Chandrababu: ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా జెండా ఎగురవేసిన చంద్రబాబు
ABN, Publish Date - Aug 15 , 2024 | 09:14 AM
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 2024 ఎన్నికల్లో గెలుపు తర్వాత తొలిసారిగా చంద్రబాబు జెండాను ఆవిష్కరించారు.
అమరావతి: 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 2024 ఎన్నికల్లో గెలుపు తర్వాత తొలిసారిగా చంద్రబాబు జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు ట్విటర్ వేదికగా.. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రమని ఆయన పేర్కొన్నారు.
వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఏకతాటిపై నడిచే అద్భుత దేశం మనదన్నారు. ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో సాగుతున్న మన దేశం, ప్రపంచానికే ఆదర్శమన్నారు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుంటూ, తాడితపీడిత ప్రజలకు అండగా నిలుస్తూ, బలహీనులకు ధైర్యాన్నిస్తూ ముందుకు సాగాలనేది పెద్దలు మనకు నేర్పిన పాఠమని చంద్రబాబు అన్నారు.అందుకు అనుగుణంగానే మనం అడుగులు వేస్తున్నామన్నారు. అభివృద్ధి ఫలాలను అందరికి అందించే బృహత్ బాధ్యతతో ముందుకు సాగుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఈ స్వాతంత్య్ర దినోత్సవం జనజీవితాలకు కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
చిత్తూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను సత్యకుమార్ ప్రారంభించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జడ్జి ఇతర అధికారులు పాల్గొన్నారు
శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. జాతీయ జెండాను అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ మంత్రి ప్రసంగించారు. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. జాతీయ పతాకాన్ని మంత్రి కొలుసు పార్థసారధి ఆవిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. 300 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులతో కలిసి ర్యాలీలో రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు.
Updated Date - Aug 15 , 2024 | 09:52 AM