Chandrababu : రాజధానికి పునఃప్రతిష్ఠ
ABN, Publish Date - Oct 20 , 2024 | 03:09 AM
రాజధానికి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నామని, మరో మూడేళ్లలో అమరావతిని సుందరవనంగా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
అమరావతికి ఇక మంచి రోజులు.. మూడేళ్లలో తీర్చిదిద్దుతాం
జెట్ స్పీడ్‌లో నిర్మాణ పనులు పూర్తి చేస్తాం
రాక్షసుల నుంచి అమరావతిని రైతులే కాపాడారు
మహిళలు రుద్రమ దేవిలా పోరాడారు
జోలిపట్టి వారి పోరాటానికి మద్దతు తెలిపాను
భూతం పోయి రాష్ట్రానికి మంచి రోజులొచ్చాయి
విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం
రెండు వారాల్లో పోలవరం పనులు ప్రారంభం
రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
రాష్ట్రం కోసం రైతులు భూములిచ్చి త్యాగం చేస్తే.. గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. ఎంత మంది రాక్షసులు వచ్చినా అమరావతిని కాపాడిన చరిత్ర రైతులదే. రాణీ రుద్రమదేవిలా రాజధాని ప్రాంత మహిళలు పోరాడారు. నేను కూడా వారి కోసం జోలిపట్టి పోరాటానికి మద్దతు పలికాను.
- సీఎం చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాజధానికి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నామని, మరో మూడేళ్లలో అమరావతిని సుందరవనంగా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో నిర్మాణ పనులు జెట్‌స్పీడ్‌లో జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ హయాంలో అమరావతిలో అటకెక్కిన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శనివారం లాంఛనంగా పునఃప్రారంభించారు. రాయపూడిలోని సీఆర్‌డీఏ కార్యాలయ భవనం వద్ద పూజలు చేశారు. ఏడు అంతస్తులతో... రూ.160 కోట్లతో నిర్మిస్తున్న ఈ భవనాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తానిచ్చిన పిలుపుతో వారసత్వంగా వచ్చిన భూములను కూడా భవిష్యత్తు తరాల కోసం ఇచ్చిన రైతులకు మరోసారి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. 34,241 ఎకరాలను 29,881 మంది రైతులు రాజధాని నిర్మాణానికి ఇచ్చారని, ఇంత పెద్ద మొత్తంలో ల్యాండ్ పూలింగ్ చేసి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచిన ఘనత మనదేనన్నారు.
అమరావతి రైతులను గత ప్రభుత్వం అడుగడుగునా అణగదొక్కిందని, న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం చేపడితే ఎక్కడా అన్నం కూడా తిననివ్వకపోవడంతో రోడ్డుమీదే వారు భోజనం చేశారన్నారు. నాడు సాక్షాత్తు ప్రధాని అమరావతికి శంకుస్థాపన చేశారని, అన్నీ దేవాలయాల నుంచి పవిత్ర జలాలు, మట్టి తెచ్చి ఇక్కడ ఉంచి పునీతం చేశామన్నారు. ఈ పవిత్రమైన భూమికున్న శక్తే అమరావతిని కాపాడిందన్నారు. రాళ్లు, రప్పలున్న ప్రాంతంలో మూడో నగరంగా సైబరాబాద్‌ను నిర్మించామని, హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దామన్నారు.
ఎవరూ ఊహించని రోజుల్లోనే 8 లేన్ల ఔటర్ రింగ్‌రోడ్డును నిర్మించామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే అప్పులు తప్ప ఏమీ కనిపించలేదని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులకు కౌలు కూడా పెండింగ్‌లో పెట్టారని, మనం అధికారంలోకి రాగానే రూ. 170 కోట్లు ఇచ్చామని, మరో రూ. 225 కోట్లు త్వరలో ఇస్తామని తెలిపారు. భూమిలేని కూలీలకు అప్పట్లో పెన్షన్ ఇస్తే దానిని వైసీపీ సర్కార్ నిలిపేసిందని, వాళ్లకు తిరిగి పెన్షన్ అందిస్తామన్నారు.
