Apaar: అపా(ర్)ర కష్టాలు..!
ABN, Publish Date - Nov 11 , 2024 | 01:44 AM
ఒకే దేశం.. ఒకే విద్యా విధానం లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ర్టీ (అపార్) పేరుతో విద్యార్థులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలో జిల్లాలో మొదలైన ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఎందుకంటే విద్యాసంస్థల్లోని చాలామంది విద్యార్థుల రికార్డులకు.. వారి ఆధార్‌లోని వివరాలు సరిపోలడం లేదు. దీంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు మొదలయ్యాయి.
చిత్తూరు సెంట్రల్/కుప్పం, నవంబరు 10: జిల్లాలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు 2,85,087 మంది విద్యార్థులు చదువుతుండగా, ఇప్పటి వరకు 1,34,706 మంది (47.25శాతం) వివరాలు మాత్రమే నమోదైంది. ఇందులో ఒకటి నుంచి టెన్త్ వరకు 2,35,928 మంది విద్యార్థులు ఉండగా, ఇప్పటి వరకు 1,24,575 (52.80శాతం) మంది విద్యార్థుల నమోదు పూర్తి చేశారు. అపార్ నమోదులో పాలసముద్రం మండలం 76.14 శాతంతో టాప్‌లో ఉండగా, చౌడేపల్లె మండలం 34.13 శాతంతో లాస్టులో ఉంది.
ప్రయోజనాలివీ
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల్లో చవివే విద్యార్థులకు ప్రత్యేక ఐడీ నెంబరు కేటాయించి అపార్ కార్డులు జారీ చేస్తారు. విద్యార్థి ఒక చోట నుంచి మరోచోటుకు బదిలీ అయినప్పుడు ఈ కార్డు నంబరు నమోదు చేయగానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించకుండానే నేరుగా పైతరగతికి అప్‌గ్రేడ్ అయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటి వరకు చాలా మంది ఒకే సంవత్సరంలో రెండేసి డిగ్రీలు చేసేవారికి, అపార్ కార్డు వల్ల ఇకపై వీలుండదు. ఇదిలా ఉండగా, దేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళైనా చదువుకునే వెసులుబాటు ఉంటుంది. విద్యార్థి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. అపార్ కార్డు నెంబరు నమోదు చేస్తే చాలు ఏ విద్యాసంస్థల్లోనైనా ఇట్టే చేరి, చదువుకునే వీలుంటుంది.
ఒక్క అక్షరం తేడా ఉన్నా కుదరదు
విద్యార్థి పాఠశాలలో చేరే సమయంలో రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేస్తారు. యూడైస్ ఫ్లస్ యాప్‌లోనూ వివరాలు పొందుపర్చాల్సి ఉంది. తాజాగా అపార్ రావడంతో రిజిస్టర్, యూడై్‌స ప్లస్‌లో నమోదు చేసిన వివరాలు ఆధార్ కార్డు వివరాలతో సరిపోవాలి. లేకుంటే విద్యార్థికి అపార్ నమోదు కానట్లే. ఉదాహరణకు ఆధార్‌లో ఒక విద్యార్థి పూర్తి ఇంటిపేరుతో ఉండి, పాఠశాల రిజిస్టర్, యూడై్‌సప్ల్‌సలో కేవలం ఇంటిపేరుకు బదులుగా ఇనిషియల్‌తో పేరు నమోదై ఉంటే ఇక్కడ అపార్ నమోదు చేయడానికి వీలు లేదు. ఆధార్‌లో విద్యార్థి పేరు ఎలా ఉందో అలానే పాఠశాల రిజిస్టర్, యూడై్‌సప్ల్‌సలో నమోదు కావాలి. అదేవిధంగా పుట్టిన తేది, తండ్రి పేరు, చిరునామా ఇలా అన్ని వివరాలు ఆధార్‌లో ఎలా ఉంటే అలాగే పాఠశాల రిజిస్టర్, యూడైస్ ప్లస్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఒక్క అక్షరం, ఫుల్‌స్టాఫ్ తేడా ఉన్నా, అపార్‌లో నమోదు వీలుకాదు. అపార్ యాప్‌లో ఒకసారి ఒక అక్షరం మాత్రమే మార్చడానికి అవకాశం ఉంది. ఎన్ని అక్షరాలు తేడా ఉంటే అన్నిసార్లు నమోదు చేయాల్సి ఉండటం, మరో వైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాఠశాల, యూడైస్ ప్లస్‌లోని వివరాలను అనుసరించి ఆధార్ కార్డులో మార్పులు చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది.
