ABN Andhrajyothy: ఏబీఎన్‌పై నిషేధం ఎత్తివేత.. ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజీకి మార్గం సుగుమం
ABN, Publish Date - Jun 24 , 2024 | 06:53 PM
ఐదేళ్ల వైసీపీ పాలనలో అసాధారణ రీతిలో ఆంక్షలు, ఇబ్బందులు, వివక్షకు గురైన దమ్మున్న మీడియా సంస్థ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి (ABN Andhrajyothy) ఏపీ అసెంబ్లీ సెక్రటేరియెట్ గుడ్‌న్యూస్ చెప్పింది.
అమరావతి: ఐదేళ్ల వైసీపీ (YSRCP) పాలనలో అసాధారణ రీతిలో ఆంక్షలు, ఇబ్బందులు, వివక్షకు గురైన దమ్మున్న మీడియా సంస్థ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి (ABN Andhrajyothy) ఏపీ అసెంబ్లీ సెక్రటేరియెట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయాల్లో కవరేజీకి మార్గం సుగుమం చేస్తూ గతంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై జగన్ సర్కారు విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఏపీ బ్యూరో ఇన్‌ఛార్జ్‌కు విషయాన్ని తెలియజేశారు.
శాసన సభ భవనాల్లోకి ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రతినిధుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని పీపీకే రామాచార్యులు వివరించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. కాగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో పాటు ఈటీవీ, టీవీ 5 చానళ్ల ప్రతినిధులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ శాసనసభ నూతన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తొలి సంతకం ఈ ఫైల్ మీదే చేసిన విషయం తెలిసిందే.
2019లో నిషేధం.. ఐదేళ్లు కొనసాగింపు
2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, ఈటీవీ, టీవీ5 చానళ్ల ప్రతినిధులు ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. తద్వారా ఈ చానళ్ల ప్రతినిధులు అసెంబ్లీ ప్రాంగణంలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. ఐదేళ్లపాటు ఈ నిషేధం అమలైంది. ఆ నిషేధం ఆదేశాన్ని ఉపసంహరించాలని కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ప్రత్యేకంగా లేఖ రాశారు. నిషేధం ఎత్తివేయాలని కోరారు. దీంతో తొలి సంతకం ఈ ఫైల్‌పైనే చేయాలని నిర్ణయించుకొన్న ఆయన ఈ మేరకు ఫైలు తయారు చేయాలని అసెంబ్లీ అధికారులను ఆదేశించారు. ఫైల్ తన దగ్గరికి అందగానే సంతకం చేశారు.
ఇవి కూడా చదవండి
వైసీపీ సర్కారులో జరిగిన మరో బాగోతం వెలుగులోకి
శ్వేతపత్రాల విడుదలకు ముహూర్తం ఖరారు
Updated Date - Jun 24 , 2024 | 09:14 PM