అమరావతి మళ్లీ తలెత్తి నిలబడింది
అమరావతి మళ్లీ తలెత్తి నిలబడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి రాజధాని పనులను ప్రారంభించిన సందర్భంగా శనివారం ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘విధిరాత ఏంటో ప్రస్ఫుటమైంది. ఐదు సంవత్సరాల ఎనలేని నిర్లక్ష్యం, ఆశల అణిచివేత తర్వాత అమరావతి మళ్లీ ప్రాణం పోసుకొంది. మన ప్రజారాజధాని అమరావతి.. హృదయాలను కలిపి ఒక్కో ఇటుక పేర్చి పునఃనిర్మితమవుతుంది. అమరావతి స్వప్నాన్ని సజీవంగా నిలిపిన రాష్ట్ర ప్రజానీకానికి నా శుభాకాంక్షలు.
ప్రత్యేకించి రాజధాని రైతు సోదరులు, సోదరీమణులు తమపై భయంకరమైన అణిచివేతను ప్రయోగించినా తట్టుకొని నిలబడి పోరాడి మన కలలను నిలబెట్టారు. ఈ రోజు మొదలైన పని ఇక ఆగదు. ముందుకు మునుముందుకు సాగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. అమరావతిపై వైసీపీ కుతంత్రాలు సాగవని, అమరావతి మళ్లీ ఊపిరి పోసుకోవడం ఖాయమని 2022 సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండో తేదీన తాను చేసిన ట్వీట్‌ను చంద్రబాబు దీనికి జత చేశారు.
వైసీపీ తప్పుడు ప్రచారం..
రాజధాని నిర్మాణానికి రూ. లక్ష కోట్లు అవుతాయని, తమవద్ద డబ్బు లేదంటూ గత పాలకులు ఐదేళ్లపాటు కాలయాపన చేశారంటూ చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సిటీ అని, ప్రభుత్వ డబ్బు అవసరం లేకుండా అమరావతిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొత్త రాజధానికి అమరావతి పేరు బాగుంటుందని ఆనాడు రామోజీరావు చెబితే, దానినే ఆమోదించామన్నారు. అలాంటి అమరావతిని శ్మశానం, ఎడారి, మునిగిపోతుందంటూ వైసీపీ నేతలు ప్రచారం చేశారన్నారు. గత పాలకులు రోడ్లు కూడా తవ్వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బెంగుళూరులో జగన్ ఇల్లు ఉన్న ప్రాంతం మునిగిపోయిందని..
వేరే వాళ్లు చెడిపోవాలని కోరుకుంటే భగవంతుడు క్షమించడన్నారు. 1,631 రోజుల పాటు రాజధానిని కాపాడుకోవడం కోసం రైతులు ఉద్యమం చేశారన్నారు. విధ్వంసం పోయి.. నిర్మాణం ప్రారంభమైందన్నారు. విధ్వంసం శాశ్వతం కాదు.. మన మంచి పనులే శాశ్వతమన్నారు. గత పాలకుల విధ్వంసంతో నిలిచిపోయిన పనుల వల్ల రూ. 7 వేల కోట్లు అదనంగా భారం పడుతుందన్నారు. రూ. 52 వేల కోట్లతో పనులు ప్రారంభిస్తామన్నారు. కేంద్రం రూ. 15 వేల కోట్లు అందించేందుకు ముందుకొచ్చిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆలిండియా అధికారులు, న్యాయమూర్తుల కోసం రెసిడెన్షియల్ టవర్స్ పూర్తి చేస్తామన్నారు. అనుకున్న సమయానికి నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామన్నారు.
