CM Chandrababu: ఇద్దరు పిల్లలు ఉండాల్సిందే.. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు.. చంద్రబాబు కీలక నిర్ణయం
ABN, Publish Date - Nov 11 , 2024 | 09:13 PM
జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలో ఏ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలో ఏ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు లోకేష్, సూర్యకుమార్, కొల్లు రవీంద్ర ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులుగా ఎంపికైన 164 మందిని ముఖ్యమంత్రి.. ప్రభుత్వం తరపున రూ. 20 వేల నగదు, షీల్డ్స్‌తో శాలువాతో సత్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపకులుగా ఎంపిక కావడంపై అవార్డు గ్రహీతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గురువుల గొప్పదనంపై ప్రసంగించారు. తల్లిదండ్రుల తరువాత జీవితాంతం గుర్తుండిపోయేది గురువేనని వ్యాఖ్యానించారు (Andhrapradesh).
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ ఇక్కడ అందరి ఉపన్యాసాలు విన్నాను, వారి ఆలోచనలు తెలుసుకున్నాను. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువులది. తల్లిదండ్రులు తరువాత గురువు ఎప్పటికీ గుర్తు ఉంటారు. నాకు విద్య నేర్పిన గురువులు ఇప్పటికీ నాకు గుర్తే. మౌలానా అబుల్ కలాం ముందు చూపు వల్లే నేటి యువత ఐఐటీలో రాణిస్తున్నారు. 1953లో యూజీసీ తీసుకువచ్చి విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా ఎదిగారు. ఈ రెండూ కలిసిన రోజు ఈ రోజు మీ విద్యాశాఖ మంత్రి మోడల్‌గా ఈ సభ పెట్టారు. ఒక మంచి టీచర్ ఎప్పటికి మంచి టీచరే.. అది మన ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ కార్యక్రమం సెప్టెంబరు ఐదున జరగాల్సి ఉండగా వరదలు వచ్చాయి. వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తెచ్చేలా అందరినీ పరుగులు పెట్టించాం. పది రోజుల్లో ప్రజలు పూర్తిగా వరదల నుంచి బయట పడ్డారు. మన పని తీరు దేశం మొత్తం చూసింది. 500 కోట్లు సీఎం.రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ వంతు విరాళం ఇచ్చారుక. ఒక మంచి పనికి మంచి స్పందన ఉంటుంది అనేదానికి వరదల ఘటనే ఉదాహరణ’’
Also Read: ఏపీకి భారీగా పెట్టుబడులు.. యూత్‌కు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
‘‘1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. 1995లో ఇంటర్నెట్ విప్లవం ప్రారంభమైంది. నేను సీఎంగా అప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలని భావించా. ప్రపంచం మొత్తం తిరిగి ఐటీ కంపెనీలు తెచ్చాం. 25 ఇంజనీరింగ్ కాలేజీలను తొమ్మిది యేళ్లల్లో 300 ఇంజనీరింగ్ కాలేజ్‌లుగా చేశాం. ఇక్కడ చదువుకున్న వారు విదేశాలకు వెళ్లి లక్షల జీతం తెచ్చారు. ఇంగ్లీషు ఉంటేనే భవిష్యత్తు అనే కొత్త థియరీ ఇప్పుడు తెచ్చారు. కానీ మన మాతృ భాషకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఉద్యోగం కోసం ఇంగ్లీషు నేర్చుకోవాలి. అప్పుడే అన్ని విధాలా రాణించే అవకాశం ఉంటుంది. 2047 కి భారతదేశం ప్రపంచంలో ఒకటి లేదా రెండో స్థానంలో ఉంటుంది. ఏ దేశం వెళ్లినా మనవాళ్లు నెంబర్ వన్‌గా ఉంటారు. దేశంలో మోదీ, ఏపీలో నేను అమలు చేసే సంస్కరణవల్లే ఈ ఫలితాలు చూస్తారు’’
‘‘టెక్నాలజీ వల్ల కొత్త టెన్షన్‌లు వస్తున్నాయి. కనీసం కుటుంబ సభ్యులుతో కూడా గడపలేక గొడవలు వస్తున్నాయి. ఒకప్పుడు వీటి గురించే నేను కూడా పదే పదే చెప్పాను. కుటుంబ నియంత్రణ విషయంలో కూడా ప్రజలకు అవగాహన కల్పించాం. ఇద్దరు బిడ్డలు దాటి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ అనర్హమని చెప్పాం. దక్షిణ రాష్ట్రాల్లో మన జనాభా సంఖ్య తగ్గిపోతోంది. అందుకే ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అనర్హత అనే నిబంధన పెడుతున్నాం. ఇలాంటి నిర్ణయాలు చేయకపోతే మనం వెనుకబడుతాం. యూపీ, బీహార్‌తో పోలిస్తే మన దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలు తగ్గిపోతున్నారు. ఐటీ రంగంలో భార్యాభర్తలు ఉద్యోగులు అయితే... పిల్లలును కనడంపై దృష్టి పెట్టడం లేదు. ఈ విషయంలో ఇప్పుడు నేను కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చా. ఉపాధ్యాయులు ఇటువంటి అంశాలను పిల్లల తల్లిదండ్రులుకు వివరించాలి. సమాజంలో పిల్లలు కనే విషయంలో పాజిటివ్‌గా ఉండేలా అవగాహన కల్పించాలి. మన జనాభాను పెంచుకోవడం ద్వారా 2047లో మన వాళ్లే అన్నిచోట్లా రాణించే వీలు ఉంటుంది. నిశ్శబ్దం మానండి... పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అందరూ మాట్లాడండి’’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Read: విజయవాడలో వైసీపీకి గట్టి షాక్
జాతీయ విద్యా దినోత్సవ సభలో మంత్రి నారా లోకేష్ కూడా ప్రసంగించారు. విద్యారంగానికి చెందిన మహామహులు అబుల్ కలాం ఆజాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే గురువులపై ప్రశంసల వర్షం కురిపించారు.
