ఆ ఉద్యోగులను 62 ఏళ్ల వరకు కొనసాగించండి
ABN, Publish Date - Oct 06 , 2024 | 05:53 AM
తిరుపతి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(తుడా)కి చెందిన ముగ్గురు ఉద్యోగులను 62 ఏళ్లు నిండేవరకు సర్వీసులో కొనసాగించాలని తుడా అధికారులను హైకోర్టు ఆదేశించింది.
తుడా అధికారులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): తిరుపతి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(తుడా)కి చెందిన ముగ్గురు ఉద్యోగులను 62 ఏళ్లు నిండేవరకు సర్వీసులో కొనసాగించాలని తుడా అధికారులను హైకోర్టు ఆదేశించింది. తుడా ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో ప్రత్యేక నిబంధనలేమైనా రూపొందించారా? అనే వివరాలు సమర్పించాలని తుడా తరఫు స్టాండింగ్ కౌన్సిల్‌కు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.60 ఏళ్లు నిండేనాటికి తమతో పదవీ విరమణ చేయించేందుకు తుడా వైస్‌చైర్మన్ చేపట్టిన చర్యలను సవాలు చేస్తూ తిరుపతికి చెందిన వై.కృష్ణ శ్రీనివాసులు, కె.నాగార్జున, సి.వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎన్.సుబ్బారావు, ఆకుల శ్రీ కృష్ణసాయి భార్గవ్ వాదనలు వినిపించారు.
తుడా రాష్ట్ర ప్రభుత్వంలో భాగమని, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ యాక్ట్-2016లో ఉద్యోగుల పదవీ విర మణ గురించి ఎలాంటి నిబంధనలూ రూపొందించలేదని తెలిపారు. అందువల్ల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం పట్టణాభివృద్ధి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకూ వర్తిస్తుందని వాదించారు.
వయసు 60 ఏళ్లు నిండుతున్న నేపథ్యంలో పదవీ విరమణ చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి చేస్తుండడంతో వారు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. వారి సర్వీసును 62 ఏళ్ల వరకు కొనసాగించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. కాగా, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని తుడా తరఫు స్టాండింగ్ కౌన్సిల్ అభ్యర్థించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ఽన్యాయమూర్తి.. 2022 జనవరి 31న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 15 ప్రకారం పిటిషనర్లను 62 ఏళ్లు నిండే వరకు సర్వీసులో కొనసాగించాలని ప్రభుత్వం, తుడా అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - Oct 06 , 2024 | 05:53 AM