Chittoor: చిత్తూరు జిల్లాలో స్తంభించిన జనజీవనం
ABN, Publish Date - Dec 01 , 2024 | 01:04 AM
ఫెంగల్ తుపాను ప్రభావంతో శనివారం రోజంతా మబ్బులు కమ్మేయడంతో పాటు చల్లటి గాలులు వీయడం,తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది.
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఫెంగల్ తుపాను ప్రభావంతో శనివారం రోజంతా మబ్బులు కమ్మేయడంతో పాటు చల్లటి గాలులు వీయడం,తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది.రోజువారీ పనులపై ఆధారపడ్డ జనం వర్షంతో బయటకు రాలేకపోయారు.చిరువ్యాపారులు దుకాణాలు తెరచుకోలేక నష్టపోయారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా 50శాతం మాత్రమే ఉద్యోగుల హాజరు నమోదయ్యింది.
నగరిలో 108.6 మిమీ వర్షపాతం
శనివారం పలు మండలాల్లో వానలు కురిశాయి. అత్యధికంగా నగరిలో 108.6మిమీ, అత్యల్పంగా రామకుప్పంలో ఒక మిమీ వర్షపాతం నమోదయ్యింది. నిండ్రలో 77మిమీ, కార్వేటినగరంలో 62.4, విజయపురంలో 60.2, పాలసముద్రంలో 40.4, రొంపిచెర్లలో 36.8, శ్రీరంగరాజపురంలో 33.6, పులిచెర్లలో 32.2, ఐరాలలో 27.4, తవణంపల్లెలో 24.8, వెదురుకుప్పంలో 24.8, సదుంలో 24.4, పెనుమూరులో 24.4, బంగారుపాళ్యంలో 23.4, సోమలలో 23, పూతలపట్టులో 22.6, గుడిపాలలో 21.6, యాదమరిలో 21, చిత్తూరు రూరల్‌లో 18.4, గంగవరంలో 17.8, పలమనేరులో 17.2, గంగాధరనెల్లూరులో 17.2, చిత్తూరులో 17, బైరెడ్డిపల్లెలో 14.8, వి.కోటలో 12, చౌడేపల్లిలో 11.4, పెద్దపంజాణిలో 10.2, శాంతిపురంలో 9.6, పుంగనూరులో 9.6, కుప్పంలో 5.4, గుడుపల్లిలో 2.2 మిమీ వర్షపాతం నమోదయ్యింది.
విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో...
చిత్తూరు రూరల్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తితే పరిష్కారం కోసం కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు.చిత్తూరు రూరల్ డివిజన్ పరిధిలో 9491052934 ఫోన్ నెంబరును,అర్బన్ డివిజన్ పరిధిలో 9440817419 నెంబరును, పుంగనూరు పరిధిలో వినియోగదారులు 9154953764నెంబరును సంప్రదించాలన్నారు.
యంత్రాంగం అప్రమత్తం
భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించడంతో కలెక్టర్ సుమిత్‌కుమార్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.అవసరమైన లోతట్టు ప్రాంతాలవారికి సహాయ సహకారాలందించేందుకు సిద్ధంగా వుండాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మండలస్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సెలవులో వున్న అధికారులందరూ హెడ్‌క్వార్టర్లకు చేరుకోవాలని ఆదేశించారు. చెరువుకట్టలు, కాలువకట్టల పర్యవేక్షణపై దృష్టి పెట్టాలన్నారు. వాగులు, వంకలు, కాలువల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్, రెవిన్యూ అధికారులను ఆదేశించారు.
సాయంకోసం కంట్రోల్ రూమ్స్
వర్ష బాధితులకు సహాయమందించేందుకు కలెక్టరేట్‌లోని పాత గ్రీవెన్స్‌హాలులో 24 గంటలూ పనిచేసేవిధంగా కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు.8గంటలకోసారి షిఫ్టు మారేవిధంగా రెవిన్యూ సిబ్బందికి కంట్రోల్‌రూమ్‌లో విధులు కేటాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. మండలకేంద్రాల్లో సైతం కంట్రోల్‌రూములను ఏర్పాటు చేశారు.అవసరమైనవారు కలెక్టరేట్ కంట్రోల్‌రూమ్ నెంబరు 94910 77356, ల్యాండ్‌లైన్ : 08572 - 242777, చిత్తూరు ఆర్డీవో కార్యాలయం : 94910 77011, కుప్పం ఆర్డీవో కార్యాలయం : 99660 72234, నగరి ఆర్డీవో కార్యాలయం : 96521 38325, పలమనేరు ఆర్డీవో కార్యాలయం : 94910 74510నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
Updated Date - Dec 01 , 2024 | 01:04 AM