కుప్పంలో రూ.5వేలు పలుకుతున్న ఆధార్ అప్డేషన్
కడా పరిధిలో ఆధార్ అప్డేషన్ సెంటర్లు చాలా పరిమితంగా ఉన్నాయి. కుప్పం పురపాలక సంఘంతోపాటు కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని ఏ ఒక్క మీ సేవా కేంద్రమూ పనిచేయడం లేదు. కుప్పం పట్టణంలో పోస్ట్ ఆఫీస్, ఎంఎ్‌ఫసీ కళాశాల వద్ద గల ఇండియన్ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకుల్లో ఏపీ ఆన్‌లైన్ ఆధార్ సేవా కేంద్రాలున్నాయి. అలాగే కుప్పం మండలంలోని చందం, మల్లానూరు, నడిమూరు, కంగుంది సచివాలయాలు, గుడుపల్లె మండలంలో గుడుపల్లె, శెట్టిపల్లె, రామకుప్పం మండలంలో రామకుప్పం, ముద్దనపల్లె, శాంతిపురం మండలంలో అబకలదొడ్డి, కెమాకులపల్లె సచివాలయాల్లో మాత్రమే ఆధార్ అప్డేషన్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఆధార్ అప్డేషన్ అవసరమైన విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే, ఈ కేంద్రాలు ఏమూలకూ సాగవు. ఉదాహరణకు కుప్పం మున్సిపాలిటీతోపాటు మండలంలో కలిపి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి దాకా చదివే విద్యార్థులు సుమారు 26వేలమంది ఉన్నారు. ఇంతమంది విద్యార్థులకు పరిమితంగా ఉన్న ఆధార్ అప్డేషన్ కేంద్రాలు సరిపోవడంలేదు. ఒక్కో అప్డేషన్ కేంద్రం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చదువులు, పనులు మానుకుని ఉదయంనుంచి సాయంత్రం దాకా క్యూలలో బారులుతీరి కనిపిస్తున్నారు. ఇదే అదనుగా దళారులు బయలుదేరారు. ఈ దళారులు ఆయా ఆధార్ అప్డేషన్ కేంద్రాల వద్ద వాలిపోయి, రూ.5వేలను ఇస్తే రెండు, మూడ్రోజుల్లో అప్డేషన్ చేసి ఇస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. గ్రామాలలో కూడా వీరి జోరు ఇటీవల ఎక్కువయింది. నిజానికి ఆధార్ అప్డేషన్‌కోసం సేవా రుసుంగా రూ.50 మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. కానీ తల్లిదండ్రులు చాలామంది క్యూలలో నిలువుకాళ్ల కష్టాలు పడలేక ఇటువంటి దళారులను ఆశ్రయించడం ఎక్కువవుతోంది.
మీసేవ కేంద్రం చుట్టూ తిరుగుతున్నా : జీవరత్నం నాయుడు, రైతు, యాదమరి మండలం
నా కుమార్తె డి.పావని నారాయణ కళాశాలలో ద్వితీయ ఇంటర్ చదువుతోంది. ఆధార్‌లో తండ్రి, తల్లి పేర్లలోని అక్షరాలు తప్పుగా ఉన్నాయి. మార్చడానికి మీ-సేవ కేంద్రం చుట్టూ నెలలుగా తిరుగుతున్నా.
బిడ్డ పుట్టిన తేదీలో తప్పుందట: గీత, గుడిపాల మండలం
నా బిడ్డ హిమసాగర్ నరహరిపేట జడ్పీహెచ్‌ఎ్‌సలో 9వ తరగతి చదువుతున్నాడు. పుట్టిన తేదీలో తప్పుందట. బడి రికార్డులో ఓ రకంగా, ఆధార్ కార్డులో మరోరకంగా ఉందంట. దీన్ని సరిచేసేందుకు ఆధార్ కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తోంది.
Updated Date - Nov 11 , 2024 | 01:44 AM