Nara Lokesh: నా గుండెల్లో బంగారుపాళ్యం
ABN, Publish Date - Sep 21 , 2024 | 01:55 AM
తన పాదయాత్రలో ఇచ్చిన తొలి హామీని అమలు చేసేందుకు వచ్చిన మంత్రి లోకేశ్ పర్యటన విజయవంతమైంది.
పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ విఫలయత్నం
మంత్రి లోకేశ్
చిత్తూరు,ఆంధ్రజ్యోతి/ బంగారుపాళ్యం: ‘బంగారుపాళ్యం నా గుండెల్లో ఉంటుంది. పాదయాత్రలో ఇక్కడ నాపైన డీఎస్పీ దాడి చేస్తే, లాఠీఛార్జికి ప్రయత్నిస్తే, స్టూల్ లాక్కుంటే ఇక్కడి ప్రజలే అండగా నిలిచారు. డీఎస్పీ తీరుతో కానిస్టేబుళ్లు కూడా సహాయనిరాకరణ చేశారు.పాదయాత్రలో మీరు నాపై చూపిన అభిమానానికి రుణం తీర్చుకోవడానికే ఈ రోజు ప్రజాప్రభుత్వంలో మంత్రిగా మీ ముందుకు వచ్చా’ అని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.యువగళం పాదయాత్రలో వంద కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని నిలబెట్టుకుంటూ శుక్రవారం ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని లోకేశ్ ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన 30 పడకల ఆస్పత్రి భవనాల్ని ప్రారంభించారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు.అనంతరం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు.
వచ్చే ఐదేళ్లలో జిల్లా సమగ్రాభివృద్ధి
వచ్చే ఐదేళ్లలో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటా. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఎవరూ చేయని విధంగా 14 నియోజకవర్గాలను టచ్ చేస్తూ 45 రోజుల పాటు 577 కిలోమీటర్ల మేర కొనసాగిన యువగళం పాదయాత్ర రికార్డు సృష్టించింది. పాదయాత్రను అడ్డుకోవడానికి బంగారుపాళ్యంలో జగన్ ప్రభుత్వంలోని పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో మీరంతా చూశారు.అప్పటి డీఎస్పీ అమరన్న చేయి పట్టుకున్నారు. నేను నిలదీస్తే నాపైనా కేసులు పెట్టారు. హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి 23 కేసులు నమోదు చేశారు.అంతేకాకుండా నా పాదయాత్రను అడ్డుకునేందుకు జీవో 1 విడుదల చేసి, ఇదే బంగారుపాళ్యంలో నా ప్రచార రథాన్ని అడ్డుకున్నారు. నా గొంతు నొక్కాలని విఫలయత్నం చేశారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళాన్ని ఆపడం వారి తరం కాలేదు.ఇక్కడి ప్రజల మద్దతుతోనే కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర దండయాత్రగా మారింది.
బంగారుపాళ్యం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్థులు అధికంగా ఉన్నారు. డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లడానికి డబ్బు, సమయం ఖర్చవుతోంది. ప్రైవేటు కేంద్రాల్లో చేయించుకోవడం ఇక్కడి పేదలకు తలకు మించిన భారం.కాబట్టే పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం, మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇక్కడ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించా. అసలు ఇక్కడ డయాలసిస్ అవసరం ఎందుకు పెరిగిందో విచారించి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని అందించే పనులు కూడా త్వరలో ప్రారంభిస్తాం.
అర్జీదారులతో కిక్కిరిసిన ‘ప్రజాదర్బార్’
బంగారుపాళ్యంలోని ఎస్‌ఎల్‌వీ కళ్యాణమండపంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.మంత్రి లోకేశ్‌కు అర్జీలు ఇవ్వడానికి, ఫొటోలు తీసుకోవడానికి పెద్దఎత్తున ప్రజలు ఎగబడ్డారు.వేతనాలు పెంచడంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు అర్జీ ఇచ్చారు. ఎలాంటి ఆలనా పాలనా లేని తన మనవరాలికి ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని బంగారుపాళ్యం మండలం టేకుమందకు చెందిన గోవిందమ్మ కోరారు. జీవో 117 రద్దుతో పాటు సీపీఎ్‌సపై నిర్ణయం తీసుకోవాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు కోరారు. గత ప్రభుత్వం చేపట్టిన స్టాఫ్ నర్సుల నియామకాల్లో జరిగిన అక్రమాలను సరిదిద్ది న్యాయం చేయాలని రామసముద్రానికి చెందిన దివ్య కోరారు. విద్యాశాఖలో సీఆర్‌ఎంటీలను రెగ్యులర్ చేయాలని ఏపీ క్లస్టర్ రీసోర్స్ పర్సన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఐరాల గ్రామంలో షాదీమహల్ పెండింగు పనులు పూర్తి చేసిన తమకు బిల్లులు మంజూరు చేయాలని జలీల్ బాషా కోరారు. తిరుపతిలో అన్యాక్రాంతమైన హథీరాంజీ మఠం భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని హధీరామ్ బావాజీ పరిరక్షణ కమిటీ కోరింది.
