ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt : పారిశ్రామిక పార్కుల్లో రైతులకు భాగస్వామ్యం

ABN, Publish Date - Sep 13 , 2024 | 02:58 AM

రైతులు, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

  • ఎంఎస్‌ఎంఈలకు రూ.100 కోట్లతో క్రెడిట్‌ గ్యారంటీ

  • యూనిట్ల స్థాపనకు డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహం

  • ఉద్యాన, ఆక్వా రైతుల లబ్ధికి సర్కారు కసరత్తు

  • ఎంఎస్‌ఎంఈ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖలపై సీఎం సమీక్ష

  • సరికొత్త పారిశ్రామిక పాలసీ రూపొందించాలి: చంద్రబాబు

  • గత ప్రభుత్వం పరిశ్రమలకు పెండింగ్‌ పెట్టిన ఇన్సెంటివ్‌

  • బకాయిలు చెల్లించేందుకు కసరత్తు చేయాలని ఆదేశం

  • అమరావతిలో రూ.150 కోట్లతో టెక్నాలజీ సెంటర్‌

  • యువతకు పారిశ్రామిక వృత్తి నైపుణ్య శిక్షణ: మంత్రి కొండపల్లి

  • ఎంఎస్‌ఎంఈ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖలపై సీఎం సమీక్ష

  • సరికొత్త పారిశ్రామిక పాలసీ రూపొందించాలి: చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రైతులు, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూములున్న రైతులే రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసుకుని.. వాటిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రభుత్వ పరంగా తగిన ప్రోత్సాహం అందించాలని భావిస్తోంది. డ్వాక్రా సంఘాలను ఎంఎ్‌సఎంఈలతో అనుసంధానం చేసి, డ్వాక్రా మహిళలు కూడా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పేలా ప్రోత్సహించనుంది. పుణె వంటిచోట్ల ఇలాంటి విధానం అమల్లో ఉందని పరిశ్రమల శాఖ అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.

అక్కడి విధానాలను అధ్యయనం చేసి, రైతుల భాగస్వామ్యంతో ఎంఎ్‌సఎంఈలను నెలకొల్పేందుకు మెరుగైన విధానాలను అమలు చేయాలని ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు అపారమైన అవకాశాలు, అనువైన పరిస్థితులు ఉన్నాయని సీఎం తెలిపారు.

ఉద్యాన పంటలు, ఆక్వా కల్చర్‌ ఉత్పత్తులకు ఆహారశుద్ధి పరిశ్రమల ద్వారా అదనపు విలువ చేకూరుతుందని, తద్వారా రైతులకు ఆదాయ వనరులు పెరుగుతాయని వివరించారు. రైతులు పండించే పంటలకు వాళ్లే వాల్యూ ఎడిషన్‌ ఇచ్చుకునే పరిస్థితి కల్పించే విధంగా సరికొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని, వాటిని ప్రోత్సహించాలని సూచించారు. టమాటా, మామిడి, మిరప, పసుపు, ఆక్వా ఉత్పత్తులకు అవిపండే ప్రాంతంలోనే ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అనేక సమస్యలు, సవాళ్లతో కుదేలైన ఎంఎ్‌సఎంఈ రంగాన్ని తిరిగి గాడిలో పెడతామని తెలిపారు.


రాష్ట్రంలోని ఎంఎ్‌సఎంఈలకు క్రెడిట్‌ గ్యారెంటీ కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఏడు పారిశ్రామిక క్లస్టర్లను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆటోనగర్లను ఆధునీకరించాలని, పెండింగ్‌లో ఉన్న ఎంఎ్‌సఎంఈ పార్కులను కూడా త్వరితగతిన పూర్తిచేసి, వాటిలో అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించి పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామని వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిబంధకంగా మారిన నిబంధనలను తొలగించి, పెట్టుబడిదారులకు సులభతరంగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలో సంబంధిత విభాగాలు, అధికారులు స్పందించకపోతే.. ఆటోమేటిక్‌గా అనుమతులు పొందేవిధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సూచించారు. ప్యాకింగ్‌, డిజిటల్‌, కామర్స్‌, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పిస్తే చిన్న పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్‌ లభిస్తుందని సీఎం తెలిపారు.


  • రూ.150 కోట్లతో అమరావతిలో టెక్నో సెంటర్‌

  • యువతకు నైపుణ్య శిక్షణ: కొండపల్లి

రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమలను నెలకొల్పడంతో పాటు వాటిలో స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సీఎం సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా బీటెక్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సమీపంలోని పూడిలో కేంద్రం నిధులతో ఒక టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు చేయగా.. అక్కడ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. అటువంటి మరో టెక్నాలజీ సెంటర్‌ను రూ.250 కోట్లతో అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ రెండు సెంటర్లను అనుసంధానం చేసి రాష్ట్రవ్యాప్తంగా హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో మరో 10 శిక్షణ కేంద్రాలు (స్కిల్‌ సెంటర్లు) ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు చెల్లించాల్సిన రూ.1,500 కోట్ల ఇన్సెంటివ్‌ల బకాయిలను చెల్లించేందుకు కసరత్తు చేయాలని ఆర్థికశాఖకు సీఎం చంద్రబాబు సూచించారని తెలిపారు. మొత్తం 26 జిల్లాల్లోనూ పరిశ్రమల కేంద్రాలను ప్రయోజనకరంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 03:01 AM

Advertising
Advertising