Elephant: పంటలపై కొనసాగుతున్న గజదాడులు
ABN, Publish Date - Oct 21 , 2024 | 01:30 AM
పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పాతపేట పంచాయతీ పూరేడువాండ్లపల్లె, బోడిరెడ్డిగారిపల్లె పంచాయతీ ఆవులపెద్దిరెడ్డిగారిపల్లె వద్ద ఆదివారం వేకువజామున ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో అపారనష్టం వాటిల్లింది.
కల్లూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పాతపేట పంచాయతీ పూరేడువాండ్లపల్లె, బోడిరెడ్డిగారిపల్లె పంచాయతీ ఆవులపెద్దిరెడ్డిగారిపల్లె వద్ద ఆదివారం వేకువజామున ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో అపారనష్టం వాటిల్లింది. ఉదయం కల్లూరు మీదుగా చిత్తూరు రోడ్డులోని పెట్రోల్ బంకు సమీపంలో తూర్పు అటవీ విభాగంలోకి ఏనుగుల గుంపు చేరుకుంది. దీంతో కోటపల్లె, జూపల్లె, పాళెం ప్రజలు తమ పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తాయని భయాందోళన చెందుతున్నారు. ఆవులపెద్దిరెడ్డిగారిపల్లెలోని రమణయ్యకు చెందిన అర ఎకరా వరి, తిరుమలయ్యకు చెందిన అర ఎకరా వరి, కౌలురైతు రామయ్యకు చెందిన అర ఎకరా వరిపంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. పూరేడువాండ్లపల్లెలోని శిద్దయ్యకు చెందిన ఎకరా వరి, వాసుకు చెందిన ఎకరా వరి, శేఖర్‌కు చెందిన అర ఎకరా వరి, పశుగ్రాసం, పూలతోటను నాశనం చేశాయి. కల్లూరులోని శ్రీనివాసులు మామిడితోటకు అమర్చిన రాతికూసాలను విరిచేశాయి. ధ్వంసమైన పంటలను పశ్చిమ అటవీ విభాగం డిప్యూటీ రేంజర్ కుప్పుస్వామి, ఎఫ్‌బీవో శ్రీదేవి పరిశీలించారు. బాధిత రైతుల వివరాలను ఉన్నతాధికారులకు పంపుతామని, నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు.
Updated Date - Oct 21 , 2024 | 01:30 AM