Suspension: గాలేరు-నగరి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సస్పెన్షన్
ABN, Publish Date - Aug 31 , 2024 | 12:51 AM
తిరుపతి జిల్లా గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణ విభాగం 1వ యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.కోదండరామిరెడ్డిని రాష్ట్రప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసింది.
తిరుపతి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణ విభాగం 1వ యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.కోదండరామిరెడ్డిని రాష్ట్రప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసింది. ఇదివరకూ ఓ రిట్ పిటిషన్‌కు సంబంధించి ఈయన హైకోర్టుకు కౌంటర్ అఫిడవిట్ సక్రమంగా దాఖలు చేయలేదని, దాంతో కోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని జలవనరుల శాఖ నివేదించిన నేపధ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
కోదండరామిరెడ్డి గతంలో అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్డీవోగా పనిచేశారు. ఆ సమయంలో అక్కడి గాలేరు-నగరి ప్రాజెక్టు భూసేకరణ విభాగం 4వ యూనిట్‌కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలతో పనిచేశారు. అప్పట్లో భూసేకరణ వివాదానికి సంబంధించి కె.నాగిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ (నంబరు 119-2022) దాఖలు చేశారు. ఈ కేసులో కోదండరామిరెడ్డి కౌంటర్ అఫిడవిట్‌ను సక్రమంగా దాఖలు చేయకపోవడంతో విచారణ సందర్భంగా హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. దీంతో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా కోదండరామిరెడ్డి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే సమయంలో ఆర్ అండ్ ఆర్ పాలసీ-2005, ఆర్‌ఎ్‌ఫసీటీ ఎల్‌ఏ ఆర్ అండ్ ఆర్ యాక్ట్ -2013 చట్టాల్లోని అంశాలను విస్మరించారని, హైకోర్టుకు వాస్తవాలను వివరించడంలో విఫలమయ్యారని గుర్తించారు. ఈ కారణంగానే హైకోర్టు ఎదుట ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ప్రస్తుతం తిరుపతి జిల్లా గాలేరు-నగరి ప్రాజెక్టు 1వ యూనిట్ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న కోదండరామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - Aug 31 , 2024 | 12:51 AM