Ap Govt Authorities : రేషన్.. పరేషాన్
ABN, Publish Date - Dec 04 , 2024 | 03:57 AM
రేషన్ బియ్యం లోడైన కాకినాడ పోర్టులోని స్టెల్లా ఎల్ నౌకను సీజ్ చేయడం అసాధ్యమేనని అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. నౌక సీజ్ కోసం కేసుపెట్టినా అడ్మిరాలిటీ న్యాయస్థానంలో అది నిలబడే అవకాశం చాలా తక్కువని భావిస్తున్నారు.
ఆ బియ్యం దించేయడమే
స్టెల్లా నౌక సీజ్ ఇక అసాధ్యమేనా?
అడ్మిరాలిటీ కోర్టులో కేసు వేసినా నిలబడే అవకాశం లేదంటున్న అధికారులు
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
రేషన్ బియ్యం లోడైన కాకినాడ పోర్టులోని స్టెల్లా ఎల్ నౌకను సీజ్ చేయడం అసాధ్యమేనని అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. నౌక సీజ్ కోసం కేసుపెట్టినా అడ్మిరాలిటీ న్యాయస్థానంలో అది నిలబడే అవకాశం చాలా తక్కువని భావిస్తున్నారు. పైగా మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేయడం అతికష్టమైన పనిగా నిపుణులతో మాట్లాడాక ఓ అంచనాకు వచ్చారు. ఇటీవల కాకినాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... బియ్యం లోడు అవుతున్న షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు. అయితే అప్పటికే తుఫాను ముప్పు వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారడంతో.. నౌకలోకి లోడింగ్ నిలిచిపోయింది. దీంతో పవన్ షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశించిన తర్వాత దీన్ని ఆపడానికి పెద్దగా చిక్కులు ఎదురుకాలేదు. అయితే ఇప్పుడు తుఫాను ముప్పు తొలగిపోయింది. దీంతో పోర్టులో మిగిలిపోయిన బియ్యం లోడింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒకవేళ లోడింగ్ చేయకపోతే డెమరేజీ భారం పడనుంది. మరోవైపు.. కస్టమ్స్ అధికారులేమో బియ్యం స్మగ్లింగ్ పరిధిలోకి రావంటూ నౌకను సీజ్ చేయడానికి ముందుకురాలేదు. పౌరసరఫరాలశాఖ అడ్మిరాలిటీ న్యాయస్థానంలో కేసు దాఖలకు సోమవారం ప్రయత్నాలు చేసింది. అయితే, ఈ న్యాయస్థానం.. నౌకలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల వివాదాలకు మాత్రమే పరిమితమై తీర్పులు ఇస్తుంది. దీంతో ఒకవేళ నౌక సీజ్‌కు పిటిషన్ వేసినా నిలబడదనే వాదన అధికారుల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాకినాడలో ఉన్న నౌకను కస్టమ్స్, అడ్మిరాలిటీ న్యాయస్థానం ఆదేశాలు లేకుండా ఆపడం ఇబ్బందని అధికారులు భావిస్తున్నారు. నౌకలోని రేషన్ బియ్యాన్ని కిందకు దింపేసి నౌకకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Updated Date - Dec 04 , 2024 | 03:58 AM