‘‘తల రాతలు రాసేది బ్రహ్మ అయితే... తల రాత మార్చేది గురువులు. విద్యా వ్యవస్థలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎన్నో సంస్కరణలు తెచ్చారు. వరదల వల్ల ఈ కార్యక్రమం నిర్ణీత సమయంలో నిర్వహించలేకపోయాం. వరద సహాయక చర్యల సమయంలో మాస్టర్ లాగా మా మంత్రులకు సీఎం గారు క్లాస్ తీసుకుని నడిపించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటేనే ఉపాధ్యాయులు గుర్తు వస్తారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టింది. మా ప్రభుత్వం ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇస్తోంది. ఈ శాఖ నీకు అవసరమా వద్దు అని నాకు చాలా మంది చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు మార్పులు చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తాను. త్వరలో మన విద్యా విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. విలువలుతో కూడిన విద్య చాలా అవసరం. ప్రపంచ వ్యాప్తంగా మన వాళ్లు రాణించేలా మంచి విద్య అందిస్తాము. సమాజానికి ఉత్తమ పౌరులు అందించే బాధ్యత ఉపాధ్యాయులుదే. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం’’
Read: ఆర్కే రోజాకు మంత్రి సవిత చురకలు
‘‘గత ప్రభుత్వంలో ఫొటోలు, రంగుల పిచ్చి మనం చూశాం. రాజకీయాలకు అతీతంగా మన విద్యా విధానం ఉండాలి. ఎక్కడా నా ఫొటో, సీఎం ఫొటో పుస్తకంలో ఉండదు. పథకాలకు ఎందరో మహనీయులు పేర్లు పెట్టాం. యాప్‌ల భారం తగ్గచేలా మా ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో చదువు కన్నా యాప్‌ల పనే ఉపాధ్యాయులుకు ఎక్కువ. ఇక నుంచి చిన్న లోపాలు ఉన్నా సరి దిద్దుకుంటాం. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం నాశనం చేసింది. రాత్రి ఆత్మలతో మాట్లాడి.. ఉదయం అనాలోచితంగా నిర్ణయం చేసేవారు. 117 జివో తెచ్చింది కూడా వారు ఇలాంటి కలలు కనడం వల్లే. సంస్కరణల పేరుతో స్కూల్‌లు మూసి, ఉపాధ్యాయులు లేకుండా చేశారు. ఈ కూటమి ప్రభుత్వం అందరితో చర్చించి మంచి స్కీంలు తెస్తుంది. వారానికి ఒక రోజు మీ సమస్యలు మా దృష్టికి తీసుకురండి. గత ప్రభుత్వంలో పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ. 6500 కోట్ల భారం నా మీద వదిలి వెళ్లారు. 4 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి వెళ్లిపోయారు. పేరెంట్స్, టీచర్ సమావేశాలు ఏర్పాటు చేసి విద్యా విధానంపై అవగాహన పెంచాలి’’
‘‘త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నాం. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా బెంచ్‌లు లేవు. వచ్చే మూడేళ్లల్లో ప్రతి స్కూల్లో అన్ని వసతులు ఉండేలా చూస్తాం. కంప్యూటర్ ల్యాబ్‌ల ద్వారా ఇతర అంశాల్లో రాణించేలా ప్రోత్సహిస్తాం. మీ పిల్లలను జాబ్ క్రియేటర్స్ తీర్చి దిద్దాలని భావిస్తున్నాం. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న వారందరికి నా అభినందనలు. మీరంతా మీ అనుభవాలను పిల్లలకు, మీ తోటి ఉపాధ్యాయులు వివరించండి. గత ప్రభుత్వం వల్ల ఉపాధ్యాయులు కొంతమంది గాడి తప్పారు. ఇది మీ ప్రభుత్వం... మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కలిసి పని చేద్దాం. రెండేళ్లు కష్టపడితే మన విద్యా వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉంటుంది. చిన్నవయసులో రెండు సార్లు నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం గారికి కృతజ్ఞతలు. రెండేళ్లల్లో ఏపీని టాప్ త్రీలో ఉండేలా, ప్రపంచంలోలో టాప్ వందలో ఉండేలా కృషి చేస్తానని మాట ఇస్తున్నా సర్’’ అని లోకేష్ తన ప్రసంగం ముగించారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Nov 11 , 2024 | 09:52 PM