దేశానికి తీరనిలోటు రతన్ టాటా మృతి పై చంద్రబాబు
ABN, Publish Date - Oct 11 , 2024 | 04:55 AM
ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ రతన్ టాటా ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర మంత్రిమండలి సంతాపం తెలిపింది. గురువారం అమరావతి సచివాలయంలో కేబినెట్ భేటీకి ముందు రతన్ చిత్రపటానికి సీఎం చంద్రబాబు, మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బాధాకరం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పారిశ్రామిక దిగ్గజానికి మంత్రి మండలి నివాళి
కేబినెట్ చర్చల అజెండా వాయిదా... ముంబయి వెళ్లిన బాబు, లోకేశ్
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ రతన్ టాటా ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర మంత్రిమండలి సంతాపం తెలిపింది. గురువారం అమరావతి సచివాలయంలో కేబినెట్ భేటీకి ముందు రతన్ చిత్రపటానికి సీఎం చంద్రబాబు, మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమై రతన్ టాటాకు ఘనంగా నివాళులర్పించింది. ఆయన మృతికి సంతాపంగా సీఎం చంద్రబాబు, మంత్రులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
అనంతరం ఇతర అంశాలను చర్చించకుండా సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు. ‘విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్‌ను సృష్టించారు. సంపదను సృష్టించడమే కాదు... ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా ఆయన ఎంతో కృషి చేశారు. రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికి, దేశానికీ తీరని లోటు’ అని సీఎం అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం రతన్ టాటా భౌతిక కాయానికి నివాళులర్పించడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముంబై బయలుదేరి వెళ్లారు.
అనారోగ్య కారణంగా కేబినెట్‌కు హాజరుకాని డిప్యూటీ సీఎం
అనారోగ్య కారణంగా గురువారం జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరుకాని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు. ‘భారత పారిశ్రామిక రంగానికి దీప శిఖల్లాంటి సంస్థల్లో టాటా గ్రూపు ఒకటి. యువతలో ప్రతిభను ఎంతో ప్రోత్సహించారు. స్టార్ట్‌ప్ సంస్థలకు అండగా నిలిచారు. కొవిడ్ విపత్కర సమయంలో రూ.1,500 కోట్లు విరాళం ప్రకటించి తనలోని దానగుణాన్ని చాటారు. రతన్ టాటా నవతరం పారిశ్రామికవేత్తలకు ఆదర్శప్రాయులుగా నిలిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ పవన్ నివాళులర్పించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ, ‘కోట్ల మంది ప్రజల హృదయాల్లో రతన్ టాటా జీవించే ఉంటారు.
కార్పొరేట్ రంగంలో వృద్ధి చెందుతూనే సామాన్యుల సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ఆకాంక్షించిన మహోన్నత మానవతావాది’ అని కొనియాడారు. మంత్రి పయ్యావుల కేశవ్ నివాళులర్పిస్తూ... ‘లక్షలాది మందికి ఉపాధి కల్పించిన టాటా గ్రూప్‌ను నాణ్యతకు నమూనాగా ఎస్టాబ్లిష్ చేశారు’ అని కొనియాడారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటన చేస్తూ... గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, దేశానికి తీరని లోటని అన్నారు. కాగా, ‘ప్రపంచ పారిశ్రామిక ధీరుడు, విలువలే ఆస్తిగా ఎదిగిన మానవతావాది రతన్‌టాటా’ అని ఎమ్మెల్సీ అశోక్‌బాబు, తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మీడియా కోఆర్డినేటర్ డి.నరేంద్రబాబు అన్నారు.
పరిశ్రమల శాఖ అధికారుల నివాళులు
రతన్ టాటా మృతి పట్ల రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు సంతాపం ప్రకటించారు. గురువారం ఉదయం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్‌లోని ఆ శాఖ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
టాటా సేవలు చిరస్మరణీయం: ఏపీ చాంబర్స్
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్) ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. సమాఖ్య అఽధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు, ఇతర ఆఫీసు బేరర్లు గురువారం విజయవాడలోని చాంబర్స్ కార్యాలయంలో రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తైలవర్ణ చిత్రంతో టాటాకు నివాళులు
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 10: దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా మృతి పట్ల తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, స్ర్టోకర్వ్ అధినేత హరి తాడోజు నివాళులర్పించారు. ‘భరతమాత గుండెల్లో రతన్ టాటా ఎప్పుడూ చిరంజీవే’ అని చెబుతూ తైలవర్ణ చిత్రాన్ని గీసి శ్రద్ధాంజలి ఘటించారు.
Updated Date - Oct 11 , 2024 | 04:56 AM