Strict Traffic Law Enforcement : ‘చలాన్’గఢ్!
ABN, Publish Date - Dec 13 , 2024 | 05:29 AM
హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మన రాష్ట్రంలో మూడు నెలల్లో 667 మంది చనిపోయారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ, హెల్మెట్ లేనివారిపై కఠిన చర్యలు అవసరమని నొక్కిచెప్పింది.
చండీగఢ్ నుంచి చాలా నేర్వాలి!
ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా
అక్కడ నూరు శాతం హెల్మెట్ ధారణ
గీత దాటితే చలాన్‌లు తథ్యం
ఏపీలో ఏదీ ట్రాఫిక్ సెన్స్!?
హైకోర్టు చెప్పినా పట్టింపే లేదు
సీన్1
విజయవాడలో బెంజ్ సర్కిల్. ఉదయం విపరీతంగా ట్రాఫిక్ ఉన్న సమయం. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా.. పని చేయడంలేదు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నారుకానీ... వాళ్లను వాహనదారులు పట్టించుకోవడంలేదు. బైక్‌లపై ముగ్గురు, కుదిరితే నలుగురు... ట్రాఫిక్ కానిస్టేబుల్ ముందే ‘హాయ్’అంటూ వెళ్లిపోతున్నారు. హెల్మెట్, సీట్‌బెల్టుల సంగతి మరిచిపోండి!
సీన్2
కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌లో ఒక ఉదయం. మంచి రద్దీ సమయం. ట్రాఫిక్ బాగానే ఉంది. వాహనాలు నిర్ణీత వేగంతో దూసుకెళ్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ ఆరెంజ్‌లోకి మారగానే వాహనాలు నెమ్మదించాయి. రెడ్ పడగానే వాహనాలు స్టాప్ లైన్‌కు ఐదారు అడుగుల వెనకే ఆగిపోయాయి. తలపాగాలు పెట్టుకున్న సర్దార్జీలు మినహా... ప్రతి ఒక్కరి తలపైనా హెల్మెట్లు! కారులో డ్రైవర్‌తోపాటు పక్కనున్న ప్రయాణికులకూ సీట్ బెల్టులు! ఆ జంక్షన్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా లేడు. అయినా... ట్రాఫిక్ ఉల్లంఘనలు లేవు!
ఈ రెండు దృశ్యాల నడుమ ఎంత తేడా?
మన దగ్గర ఇంత అడ్డగోలుతనానికి కారణమేమిటి?
అక్కడ అంత పద్ధతిగా ఉండడం ఎలా సాధ్యమైంది?
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మన రాష్ట్రంలో మూడు నెలల్లో 667 మంది చనిపోయారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ, హెల్మెట్ లేనివారిపై కఠిన చర్యలు అవసరమని నొక్కిచెప్పింది. విదేశాలకు వెళ్లినప్పుడు మన దేశంలో రోడ్డు ప్రమాదాల అంశం ప్రస్తావనకు వస్తే తల దించుకోవాల్సి వస్తోందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పార్లమెంటు సాక్షిగా ఆవేదన వ్యక్తంచేశారు. రెడ్ సిగ్నల్ పడితే ఆగరు.. హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోరు.. అందుకే ఇన్ని మరణాలు అంటూ ఆక్రోశించారు.
హైకోర్టు ఆగ్రహించినా, కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తంచేసినా.. ప్రజల్లో మార్పు వస్తేనే రోడ్డు ప్రమాదాలకు చెక్ చెప్పడం సాధ్యమవుతుంది. కొన్ని విషయాల్లో ఆ మార్పు మంచి మాటలతో వస్తే, మరికొన్ని విషయాల్లో కఠినాతి కఠినంగా నిబంధనల అమలు ద్వారానే సాధ్యం. ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), విజయవాడ విభాగం ఇటీవల తెలుగు పాత్రికేయుల బృందాన్ని పంజాబ్ పర్యటనకు తీసుకెళ్లింది. ఈ సందర్భంగా చండీగఢ్‌లో కనిపించిన దృశ్యాలు నిబంధనల అమలు, ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో కఠినంగా ఉండాల్సిన ఆవశ్యకతను కళ్లకు కట్టాయి. వాస్తవానికి చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం. ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరం.జనాభా సుమారు 13 లక్షలు. కాస్త అటూఇటుగా బెజవాడ జనాభా కూడా ఇంతే. కాకపోతే విశాలమైన రోడ్లు, వాటి పక్కన సర్వీసు రోడ్లు ఇలా మొదటి నుంచే అక్కడ అంతా ప్రణాళికాబద్ధంగా జరిగిందన్నది వాస్తవం. అయినా అక్కడ ఉండేదీ ప్రజలే కదా. దాంతో అక్కడా ట్రాఫిక్ ఉల్లంఘనలు సహజమే...అనుకుంటే పొరబడినట్లే! మన రాష్ట్రంలో నిబంధనల అమలు కఠినంగా జరగడం లేదు. అక్కడ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇదీ అక్కడికీ ఇక్కడికీ తేడా! గత ఏడాది చండీగఢ్‌లో విధించిన ట్రాఫిక్ చలాన్ల సంఖ్య దాదాపు 8 ల క్షలు. అందుకే... ‘గీత’కు అవతలే వాహనదారులు ఆగిపోతారు. నిబంధనలను నిక్కచ్చిగా పాటిస్తారు. ఏ చిన్న ఉల్లంఘననూ సహించని చండీగఢ్‌ను ‘చలానాగఢ్’ అని కూడా అంటారు.
