AP Politics: సీఎం రేవంత్‌తో వైఎస్ షర్మిల భేటీ.. స్కెచ్‌లో భాగమేనా?
ABN , Publish Date - Jul 02 , 2024 | 04:32 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జులై 8వ తేదీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేపథ్యంలో విజయవాడలో భారీ కార్యక్రమం నిర్వహించేందుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సన్నాహాకాలు చేస్తున్నారు. ఆ క్రమంలో తన తండ్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలకు తెలంగాణలో ఆ పార్టీ కీలక నేతలను ఆహ్వానించాలని ఆమె నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులోభాగంగా సీఎం రేవంత్‌రెడ్డిని వైఎస్ షర్మిల ఆహ్వానించినట్లు సమాచారం. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సైతం ఆమె కలిసి వైఎస్ఆర్ జయంతి వేడుకలకు ఆహ్వానించారని సమాచారం.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు తెలంగాణలోని ఆ పార్టీ కీలక నేతలను ఆహ్వానించడం వెనుక వైయస్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ అయితే వైరల్ అవుతుంది.
ఇటీవల తన సోదరుడు, మాజీ సీఎం వైయస్ జగన్.. బెంగళూరు పర్యటనలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారని వార్తలు గుప్పుమన్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలి బాధ్యతల నుంచి షర్మిలను తప్పిస్తే తాను హస్తం పార్టీకి స్నేహ హస్తం అందిస్తానంటూ తన నిర్ణయాన్ని శివకుమార్ ఎదుట వైయస్ జగన్ వ్యక్త పరిచినట్లు ఏమాత్రం ఆధారాలు లేని ఓ ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని స్వయంగా డీకే శివకుమార్ ఖండించారు. తనను వైఎస్ జగన్ కలిశారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు.
అయినప్పటికీ వైఎస్ షర్మిల మాత్రం తన వ్యూహాలకు కార్యరూపం ఇస్తూ ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగానే తెలుగు రాష్ట్రాల్లోని హస్తం పార్టీ కీలక నేతలంతా తన వైపే ఉన్నారనే ఓ స్పష్టమైన సందేశాన్ని సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఇవ్వాలని ఆమె నిర్ణయించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అంతేకాకుండా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా.. పడిన చోటే బలంగా లేవాలనే ఉద్దేశ్యంలో వైఎస్ షర్మిల ఉన్నట్లుగా ఆమె వ్యవహార శైలి ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పాపాన్ని కాంగ్రెస్ పార్టీ మూటకట్టుకుంది. దీంతో ఆ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా ఏ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించలేక పోయింది. ఇంకా చెప్పాలంటే.. ఆ పార్టీ సారథ్యం తీసుకునేందుకు సైతం ఎవరు సాహసించలేదు.
అలాంటి వేళ ఇటీవల జరిగిన ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీకి ఊపిరిలూదడానికి ఆమె శాయశక్తుల కృషి చేశారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను సైతం బరిలో నిలిపారు. ఇక కడప లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలో నిలిచింది. కానీ తన సోదరుడు వైయస్ అవినాష్ రెడ్డి చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు.
Also Read: West Bengal: చోప్రా వీడియో ఘటనలో కీలక మలుపు
మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చాలా తక్కువ స్థానాలను గెలుచుకుంది. దీంతో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనేది సైతం ఎవరి అంతుబట్టని విధంగా ఉంది. అలాంటి వేళ.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని క్రియాశీలకంగా వ్యవహరించేలా చేయాలనే ఉద్దేశ్యంలో వైఎస్ షర్మిల ఉన్నట్లుగా తెలుస్తుంది. అదీకాక.. ప్రస్తుతం వైఎస్ జగన్ పార్టీలో ఉన్నవారంతా గతంలోని కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన వారే.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీల్లో నయా జోష్ తీసుకు వచ్చి.. తన సోదరుడి పార్టీలో ఉన్న వారందరిని పాత పార్టీ గూటికి తీసుకు వచ్చే ప్రయత్నాలకు పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టనున్నారని సమాచారం. అందులోభాగంగానే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకు వచ్చి.. వీరంతా రాజన్న ఆత్మబంధువులంటూ ప్రజలకు ఓ క్లియర్ కట్ సందేశాన్ని ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని ప్రజలనే కాదు.. సోదరుడు వైయస్ జగన్ పార్టీలోని కీలక నేతలను సైతం తన వైపు తిప్పుకొనేందుకు పక్కా ప్రణాళికతో వైఎస్ షర్మిల అడుగులు వేస్తుందనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది.
భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నా.. ప్రజల మధ్య హస్తం పార్టీ నిలుస్తుందనే ఓ సందేశాన్ని సోదరుడు వైయస్ జగన్‌కు అందించాలనే ఓ కృత నిశ్చయంతో ఆయన సోదరి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఉన్నట్లు ఆమె వ్యవహార శైలిని చూస్తే అర్థమవుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News