ్జెక్టివ్ ప్రశ్నలు పెంచాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు మొదలుపెట్టనుంది.
విద్యార్థుల భవిష్యత్తు కోసం: లోకేశ్
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు స్టేట్ బోర్డులో రాసే అవకాశం కల్పించినట్లు మంత్రి లోకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం టీచర్లకు శిక్షణ ఇవ్వకుండా సీబీఎ్‌సఈ ప్రారంభించిందని, అదే కొనసాగిస్తే వారు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. టోఫెల్, ఐబీ అంటూ హడావుడి చేసి గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు.
Updated Date - Sep 13 , 2024 | 03:29 AM