ఢిల్లీలో బాబు బ్రాండ్
ABN, Publish Date - Sep 29 , 2024 | 05:24 AM
‘చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టులకు కేంద్రం ఇవ్వడానికి సమ్మతి తెలిపిన విలువ రూ.60 వేల కోట్లు. నమ్మశక్యం కానన్ని నిధులు కేంద్రం నుంచి సాధించగలిగాం. వంద రోజుల్లో ఇన్ని నిధులకు సమ్మతి తెచ్చుకోవడం ఒక అద్భుతం’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయ పడ్డారు.
వంద రోజుల్లో ఇన్ని నిధులు ఓ అద్భుతం
ఇప్పటికే రూ.60 వేల కోట్లకు సమ్మతి తెలిపిన కేంద్రం
పెట్రో కారిడార్‌కు మరో అరవై వేల కోట్లు వస్తాయి
అమరావతి సహా 30 చోట్ల ఈఎ్‌సఐ ఆస్పత్రుల నిర్మాణం
అర్హులుంటే రాష్ట్రానికి 5-10 లక్షల పక్కా ఇళ్లు మంజూరు
ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయనున్నాం
‘ఆంధ్రజ్యోతి’తో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టులకు కేంద్రం ఇవ్వడానికి సమ్మతి తెలిపిన విలువ రూ.60 వేల కోట్లు. నమ్మశక్యం కానన్ని నిధులు కేంద్రం నుంచి సాధించగలిగాం. వంద రోజుల్లో ఇన్ని నిధులకు సమ్మతి తెచ్చుకోవడం ఒక అద్భుతం’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఇక్కడ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో పలు విషయాలు వెల్లడించారు. ‘పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల మంజూరుకు కేంద్రం ఆమోదం తెలిపింది. మొదటి దశ సకాలంలో పూర్తయితే రెండో దశ నిర్మాణానికి మరో రూ.18 వేల కోట్లు ఇవ్వడానికి సుముఖత తెలిపింది. రాష్ట్రానికి జీవనాడి వంటి ఈ ఒక్క ప్రాజెక్టుకే కేంద్రం నుంచి రూ.30 వేల కోట్లు అందనున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు అందనున్నాయి. ఒక్కోదానికి రెండున్నర వేల కోట్ల చొప్పున రెండు పారిశ్రామిక నోడ్స్‌కు మొత్తం రూ.5 వేల కోట్లు మంజూరు చేశారు. అమరావతిని దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేయడానికి కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రెండున్నర వేల కోట్లు ఇవ్వనున్నారు.
రహదారుల కోసం
అమరావతి చుట్టుపక్కల ఉన్న వివిధ జాతీయ రహదారుల విస్తరణకు మరో రెండున్నర వేల కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. తాజాగా విశాఖ ఉక్కుకు రూ.2 వేల కోట్లు ఇవ్వనుంది. ఉపాధి హామీ పథకం పనుల నిమిత్తం గ్రామ పంచాయతీలకు ఇటీవల రెండున్నర వేల కోట్లు విడుదలయ్యాయి. వీటన్నింటి విలువ రూ.60 వేల కోట్లు. ఇవిగాక పెట్రో కారిడార్ అనుకొన్న పద్ధతిలో ముందుకు వెళ్తే కేంద్రం నుంచి దీనికి మరో అరవై వేల కోట్లు వస్తాయి. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి లేదా రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కూడా కేంద్రం సుముఖత తెలిపింది. మూడు నాలుగు నెలల్లో ఇన్ని నిధులు రావడం ఒక అద్భుతం. ఆచరణ సాధ్యం అనుకొన్న ప్రతి పనినీ కేంద్ర ప్రభుత్వం చేసి పెడుతోంది. చంద్రబాబుకు ఢిల్లీలో పెద్ద బ్రాండ్ ఇమేజి ఉంది. ఆయనను ఉత్తర భారత నేతలు కూడా చాలా గౌరవిస్తారు. ఆయనను దూరదృష్టి కలిగిన నేతగా పరిగణిస్తారు. ఆయన వల్లే రాష్ట్రానికి ఇన్ని నిధులు వస్తున్నాయి’ అని వెల్లడించారు.
వ్యవసాయంతో ఉపాధి హామీ అనుసంధానం..
ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను వ్యవసాయంతో అనుసంధానం చేయడానికి కేంద్రం ఆసక్తితో ఉందని, త్వరలో దీనిపై ఉన్నత స్ధాయి సమావేశం నిర్వహించనుందని పెమ్మసాని తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆవాస్-2024 పేరుతో కేంద్రం ఒక యాప్‌ను తయారు చేసిందని, అర్హుల ఎంపికకు ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించనున్నారని చెప్పారు. పాత సర్వేలన్నీ రద్దు చేశామని, కొత్త సర్వేను మొదలు పెట్టామని, దీని కింద అర్హత ఉంటే ఎన్ని లక్షల మందికైనా కేంద్రం నిధులు ఇస్తుందని తెలిపారు. అలాగే, తన శాఖ పరిధిలో బీఎ్‌సఎన్‌ఎల్‌రే దేశవ్యాప్తంగా లక్ష 4జీ టవర్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ‘మేం రాక ముందు 2 వేల టవర్లు మాత్రమే నిర్మించారు. ఈ వంద రోజుల్లో 40 వేల టవర్లు నిర్మించాం. మార్చి నాటికి లక్ష టవర్ల నిర్మాణం పూర్తి చేస్తాం. రెండేళ్లలో ఈ సంస్థ టెక్నాలజీ అభివృద్ధి పూర్తవుతుంది. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిని ఫైబర్ నెట్‌తో అనుసంధానం చేసే పని కూడా వేగంగా చేపడుతున్నాం’ అని వివరించారు.
రాష్ట్రానికి 30 ఈఎస్‌ఐ ఆస్పత్రులు..
రాష్ట్రానికి 30 ఈఎ్‌సఐ ఆస్పత్రులను కేంద్రం మంజూరు చేసిందని పెమ్మసాని తెలిపారు. అమరావతిలో రూ. 250 కోట్లతో 400 పడకల ఆస్పత్రి రాబోతోందని చెప్పారు. భూ కేటాయింపు పూర్తయిన వెంటనే వీటి నిర్మాణం మొదలవుతుందని, నిధులకు ఇబ్బంది లేదని చెప్పారు. అమరావతిలో తపాలా శాఖ రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి రూ.80 కోట్లు మంజూరయ్యాయని, భూ కేటాయింపు జరగ్గానే దీని నిర్మాణం కూడా ప్రారంభమతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్ధలకు సంబంధించి సుమారు వంద నిర్మాణాలు జరగాల్సి ఉందని, త్వరగా జరిగేలా ఆయా శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. రాష్ట్ర రాజధానిలో అనేక కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని, వాటిపైనా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నమూనాలు, పట్టణ ప్రాంత రికార్డులు, భూ రికార్డుల డిజిటైజేషన్‌కు ఈ ఆర్ధిక సంవత్సరంలోనే రాష్ట్రానికి వెయ్యి కోట్లను కేంద్రం మంజూరు చేసిందని, సంబంధిత శాఖలు పని మొదలు పెట్టాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులు ఉంటే రాష్ట్రానికి ఐదు నుంచి పది లక్షల పక్కా ఇళ్లు మంజూరయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Updated Date - Sep 29 , 2024 | 08:02 AM