AP Revenue Department : ఆర్వోఆర్ అప్పీళ్ల బాధ్యత మళ్లీ ఆర్‌డీవోలకే!
ABN, Publish Date - Dec 09 , 2024 | 04:12 AM
జిల్లా రెవెన్యూ అధికారు(డీఆర్‌వో)లపై పనిభారం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వారి వద్ద ఉన్న కొన్ని కీలక అధికారాలను దిగువ స్థాయికి బదలయించాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది.
జిల్లా రెవెన్యూ అధికారులపై భారం పెరుగుతున్నందునే!
వారికి ఇతర బాధ్యతలు ఉండడంతో అప్పీళ్లను పట్టించుకోవడం లేదు
దీంతో ఆ అధికారాన్ని వారి నుంచి తప్పించాలని రెవెన్యూ శాఖ యోచన
త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
అమరావతి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా రెవెన్యూ అధికారు(డీఆర్‌వో)లపై పనిభారం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వారి వద్ద ఉన్న కొన్ని కీలక అధికారాలను దిగువ స్థాయికి బదలయించాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది. అందులో కీలకమైనది అప్పీళ్ల అంశం. జగన్ జమానాలో భూముల సర్వే సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారు(ఆర్‌డీవో)ల వద్ద ఉన్న అప్పీళ్ల అధికారాన్ని తొలగించి డీఆర్‌వోలకు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం(ఆర్వోఆర్ యాక్ట్)- 1971లో సవరణ చేసి రూల్స్ మార్చి మరీ అమల్లోకి తెచ్చారు. అయితే దానివల్ల కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఆర్వోఆర్ చట్టం ప్రకారం.. రైతులు, ప్రజలు భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యుటేషన్ కోసం తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటారు. డాక్యుమెంట్లన్నీ పక్కాగా ఉంటే రెవెన్యూ రికార్డుల్లో సవరణలు చేస్తారు. భూముల తనఖా, వ్యాపార లీజు ఒప్పందాలకు కూడా ఇదే విధానం వర్తిస్తోంది. అప్పట్లో ఆర్‌వోఆర్ రికార్డుల సవ రణపై తహశీల్దారే నిర్ణయం తీసుకునేవారు. ఆ నిర్ణయం నచ్చనివారు ఆర్‌డీవో వద్ద అప్పీల్ చేసుకునేవారు. అయితే జగన్ సర్కారు భూముల సర్వే సందర్భంగా 2022 అక్టోబరులో ఆ చట్టాన్ని సవరించింది.
ఏదైనా భూమిపై రిజిస్ట్రేషన్, తనఖా, లీజు ఒప్పందాలు జరిగిన తర్వాత వాటికి సరైన పత్రాలు లేవనో, లేక ఇతర కారణాలతో తిరస్కరించే అధికారాన్ని తహశీల్దార్‌కు దఖలుపరచింది. తహశీల్దార్ నిర్ణయంపై భిన్నాభిప్రాయం ఉంటే.. ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆర్‌డీవోకు పంపితే.. 30 రోజుల వ్యవధిలో కేసు విచారణ చేసి ఉత్తర్వులు ఇస్తారని పేర్కొన్నారు. వీటిపై కూడా దరఖాస్తుదారులకు భిన్నాభిపాయాలు ఉంటే డీఆర్‌వో వద్ద అప్పీల్ చేసుకునేలా చట్టసవరణ చేశారు. అయితే ఆచరణలో దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. డీఆర్‌వో జిల్లా కలెక్టరేట్‌లో ఉంటారు. ప్రొటోకాల్, ఇతర కీలక విధులు ఆయనకే ఉన్నాయి. దీంతో పాటు కలెక్టర్ అప్పగించే ఇతర బాధ్యతలూ ఉంటాయి. ఫలితంగా ఆర్వోఆర్ అప్పీళ్ల పరిష్కారంపై వారు దృష్టిసారించడం లేదని, ఆరు నెలల వ్యవధిలో ఈ కేసులను పరిష్కరించాల్సి ఉండగా.. కొన్నింటిని ఏళ్ల తరబడి విచారణకే స్వీకరించడం లేదన్న ఫిర్యాదులు ఇటీవలికాలంలో ప్రభుత్వానికి వచ్చాయి. 16 జిల్లాల పరిధిలో ఆరు నెలలపైన పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లు 2,800పైనే ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై రైతులు, సామాన్యులు నిరంతరం జిల్లా కేంద్రానికి వచ్చిపోవడం, సమయానికి డీఆర్‌వో అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఆరు నెలల కాలంలో ఒక్క రెవెన్యూ శాఖ సెటిల్ చేయాల్సిన అంశాలపైనే 67వేల విన్నపాలు అందాయి. వీటిలో 20,840 ఒక్క ఆర్వోఆర్ చట్టానికి సంబంధించినవే. వీటిలోనూ 60 శాతానికిపైగా వినతులు డీఆర్‌వో వద్ద ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న అప్పీళ్లపైనే కావడం గమనార్హం. రైతులు, భూ యజయానుల వినతులను పరిష్కారం కోసం ప్రభుత్వం మళ్లీ డీఆర్‌వోలకే పంపుతోంది. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు, అప్పీళ్లపై కొందరు డీఆర్‌వోలు ఏమాత్రం దృష్టిపెట్టలేకపోతున్నారని రెవెన్యూ శాఖ గుర్తించింది. గత నెల 29వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. దరిమిలా అప్పీళ్ల బాధ్యతను డీఆర్‌వోల నుంచి తప్పించి తిరిగి ఆర్‌డీవోలకు పంపాలని రెవెన్యూ శాఖ త్వరలో ప్రతిపాదనలు పంపనుంది.
సీఎంతో చర్చించాక తుది నిర్ణయం: మంత్రి అనగాని
పాలనాకారణాలు, ప్రొటోకాల్ డ్యూటీల వల్ల డీఆర్‌వోలు బిజీగా ఉంటూ అప్పీళ్లను సరిగా చూడడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. దీనికి సరైన పరిష్కారం అప్పీళ్ల బాధ్యతను తిరిగి ఆర్‌డీవోలకు అప్పగించడమేనని భావిస్తున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ‘ఆర్‌డీవో స్థానికంగా డివిజన్ కేంద్రంలో అందుబాటులో ఉంటారు. ప్రజలు కూడా అప్పీళ్లపై విచారణకు హాజరవడానికి సులభంగా ఉంటుంది. దూరప్రయాణాల భారం ఉండదు. ఇదే విషయంపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదనలు పంపిస్తాం. ఆయనతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. ఇటీవల మొదలైన రెవెన్యూ సదస్సుల్లో కూడా ఆర్వోఆర్ అప్పీళ్ల పరిష్కారంపైనే ఎక్కువ ఫిర్యాదులు, విన్నపాలు వస్తున్నాయని వివరించారు.
Updated Date - Dec 09 , 2024 | 04:16 AM