ఆకనంబట్టు హైస్కూల్లో ఆకస్మిక తనిఖీలు
పూతలపట్టు,సెప్టెంబరు 20:పూతలపట్టు మండలం ఆకనంబట్టు ఉన్నత పాఠశాలను మంత్రి నారా లోకేశ్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు.8, 9, 10 తరగతుల గదులను సందర్శించి లోటుపాట్లపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.బెంచీలు లేకపోవడంతో నేలపై కూర్చొని చదువుకోవాల్సి వస్తోందని విద్యార్థులు చెప్పగా, త్వరలో ఫర్నిచర్ ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. టాయిలెట్స్ పరిశుభ్రత గురించి ఆరాతీయగా...గతంలో కంపుకొట్టేవని, ప్రస్తుతం పరిశుభ్రంగా ఉంటున్నాయని విద్యార్థులు చెప్పారు. కొంతమంది విద్యార్థులు తమకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందలేదని చెప్పడంతో తక్షణమే అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.తరగతి గదులు పెచ్చులూడుతున్నాయని టీచర్లు చెప్పగా... మరమ్మతులు చేయిస్తానని హామీ యిచ్చారు.టీచర్లతో జరిగిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 70శాతం మాత్రమే ఉండడానికి కారణమేంటని ప్రశ్నించారు.పాఠశాలలకు రవాణా సౌకర్యం మెరుగుపరచాల్సి ఉందని టీ చర్లు బదులిచ్చారు.ఒక్కసారిగా ప్రభుత్వ స్కూళ్ల ను మార్చడం సాధ్యం కాదన్న లోకేశ్ మౌలిక సదుపాయాలను కల్పించి క్రమేణా విద్యాప్రమాణాలను మెరుగుపరుస్తామని చెప్పారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లలో విద్యార్థులు అనవసరమైన కంటెంట్ చూస్తున్నట్లు ఫిర్యాదులు అందిన దృష్ట్యా ట్యాబ్‌లకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.ఎమ్మెల్యేలు మురళీమోహన్, పులివర్తి నాని, మండల టీడీపీ కన్వీనర్ దొరబాబు చౌదరి, నాయకులు గంగారపు గోపి, గణపతి నాయుడు, శేషాద్రి నాయుడు, నేతాజి తదితరులు పాల్గొన్నారు.
లోకేశ్ పర్యటన విజయవంతం
చిత్తూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తన పాదయాత్రలో ఇచ్చిన తొలి హామీని అమలు చేసేందుకు వచ్చిన మంత్రి లోకేశ్ పర్యటన విజయవంతమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆయన జిల్లాకు రావడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు జనం కూడా ఆయన్ను కలిసేందుకు ఎగబడ్డారు.గురువారం రాత్రి బంగారుపాళ్యం బయల్దేరిన ఆయనకు రేణిగుంటలోని ఎయిర్‌పోర్టు నుంచి దారంతా టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. దీంతో ఆలస్యంగా బంగారుపాళ్యం చేరుకున్నారు. శుక్రవారం ఉదయాన్నే తన కోసం వచ్చిన పార్టీ శ్రేణులకు, అభిమానులకు సమయం కేటాయించి అందరితో మాట్లాడారు.ఫొటోలు దిగారు. ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. శ్రేణులతో విడిగా సమావేశమై ఉత్తమ కార్యకర్తల్ని అభినందించారు. తిరుగుప్రయాణంలో గాదంకి టోల్‌ప్లాజా వద్ద టీడీపీ నేత రమే్‌షకు చెందిన మురుగన్ టీ షాప్‌లో కార్యకర్తలతో కలసి టీ తాగారు.పాదయాత్రలో అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ బంగారుపాళ్యంలోని అన్ని కార్యక్రమాల్లో లోకేశ్ వెంటే ఉండగా.. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, పులివర్తి నాని, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, గాలి భానుప్రకాష్, గురజాల జగన్మోహన్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు సీఆర్ రాజన్, కలెక్టర్ సుమిత్‌కుమార్, జేసీ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్ర స్మృతులు
బంగారుపాళ్యంలో పాదయాత్ర సమయంలో పోలీసులు లోకేశ్ మైకు లాగేయడంతో అక్కడి భవనంపై నుంచి ఆయన ప్రసంగించారు. శుక్రవారం ఆ భవనం ఎదుట నిలబడి సెల్ఫీ తీసుకున్నారు. అలాగే యువగళం వంద కిలోమీటర్లు చేరుకున్నప్పుడు బంగారుపాళ్యంలో ఏర్పాటుచేసిన శిలాఫలకం వద్ద మరో సెల్ఫీ దిగారు.
పార్టీ కార్యకర్తలతో
‘ప్రజలు మనపై పవిత్ర బాధ్యతను పెట్టారు.అందుకే వంద రోజుల్లో అనేక హామీలను నెరవేర్చాం.టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జులు, నాయకులు ఇంటింటికీ వెళ్లి మన ప్రభుత్వం నెరవేర్చిన హామీలను వివరించాలి. మంచి పనులు చేయడంతో పాటు చేసిన పనిని చెప్పుకోవాలి.అందుకే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి’ అని టీడీపీ శ్రేణులను లోకేశ్ కోరారు.బంగారుపాళ్యంలో ఆయన బస చేసిన ప్రాంతం వద్ద టీడీపీ శ్రేణులతో ఉత్తమ కార్యకర్త, మన టీడీపీ యాప్ ఛాంపియన్స్’ సమావేశాల్ని నిర్వహించారు. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మన టీడీపీ యాప్ ద్వారా ఉత్తమ పనితీరు కనబరచిన కార్యకర్తలకు ప్రశంసాపత్రాలందించారు.
Updated Date - Sep 21 , 2024 | 01:55 AM