2 వారాల్లో పోలవరం పనులు
తనకు ఎలాంటి స్వార్థం లేదని, దేశంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉండాలన్నదే తన కల అని, ఇది ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. పోలవరం 72 శాతం పూర్తి చేస్తే.. వైసీపీ వాళ్లు డయాఫ్రంవాల్ దెబ్బతీశారన్నారు. మరో రెండు వారాల్లో పోలవరం పనులు పునఃప్రారంభమవుతాయని తెలిపారు. వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తాన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు 2047 విజన్ డాక్యుమెంట్ తయారుచేస్తున్నామని తెలిపారు. 2000 సంవత్సరానికి ముందు విజన్ 2020 అంటే ఎగతాళి చేసి 420 అన్నారని, కానీ విమర్శించిన వాళ్లే 420లు అయ్యారన్నారు. తన విజన్ ఎంటో 420లకు అర్థం కాలేదన్నారు. ప్రపంచంలోనే తెలుగువారు అగ్రగామిగా ఉండాలన్నదే తన ధ్యేయమన్నారు. ప్రజల ఆదాయాలు పెంచుతామని, ప్రతి ఇంటినుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నారు. ఒకప్పుడు థింక్ గ్లోబల్.. యాక్ట్ లోకల్ అనే వారమని, ఇప్పుడు థింక్ గ్లోబల్..యాక్ట్ గ్లోబల్‌గా ఉండాలన్నారు. గత ఐదేళ్లు ఏ రాక్షసుడు ఎప్పుడు వస్తాడో తెలియక ప్రజలు భయంతో బతికారని, ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా, ఆనందంగా ఉన్నారన్నారు. ప్రజలు ఇచ్చిన గెలుపుతో రాష్ట్ర పరపతి పెరిగిందన్నారు. కేవలం రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని కూటమిగా తాము ఆలోచించి నిర్ణయం తీసుకున్నామన్నారు. తన రాజకీయ జీవితంలో చూడని విజయాన్ని ప్రజలు 2024లో ఇచ్చారన్నారు. రాష్ట్రం నుంచి భూతం పోయిందని సీఎం పేర్కొన్నారు.
విజయవాడ బైపా్‌సను పరిశీలించిన సీఎం..
అమరావతి పనుల పునఃప్రారంభం అనంతరం ఉండవల్లి తిరిగి వెళ్తూ సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా వెళ్లే విజయవాడ బైపాస్ రోడ్డు పనులను మంత్రి నారాయణతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు.
టాప్ 10 విద్యాసంస్థలు వస్తాయి
అమరావతికి విట్, ఎస్‌ఆర్‌ఎం, అమృత్ యూనివర్సిటీలు వచ్చాయని, ఎక్స్‌ఎల్‌ఆర్ యూనివర్సిటీ కూడా వస్తుందని చెప్పారు. జాతీయ లా స్కూల్ కూడా ఏర్పాటు కాబోతోందని, దేశంలో టాప్-10 విద్యాసంస్థల బ్రాంచ్‌లు అమరావతికి వస్తాయన్నారు. అమరావతిలో గ్రీన్ ఎనర్జీ మాత్రం వినియోగించేలా చేస్తామన్నారు. సైకిళ్లపై తిరిగే విధంగా సైకిలింగ్ ట్రాక్‌లు, అలాగే వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. 8,603 కి.మీ పరిధిలో సీఆర్‌డీఏ, 217 చ.కిమీల పరిధిలో అమరావతి రాజధాని, 16.9 చ.కిమీ పరిధిలో కోర్ కేపిటల్ ఉంటుందన్నారు. అమరావతి ప్రాంతంలో 183 కి.మీతో ఓఆర్‌ఆర్ వస్తుందన్నారు. రాజధానిలో తలపెట్టిన పనులన్నీ మూడేళ్లలో పూర్తయి ప్రజలు గెలవాలని ఆకాంక్షించారు.
ఒక రాష్ట్రం.. ఒకటే రాజధాని
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి మధ్యలో అమరావతి ఉందని, రాజధాని ప్రాంతానికి ఓవైపు 12, మరోవైపు 12పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయని, మధ్యలో గుంటూరు నియోజకవర్గం ఉందన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని రాష్ట్రంలో ప్రతి చోటా చెప్పామన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పానని, అమరావతే రాజధాని అని విశాఖ, కర్నూలు వాసులతో ఒప్పంచానని తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు.
Updated Date - Oct 20 , 2024 | 03:09 AM