CS Nirab Kumar Prasad : 1న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ
ABN, Publish Date - Jun 28 , 2024 | 03:35 AM
సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న పింఛనుదారుల ఇంటి వద్దే పంపిణీ చేయడానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
65,18,496 మంది పింఛనుదారులకు రూ.4,399.89 కోట్లు
ఒక్కరోజులోనే పంపిణీకి ఏర్పాట్లు: సీఎస్
సీఎస్ నీరబ్ సర్వీస్ పొడిగింపు
6 నెలల పొడిగింపునకు కేంద్ర అనుమతి
1న ఇంటి వద్దే
ఒక్కరోజులోనే పంపిణీకి ఏర్పాట్లు: సీఎస్ నీరబ్ కుమార్
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న పింఛనుదారుల ఇంటి వద్దే పంపిణీ చేయడానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65,18,496 మంది పింఛనుదారులకు రూ.4,399.89 కోట్లను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు ఒక్కరోజులోనే పంపిణీ చేయించాలని సూచించారు. అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండోరోజు కూడా పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప విభాగాలకు చె ందినవారి పింఛను రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచిన నేపథ్యంలో 1వ తేదీన రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఎరియర్స్ కలుపుకుని మొత్తం రూ.7వేలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
రెండో కేటగిరీలో పాక్షిక దివ్యాంగులకు రూ.3వేల నుంచి రూ.6వేలకు, మూడో కేటగిరీలోని పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుంచి రూ.15 వేలకు, నాలుగో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.5వేల నుంచి రూ.10వేలకు పింఛను సొమ్ము పెంచిన విధంగా పంపిణీ చేయాలని సూచించారు. ఐదో కేటగిరీలోని వారికి ఏ మార్పు లేకుండా యథావిధిగా పింఛను సొమ్మును పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు. 64.75 లక్షల మంది పింఛనుదార్ల ఇళ్ల వద్ద రూ.4,369.82 కోట్లు, మిగిలిన మొత్తాన్ని రాష్ట్రంబయట ఉండే 43వేల మంది పింఛనుదారులు, బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఇళ్ల వద్ద నగదు రూపేణా పంపిణీ చేయాల్సిన పింఛను సొమ్మును 29వ తేదీ శనివారం సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌ల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. జూలై 1న ఉదయం 6 గంటల నుంచి పింఛనుదారుల ఇంటి వద్దే సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఒక్కో ఉద్యోగి 50 గృహాల చొప్పున పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అప్పగించే విధంగా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం నాటికి పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.
Updated Date - Jun 28 , 2024 | 03:35 AM