మార్పు తెచ్చారు!
చాలీ చాలని ఆదాయంతో బతుకీడ్చే మధ్య తరగతిపై చలాన్ల విధింపు భారమన్న వాదన ఉంది. మరి... ప్రాణాల సంగతేమిటి? పోతే రావు కదా! చండీగఢ్‌లో కఠినంగా అమలు చేస్తున్న చలానారాజ్ వల్ల ఇప్పుడు ఆ నగర రోడ్లపై హెల్మెట్ లేని వారే కనిపించడంలేదంటే అతిశయోక్తి కాదు. సిటీ టూర్ కోసం ఏర్పాటు చేసిన బస్సులో డ్రైవర్ పక్క సీటులో కూర్చోగానే, ‘సీట్ బెల్ట్ పెట్టుకోండి సాబ్’ అని ఆ డ్రైవర్ కరాఖండీగా చెబుతారు. ఇదీ... అక్కడి ‘రూల్’! 114 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న చండీగఢ్‌లో రోడ్డు ప్రమాద మరణాలను ఏడాదికి వంద లోపునకు పరిమితం చేయగలగడం ‘చలాన్’లు సాధించిన విజయమే!
ప్రజలూ చెప్పొచ్చు!
పోలీసులే కాదు... సామాన్య పౌరులూ చండీగఢ్‌లో ‘ట్రాఫిక్’ డ్యూటీ చేస్తారు. ఎవరైనా ఉల్లంఘనులు కనిపిస్తే వెంటనేపౌరులే
ఫొటో తీసి పంపేందుకు ఒక ప్రత్యేక వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. తప్పు చేసిన వాళ్లకు జరిమానా... సమాచారం ఇచ్చిన వారికి నజరానా!
చండీగఢ్ ప్రధాన వీధుల్లో సైకిళ్ల కోసం ప్రత్యేకంగా చిన్న రోడ్డు కూడా పక్కన ఏర్పాటు చేయడం మరో విశేషం. ఆ రోడ్డు ఖాళీగా ఉన్నా ఏ బైకూ దానిలోకి వెళ్లడానికి వీల్లేదు. వెళితే ఏం జరుగుతుందో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది కదా! మరో చలాన్ ఖాయం! రాజధాని ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లోనూ హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం వంటివి పకడ్బందీగా అమలవుతున్నాయి. మనమూ మారాల్సిన అవసరాన్ని అవి చెబుతున్నాయి.
గీత దాటితే అంతే!
ట్రాఫిక్ నిబంధనల అమలుకు చండీగఢ్ ట్రాఫిక్ పోలీసు విభాగం అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. అన్ని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏ వాహనదారు స్టాప్ లైన్ దాటినా, హెల్మెట్ లేకుండా రోడ్డెక్కినా, రాంగ్ రూట్‌లో వెళ్లినా కెమెరా క్లిక్ మనడం, ఈ-చలాన్ జారీ అవడం క్షణాల్లో జరిగిపోతుంది. కూడళ్లలో సీసీ కెమెరాలే కాదు.. హైస్పీడ్ బాబుల కట్టడికి స్పీడ్ రాడార్లు, ట్రాఫిక్ కానిస్టేబుళ్ల చేతిలో హ్యాండీక్యామ్స్, వారి టోపీలపై అమర్చిన కెమెరాలు అన్నీ పకడ్బందీగా సమకూర్చారు. చలానాలు విధించినా చాలా మంది చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. అలాంటి వారి ఇళ్లకు కరెంటు, నీటి సరఫరా ఆపేయాలని సూచించింది. చండీగఢ్‌లోనైతే చలానాలు కట్టని వాళ్లపై కోర్టు ద్వారానే చర్యలు తీసుకుంటారు.
కఠోర వాస్తవాలు
ఈ ఏడాది ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 1.68 లక్షలు.
హెల్మెట్ ధరించకపోడం వల్ల దేశవ్యాప్తంగా ఏడాదికి చనిపోతున్న వారి సంఖ్య 30 వేలపైనే.
హెల్మెట్ ధరించక రాష్ట్రంలో 3 నెలల్లో మరణించిన వారి సంఖ్య 667.
రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ట్రాఫిక్ పోలీసుల సంఖ్య 8,770. ఉన్నది 1,994 మందే.
చండీగఢ్ నగరంలో గత ఏడాది జారీ చేసిన ట్రాఫిక్ చలాన్ల సంఖ్య దాదాపు 8 లక్షలు.
ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేసిన చలాన్లు 5.62 లక్షలు.
Updated Date - Dec 13 , 2024 | 05:29 AM