Tirumala: బ్రహ్మోత్సవాల వేళ
ABN, Publish Date - Oct 01 , 2024 | 02:35 AM
ఒకవైపు తిరుమల కొండమీద బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీటీడీ అధికారులూ, ఉద్యోగులూ ఆ పనుల్లో తలమునకలై ఉన్నారు. మరోవైపు ఇదే సమయంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటైన సిట్ కూడా దూకుడు పెంచింది.
తిరుమల, సెప్టెంబరు30(ఆంధ్రజ్యోతి): ఒకవైపు తిరుమల కొండమీద బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీటీడీ అధికారులూ, ఉద్యోగులూ ఆ పనుల్లో తలమునకలై ఉన్నారు. మరోవైపు ఇదే సమయంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటైన సిట్ కూడా దూకుడు పెంచింది. సోమవారం తిరుమలలో బృందాలుగా విడిపోయి విచారణ సాగించింది. మూడో రోజు సోమవారం సిట్ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి, డీఐజీ గోపినాథ్‌జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఏఎస్పీ వెంకట్రావు, సభ్యులు తిరుమలలో ఉన్న నెయ్యి, ముడిసరకుల పరీక్షాకేంద్రాన్ని తనిఖీ చేశారు. నెయ్యి ట్యాంకర్లు ఎలా వస్తాయి? నాణ్యతను ఎలా పరీక్షిస్తారు? రికార్డులు ఎలా ఉన్నాయనే అంశాల పరిశీలనతో పాటు కొన్ని రికార్డులను తీసుకున్నారు. తర్వాత నెయ్యి నిల్వ ఉంచే కేంద్రం, నెయ్యి సరఫరా అయ్యే విధానం, బూందీ తయారీ కేంద్రం, ఆలయంలోని లడ్డూ తయారీ పోటును పరిశీలించారు. తర్వాత టీటీడీ ఉన్నతాధికారులు, కొనుగోళ్ల విభాగం అధికారులతో సమీక్షించారు. పలువురు అధికారులు, ఆయా విభాగాల్లోని సిబ్బందితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా.. లడ్డూలకు వినియోగించే బూందీ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన సిట్ అధికారులు కొంతమంది పోటు కార్మికులతో మాట్లాడారు. ఈసందర్భంగా గతంలో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని అప్పటి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని సిట్ బృందానికి కొందరు పోటు కార్మికులు తెలిపినట్టు సమాచారం. నెయ్యిని చూడగానే నాణ్యత ఎలా ఉందో అర్థమైపోతుందని, కానీ గతంలో వాడిన నెయ్యిలో పూర్వపు నెయ్యి నాణ్యత కనిపించలేదని పోటు కార్మికులు సిట్ బృందం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
ఎన్‌డీడీబీకి మరో శాంపిల్?
తిరుమలకు ఓ సంస్థ పంపిన ట్యాంకర్‌లోని నెయ్యిని సిట్ సిబ్బంది శాంపిల్స్ తీశారు. వాటిని పరీక్షించే విధానాన్ని స్వయంగా పరిశీలించడంతో గతంలో నెయ్యిలో కల్తీ జరిగినట్టు నిర్ధారించిన ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు కూడా పంపనున్నట్టు తెలిసింది. ఇప్పటికీ నెయ్యిలో కల్తీ జరుగుతోందా అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
నేడు ఏఆర్ డెయిరీకి హర్షవర్ధన్‌రాజు టీం
శ్రీవారి లడ్డూప్రసాదాలకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని పంపారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న తమిళనాడులోని దిండిగల్ ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను విచారించేందుకు సిట్‌కి సంబంధించి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు బృందం వెళ్లనుంది. ఏఆర్ డెయిరీ సంస్థకు నాణ్యమైన నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఉందా, ఈ సంస్థ కేవలం టీటీడీకి మాత్రమే సరఫరా చేస్తోందా, ఇంకా ఎక్కడికైనా సరఫరా చేస్తోందా అనే అంశాలను తెలుసుకోనున్నారు. అలాగే ఈ సంస్థ నెయ్యి తయారీకి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తోంది, గతంలో టీటీడీకి ఎన్నిసార్లు సరఫరా చేసిందనే అంశాలపై విచారించనున్నారు. ముఖ్యంగా ఆసంస్థ నుంచి నెయ్యిని తీసుకువస్తున్న వాహనాలు ఎవరివి, ఆ వాహనాల డ్రైవర్లు ఎవరు,ట్యాంకర్ల సామర్య్థానికి తగ్గట్టుగానే నెయ్యిని తీసుకువస్తున్నారా, మార్గం మధ్యలో ట్యాంకర్లను ఎక్కడైనా నిలుపుతారా, ఒక వేళ కల్తీ జరిగితే ఎక్కడ జరిగే అవకాశముందనే వివిధ కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్టు తెలిసింది. ఇక, ఇప్పటివరకు జరిగిన విచారణలో దాదాపు ఐదుగురు వ్యక్తులు సంబంధం లేకుండా సమాధానాలిస్తున్నట్టు సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
Updated Date - Oct 01 , 2024 | 02:35 AM