Jagan vs Sharmila: ఆస్తుల వివాదంలో మరిన్ని ట్విస్ట్‌లు.. షర్మిల అడగకుండానే..
ABN, Publish Date - Oct 31 , 2024 | 02:49 PM
ఇటీవల జగన్ తల్లి విజయలక్ష్మి రాసిన బహిరంగ లేఖలో రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆస్తుల పంపకం జరగలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. 2019లో ఆస్తుల్లో వాటాల పంపకం ప్రతిపాదనను జగన్ తీసుకొచ్చారనే విషయాన్ని విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్..
వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆమె సోదరి షర్మిల మధ్య ఆస్తుల వివాదం నడుస్తున్న వేళ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఆస్తుల పంపకం ప్రతిపాదనను ఎవరు తెరపైకి తెచ్చారనే అంశంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే జగన్, షర్మిల పేరిట ఆస్తుల విభజన చేశారని కొందరు చెబుతుండగా.. ఇటీవల జగన్ తల్లి విజయలక్ష్మి రాసిన బహిరంగ లేఖలో రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆస్తుల పంపకం జరగలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. 2019లో ఆస్తుల్లో వాటాల పంపకం ప్రతిపాదనను జగన్ తీసుకొచ్చారనే విషయాన్ని విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఆస్తిలో వాటా కావాలని ఎప్పుడూ అడగలేదన్నారు. ఆస్తి పంపకాల కోసం షర్మిల ఎలాంటి ఆసక్తి చూపలేదని, జగన్ ప్రతిపాదనతోనే ఆస్తుల విభజన జరిగిందనే విషయాన్ని బయటపెట్టారు. 2019 ఎన్నికల తర్వాత జగన్ వైఖరిలో పూర్తిగా మార్పు కనిపించిందని బ్రదర్ అనిల్ చెప్పారు. షర్మిల ఆస్తిలో వాటా అడగలేదని, అదే సమయంలో తెలంగాణలో పార్టీని విస్తరించాలనే ప్రతిపాదనను జగన్ వ్యతిరేకించారని తెలిపారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని జగన్ వ్యతిరేకించారని, తమకు వ్యతిరేకంగా పనిచేశారని బ్రదర్ అనిల్ చెప్పారు. ఓ పత్రికా సంస్థలో షర్మిల భాగస్వామిగామ ఉన్నప్పటికీ కనీసం డబ్బులిచ్చి ప్రకటనలు ఇవ్వడానికి ఒప్పుకోలేదన్నారు. స్వయంగా విజయలక్ష్మి మాట్లాడినా తమకు ప్రకటనలు ఇచ్చేందుకు అవకాశం కల్పించలేదన్నారు. వైఎస్ విజయలక్ష్మి బహిరంగ లేఖలో ప్రస్తావించిన అంశాలతో పాటు, బ్రదర్ అనిల్ వ్యాఖ్యలు చూస్తుంటే ఎన్నికల తర్వాత జగన్ తన కుటుంబ సభ్యుల ప్రమేయం పార్టీలో ఉండకూడదనే నిర్ణయంతోనే ఆస్తుల ప్రతిపాదనను తీసుకురావడంతో పాటు షర్మిల, విజయలక్ష్మికి దూరంగా ఉంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయట.
మొదట వివేకా ఎపిసోడ్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక జగన్ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. తన బాబాయి వివేకానందరెడ్డితో తనకు భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయనే ఆలోచనతో పాటు కడప ఎంపీ టికెట్ వ్యవహారంలోనే వివేకానందరెడ్డిని హతమార్చారనే ప్రచారం జోరుగా సాగింది. కడప ఎంపీ అభ్యర్థిగా వివేకానందరెడ్డి షర్మిలను ప్రతిపాదించారనే చర్చ జరిగింది. షర్మిల రాజకీయంగా ఎదిగితే తనకు పోటీగా ఉంటారని, భవిష్యత్తులో సీఎం పదవికి షర్మిల పోటీదారుగా ఉంటారనే ఉద్దేశంతోనే షర్మిలకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో వివేకానందరెడ్డి ఉంటే పార్టీపై తన ప్రభావం పడుతుందని, షర్మిలకు ఆయన అండగా ఉంటారనే ఉద్దేశంతోనే హత్యకు ప్లాన్ చేశారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ చేస్తోంది. దోషులెవరనేది కోర్టులు నిర్దారించాల్సి ఉంది.
ఆస్తుల పంపకం వెనుక అసలు ఉద్దేశం అదేనా..
ఆస్తులు ఉమ్మడిగా ఉంటే షర్మిలకు హక్కు ఉంటుందని, అదే ఆస్తుల పంపకం పూర్తిచేస్తే షర్మిలను దూరం పెట్టవచ్చనే ఉద్దేశంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చేందుకు ఎంవోయూ చేసుకున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. వైసీపీలో షర్మిల ఇన్వాల్ అయితే తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే జగన్ ఆస్తుల పంపకానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. తీరా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. తన సోదరికి ఇచ్చిన వాటాను వెనక్కి తీసుకోవడం ద్వారా ఆర్థికంగా షర్మిలను దెబ్బతీయాలని జగన్ కుట్ర చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి జగన్, షర్మిల ఆస్తుల వివాదంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Oct 31 , 2024 | 02:49 PM